నెమలి రాజుగారి మాటలు విని దూరదర్శి అన్నది- " ప్రభూ! నేను 'యుద్ధం వద్దు- సంధి చేసుకుందాం' అనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మన సైన్యంలో పేరుగాంచిన యోధులు అనేకమంది మొన్నటి యుద్ధంలో స్వర్గస్తులయ్యారు. ఇక బ్రతికి ఉన్నవాళ్లలో కూడా చాలా మంది శరీరాల నిండా గాయాలతో, యుద్ధానికి పనికి రానట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎవ్వరికీ శక్తి లేదు. ఇట్లాంటి శక్తి లేనివాళ్లను వెంట బెట్టుకొని పోయి, 'మేమే శూరులం' అని శత్రువుతో పోరాటానికి దిగితే కష్టం. మనవాళ్లు తమ శక్తికి మించి పోరాటం చేసినా సరే, చివరికి మనకు భంగపాటు తప్పదు.

ఇక, 'మన శత్రురాజు మహాబలుడు ఈ సమయంలోనే యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు?' అనేది కూడా కొంత ఆలోచించాలి. అతను యుద్ధానికి దిగింది హంసరాజు మంత్రి సర్వజ్ఞుడి ప్రేరేపణ చేతనే తప్ప, సొంత ఆలోచనవల్ల కాదు. "గతంలో నాకు అవమానం జరిగింది; ఇప్పుడు దానికి తగిన ప్రతీకారం సాధించుకుంటాను' అనే కోరిక కూడా దానికి కొంత తోడై ఉండవచ్చు- కానీ, తన స్నేహితుడైన హిరణ్యగర్భుడి మనోరథం నెరవేరితే, ఇతను కూడా సంతృప్తి చెంది తన నగరానికి తిరిగి పోతాడు- సందేహం లేదు. అందుచేత మనం ఇప్పటికైనా హంసరాజు హిరణ్యగర్భుడిని మంచి చేసుకొని, సమాధాన పరచుకోవటం అవసరం.

అందుకని, ముందుగా హంసరాజు దగ్గరికి మన దూత ఒకడు బయలుదేరి పోవాలి. అట్లా వెళ్లిన దూత పనిని నెరవేర్చుకొని మళ్లీ మనల్ని చేరుకొనే లోపలే ఈ మహాబలుడి సైన్యం వల్ల అపాయం రాకూడదు- అందుకని ఇప్పటికిప్పుడు మరొక రాయబారిని మహాబలుడి దగ్గరికి పంపాలి. అట్లా చేస్తే అంతా మనకు అనుకూలంగా అరుగుతుంది" అన్నది. నెమలి రాజు కూడా "అంతే" అని అంగీకరించాడు.

వెంటనే మంత్రి దూరదర్శి రాజుగారి అనుమతితో అరుణముఖుడిని పిలిపించింది. ఏమేం చెప్పాలో అతనికి అర్థమయ్యేట్లుగా చెప్పి పలికించింది. 'కార్యం నెరవేర్చుకొని రా' అని పంపించింది.

చిలుక అరుణముఖం కూడా సరైన దుస్తులు ధరించింది; నగరం బయట వనంలో శత్రువులు విడిది చేసి ఉన్న స్థలానికి వెళ్లింది. అక్కడి కాపలాదారులకు తాను వచ్చిన పనిని వివరించింది. సైనికులంతా గుంపులు గుంపులుగా తనను చూస్తుండగా పోయింది; వనం మధ్యభాగంలో ఒకచోట, చందన వృక్షాల సమీపంలో, ఓ పొదరింట్లో విడిదిచేసి ఉన్న మహాబలుడిని సందర్శించింది. ఆ రాజుకు, మర్యాద పూర్వకంగా నమస్కరించింది.

అతని ఆజ్ఞానుసారం దగ్గరగా ఒక ఆసనం మీద కూర్చొని చేతులు జోడించి అన్నది- "ప్రభూ! జంబూ ద్వీపానికి అధినాధులైన చిత్రవర్ణ మహారాజుల వారు తాముగా ప్రభువులవారికి వినిపించమన్న మాటల్ని విన్నవించు-కుంటాను; చిత్తగించగలరు: "ఇరుగు పొరుగు దేశాలకు ప్రభువులమై, మనలో మనం ఇట్లా కలహించుకోవటం, అకారణంగా ఒకరిపై ఒకరు కోపం పెంచుకోవటం, జాతి ధర్మాన్ని మరచి, ఇతరులు మనల్ని వేలెత్తి చూపే విధంగా ప్రవర్తించటం మంచిదికాదు. మనం ఐకమత్యంగా ఉంటూ, స్నేహంతోటీ, సోదరభావంతోటీ మెలగితే మూడు లోకాలూ కలిసి వచ్చినా మన వైపుకు కన్నెత్తి చూడగలరా?” "గతంలో ఏ విధి వ్రాత వల్లనో మన మనసులలో కోపం అనే అగ్ని పొడజూపింది. నిష్కారణంగానే అది మెల్లమెల్లగా రగులుకొని, ప్రజ్వరిల్లింది. మన మనస్సులో కోపాలను కాపురం ఉండనివ్వటం అనేది మనిద్దరికీ క్షేమంకరం కాదు. 'ఇకపైన మనం ఇద్దరం ఒకరి పట్ల ఒకరం స్నేహ భావం అవలంబించి, మీరు ఆడిన మాట మేము, మా మాట మీరు చెల్లించుతూ కలిసి ఉండటం మేలు'- అని మా అభిప్రాయం. కర్పూర ద్వీపాధీశుడైన హిరణ్యగర్భుడు మనకు ఇద్దరికీ ప్రాణమిత్రుడిగా ఉండదగినవాడు. అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చామని తెలియజేస్తూ, 'మాకు స్నేహితుడిగా మెలగవలసినది' అని కోరుతూ, ఈ రోజే దూతను పంపాను"

అని చెప్పి ఊరుకున్నది అరుణముఖం. మహాబలుడు కూడా కొంతసేపు ఆలోచించాడు. తన సైన్యం కూడా ప్రయాణపు బడలికలో ఉన్నది. అందువల్ల, వచ్చిన పని తనకు అనుకూలంగానే ముగిసే లక్షణాలు కనిపించటం చేత, 'సంధి చేసుకోవటమే ఇప్పటికి మేలు' అని నిశ్చయించాడు; పూర్వపు శతృత్వాన్ని వదిలి సంధికి అంగీకరించాడు. ఆవిధంగా మహాబలుడికి, చిత్రవర్ణుడికి 'కపాలసంధి' (అంటే ఇరుపక్షాలు సమాన లాభనష్టాలతో చేసుకున్న సంధి) కుదిరింది.

అటుపైన చిత్రవర్ణుడు మంత్రి దీర్ఘముఖుడితో చర్చించి, హంసరాజు హిరణ్యగర్భుడి పేర ఒక లేఖ వ్రాయించింది. ఆ లేఖను తీసుకొని-పోయి, హంసరాజుకు ఇచ్చి, అతనితో తాను చెప్పిన విధంగా మాట్లాడి, మెప్పించి, పని నెరవేర్చుకొని వచ్చేందుకు ఎవరు తగిన వారు...? 'అరుణముఖుడే' అని నిశ్చయిం-చుకున్నది. "నువ్వే ప్రయాణం అయివెళ్లు. త్వరగా తిరిగి రా" అని దాన్ని కర్పూరద్వీపానికి పంపింది.

"అటుపైన అరుణముఖుడు వెనక్కి తిరిగి రావటం కోసం ఎదురుచూస్తూ, రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నది. ఇక అక్కడ అరుణముఖుడు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత కర్పూరద్వీపాన్ని చేరుకొన్నది. రాజధానికి పోగానే ముందుగా మంత్రి సర్వజ్ఞుడిని కలిసి, తాను వచ్చిన పనిని తెలియజేసింది.

సంగతి వినిన సర్వజ్ఞుడు సంతోషించి, దాన్ని వెంటబెట్టుకొని హిరణ్యగర్భుడు రహస్యంగా నివసిస్తున్న తావుకు తీసుకొని పోయింది. ఆ సమయానికి హంసరాజు తనకు ఇష్టమైన వారితో ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నది. అరుణముఖం హంసరాజును చూసి, నమస్కారపూర్వకంగా తనను తాను పరిచయంచేసుకొని, చక్కగా, మేలు కూర్చేదానిలాగా మాట్లాడింది. "జంబూద్వీపానికి ప్రభువైన చిత్రవర్ణులవారు తమరి సుగుణాలను అనేకమంది ప్రశంసించగా విని, సంపూర్ణ హృదయంతో మెచ్చుకొన్నారు. ప్రభువులవారితో స్నేహాన్ని కోరి, నన్ను ఇక్కడికి పంపించారు.

ఈ నాటినుండి తమరు ఎప్పటిలాగే కర్పూరద్వీప రాజ్యాధికారాన్ని స్వీకరించాలనీ, అద్భుతంగా పరిపాలించాలనీ, చిత్రవర్ణ మహారాజుల వారితో స్నేహ సౌహార్దాలను అనుభవించాలనీ వారి కోరిక" అని లేఖను చేతికి ఇచ్చాడు. దానిని తీసుకొన్న హిరణ్యగర్భుడు మంత్రి సర్వజ్ఞునికేసి చూశాడు. ఇద్దరూ కలిసి కొద్దిసేపు ఆలోచించాక, రాజుగారు స్వహస్తాలతోటే తగిన జవాబు రాసి, తన రాయబారి అయిన ధవళాంగుని చేతికి ఇచ్చి, "ధవళాంగా! నువ్విప్పుడే యీ అరుణ-ముఖునితో కలిసి జంబూ ద్వీపానికి పో. అక్కడ చిత్రవర్ణ మహారాజుల వారిని దర్శించుకొని, తగిన మంచి పలుకులతో వారిని మెప్పించి, యీ లేఖను వారికి ఇచ్చిరా" అని చెప్పింది. అరుణముఖాన్ని కూడా తగిన విధంగా గౌరవించి, చెప్పవలసినవన్నీ చెప్పి పంపించింది.

ధవళాంగుడు, అరుణముఖుడు ఇద్దరూ ఒకరితో ఒకరు స్నేహంగా మాట్లాడుకుంటూ, మార్గాయాసం తెలీకుండా ఎగిరిపోయి, కొన్ని రోజులకు జంబూద్వీపం చేరారు. ఆ సమయానికి చిత్రవర్లుడు కొలువు తీరి ఉన్నాడు. వీళ్లిద్దరూ ఆయన పాదాలను దర్శించుకొని, హంసరాజు సందేశాన్ని సమస్తం నివేదించారు. ఆ వెంటనే మహాబలుడు కూడా 'స్నేహితుడి పని పూర్తయింది గదా' అని సంతోషించి, చిత్రవర్ణుడి ఆతిథ్యాన్ని స్వీకరించి, సంతోషంగా తన సైన్యంతో సహా స్వదేశానికి వెళ్లాడు.

ఆనాటి నుండి మహాబలుడు, చిత్రవర్ణుడు, హిరణ్యగర్భుడు ఒకరికి ఒకరు గాఢమైన మిత్రులై, ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు ఉత్తరాల ద్వారా కనుక్కుంటూ, చిరకాలం సుఖంగా రాజ్యపాలన చేశారు"

అని విష్ణుశర్మ 'సంధి' తంత్రాన్ని సంపూర్ణంగా చెప్పి, "మీరు కూడా ఇతర రాజులు అందరితోటీ సంధి చేసుకొని, ఐకమత్యం పెంచుకొని, సుఖంగా ఉండండి" అని ఉపదేశించాడు.

రాజకుమారులు పంచతంత్రాన్ని పూర్తిగా విని, సంతోషించి "ఆర్యా! తమరి దయవల్ల అజ్ఞానం అనే చీకటినుండి వెలువడి, జ్ఞానం అనే సూర్యుడిని సందర్శించగలిగాం!" అని విష్ణుశర్మను స్తుతించారు.

ఆ విధంగా నీతిని, ధర్మాన్ని గ్రహించి జ్ఞానవంతులైనారు రాజకుమారులు. వాళ్లను వెంటబెట్టుకొని పోయి, సుదర్శన మహారాజుకు అప్పగించాడు విష్ణుశర్మ.

కుమారులు జ్ఞానవంతులు అయినందుకు సంతోషించిన సుదర్శనుడు విష్ణుశర్మను అనేక విధాలుగా ప్రశంసించి, సన్మానించాడు; ఒక అగ్రహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. విష్ణుశర్మ ఆ బహుమతులను అన్నింటినీ స్వీకరించి, సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చాడు.