నా పేరు బంతి. నేను ఒక అబ్బాయిని. ఐదో తరగతి చదువుతున్నాను. నేను చాలా లావుగా ఉంటాను. చాలా బరువుగా కూడా ఉంటాను. బాగా గట్టిగా కూడా ఉంటాను. ఎంతో బద్ధకంగా కూడా ఉంటాను. నాకు ఇష్టం ఐనవి- నవ్వటం, పుస్తకాలు చదవటం, లెక్కలు చేయటం, అన్నింటికంటే మించి పుస్తకాలను స్టేపుల్ చేయడం.
నేను నల్లగా ఉండటం వల్ల మా మిత్రులందరూ నన్ను 'నల్ల పిల్లి' అని పిలుస్తారు. వాళ్ళు అట్లా పిలిస్తే నేనేమీ నొచ్చుకోను. నిజానికి నన్ను ఎవరైనా 'బంతీ' అని పిలవటం కంటే 'నల్ల పిల్లి' అని పిలవటమే నాకు ఇష్టం. నాకు పాములంటే భయం. పాములంటే అందరికీ భయమే, ఎలాగూ.
ఒకరోజున నేను నవ్వుతూ-నవ్వుతూ ఒక బల్లమీద పడ్డాను. వెంటనే అది కాస్తా తుక్కు-తుక్కు అయిపోయింది. మా అమ్మ వచ్చి 'ఇదేంట్రా, ఇట్లా అయ్యింది?' అన్నది. 'ఈమధ్య బల్లల్ని గట్టిగా చేయట్లేదు- మరీ సున్నితంగా ఉంటే ఇట్లాగే కదా, అయ్యేది?! ఏమీ పరవాలేదులే ' అని నేను మా అమ్మను సముదాయించాను.
మరో నాడు రాత్రి- విద్యుత్తు పోయింది. అప్పుడు నేను లేచి, చీకట్లో కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుందో చూద్దామను-కున్నాను. అయితే కాళ్ళు తుడుచుకునే పట్టాకు ఆ సంగతి తెలియలేదు. దాని మీద నా కాలు పడగానే, అది జారి గోడ వరకూ పోయింది. దాంతో నేను పోయి బీరువా మీద పడ్డాను. బీరువాలో సామాన్లు నా అంత బరువుగా లేవు కదా, అందుకని అది క్రింద పడిపోయింది. దానికో పెద్ద సొట్ట పడింది. "ఇదేంటిరా, ఇట్లా అయ్యింది?" అంది మా అమ్మ. "బీరువాను బలంగా చేయకపోతే ఇట్లాగే కదా, అయ్యేది?! ఏమీ పరవాలేదులే' అని నేను సముదాయించాల్సి వచ్చింది మళ్ళీ.
మా ఇంటి ముందరే ఒక డ్రైనేజ్ కాలువ ఉంది. కాలవలో మురికి నీళ్ళు ఆగి ఆగి పోతూ ఉంటాయి. కాలవ ప్రక్కన నిలబడి ఆ నీళ్లని చూస్తూ ఉండటం అంటే నాకు చాలా ఇష్టం.
అయితే నిన్న నేను అట్లా నిలబడి చూస్తూ ఉంటే ఒక ఈగ వచ్చి నా కాలి మీద వాలింది. నేను దాన్ని తరిమాను. అది మళ్ళీ వాలింది. నేను మళ్ళీ తరిమాను. అది మళ్ళీ వచ్చి వాలింది.
చివరికి నేను దాన్ని ఏడిపించాలని, అక్కడే నిలబడి డ్యాన్సు చేయటం మొదలు పెట్టాను. అంతలోనే ఏమైందో మరి, నేను డ్రైనేజ్ కాలువలో తలక్రిందులుగా పడి ఉన్నాను. అక్కడే ఇరుక్కుపోయాను కూడా- బయటికీ రాలేను; లోపలికీ పోలేను. నన్ను చూసి ఎవరో "నల్ల పిల్లి కాలవలో ఇరుక్కుపోయింది" అన్నారు. అనటమైతే అన్నారు; కానీ ఎవ్వరికీ నన్ను బయటికి లాగేంత బలం లేకుండింది. అట్లా నేను రెండు గంటల సేపు అక్కడే ఉన్నాను. దాంతోటి ఊళ్లో ఉన్న అన్ని డ్రైనేజీ కాలువలు బ్లాక్ అయిపోయాయట. ఇళ్ళలో మురికి అంతా టాయిలెట్లలోంచి బయటికి ఉరికిందట. ఊరంతా కంపే.
అయితే ఒక వింత సంగతి ఉంది. ఊళ్లో జనాలంతా 'కంపు కంపు' అని మొత్తుకుంటూ ఉంటే నేను మాత్రం అదే కంపుని సువాసన అనుకొని పీలుస్తూ పోయాను. అది ఎలా జరిగిందో మరి, నాకు ఇంకా అర్థం కాలేదు. మీకేమైనా తెలుసా?