ఎప్పటిలాగే ఆఫీస్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు సాయి. ఇంటి బయట తన కారు పార్క్ చేసి ఉంది.
సాయి ఇంటి ప్రక్కనే ఉంటాడు శ్రీరాం. చాలా స్నేహంగా మాట్లాడతాడు. రోజూ సాయంత్రం ఆఫీసునుండి రాగానే సాయి, శ్రీరాం ఇద్దరూ కలిసి ఏవో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇంకా పెళ్ళి కాలేదు; ఇద్దరూ ఎవరికి వాళ్ళు వంట చేసుకుంటారు; దాంతో ఏవో పప్పుల కోసమూ, ఉప్పుల కోసమూ కూడా తరచు ఇద్దరూ కలుస్తుంటారు, ఉదయం ఆఫీసులకి వెళ్ళేముందు కూడా.
ఆరోజు అప్పటికే బాగా ఆలస్యం అయింది సాయికి. హడావిడిగా టిఫిన్ చేసి, బాక్సు సర్దుకునేంతలో తలుపు చప్పుడయింది. కాలింగ్ బెల్ మ్రోగింది.
"వస్తున్నా!" అంటూ తలుపు తీసిన సాయి నిర్ఘాంతపోయాడు- ఎదురుగుండా ఇద్దరు పోలీసులు- చేతిలో బేడీలతో నిలబడి ఉన్నారు.
"నీ పేరు?" అడిగారు వాళ్ళు.
"సాయి"
"ఇంటి పేరు?"
"మక్కల"
"మక్కల సాయి- వీడే- రాసుకో" అన్నాడో పోలీసు. రెండోవాడు ఏదో శ్రద్ధగా రాసుకున్నాడు.
"తండ్రి పేరు?" అడిగారు.
చెప్పాడు సాయి. "ఎందుకండీ అడుగుతున్నారు? ఏమయింది?"
"నీకు తెలీదా? పద, స్టేషనుకు. సార్ రమ్మంటున్నారు"
"ఏ సార్?"
"ప్రధానమంత్రిగారు. నీ కోసం ప్రధాని స్వయంగా కబురు పంపుతున్నారు రా, నీ పెళ్ళి చేస్తారట! పల్లకీ పంపారు; ఎక్కి రమ్మంటున్నారు! మర్యాదగా వస్తావా, రావా?!" చెయ్యెత్తాడు పోలీసు. సాయి ఇంకేమీ అడగకుండా వాళ్ల వెంట బయలుదేరి పోయాడు.
పోలీస్ స్టేషన్లో సాయిని నేరుగా దొంగల్ని ఉంచే చోటికి తీసుకెళ్ళి నిలబెట్టారు. యస్సై వచ్చి అడిగాడు. "నువ్వే కదా, సాయి? APZX 54321 కారు నీదేనా?" అని.
"అవునండీ, ఏంటి సంగతి?" అడిగాడు సాయి, మర్యాదగా.
"అది నేను అడగాలి- ఏం చేసావురా, వాడిని?"
"ఎవరిని సార్?"
"వామ్మో, వామ్మో!ఎంత చక్కగా అడుగుతున్నావమ్మా! నంగనాచిలాగా? మర్యాదగా చెప్పు- ఏం చేశావు వాడిని? ఎందుకు చంపావు?"
"ఎవరిని?! నేను ఎవ్వరినీ ఏమీ చెయ్యలేదు సార్!"
"ఇదిగో, నేను నీలాంటి వాళ్లని లెక్క లేనంత మందిని చూశాను. అసలు నీలాగా కండలు పెంచేవాళ్లంటే నాకు తెగ మంట. నీ కండలన్నీ వదిలించేస్తాను- మర్యాదగా శ్రీరాంని ఏం చేసావో చెప్పు- ఎందుకు చంపావు వాడిని?"
సాయి నిర్ఘాంతపోయాడు. తను శ్రీరాంని చంపటమేమిటి?
కానీ పోలీసులు అతని మాటలు వినలేదు. ఇష్టంవచ్చినట్లు లాఠీలతో చితక బాదారు. మళ్ళీ మళ్ళీ బెదిరించారు- నిజం చెప్పమని. కానీ తను ఏం చెప్పగలడు? శ్రీరాంని తను చూసింది నిన్న రాత్రే. అతన్ని ఎవరు చంపి ఉంటారు? ఎందుకు చంపారు?
వాళ్ల మాటల వల్ల సాయికి సంగతేంటో కొంచెం కొంచెంగా అర్థమైంది. "నిన్న రాత్రి శ్రీరాం హత్యకు గురయ్యాడు. హంతకులు తాము ఉపయోగించిన కత్తిని తను అక్కడ నిలిపి ఉంచిన కారు డిక్కీలో పడేసి పోయారు. ఆ సమయానికి తన కారు డిక్కీకి తాళం వేసి లేదు. ఉదయాన్నే పోలీసులకు ఆ సమాచారం అంది, వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. పోలీసు కుక్కలు వాసన పట్టి, కారు డిక్కీని చూపించాయి. అందుకని పోలీసులు ఇప్పుడు తనని అనుమానిస్తున్నారు.."
ఆ రోజంతా పోలీసులు సాయిని రకరకాలుగా వేధించారు. సాయి ఒళ్ళంతా హూనం హూనం అయ్యింది. సాయంత్రం అవుతుండగా ఇద్దరు పోలీసులు వచ్చి అతన్ని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళారు. జడ్జిగారు అడిగారు- "చూస్తుంటే మర్యాదస్తుడిలాగా ఉన్నావు. హత్య ఎందుకు చేసావు?" అని. సాయి కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయి ఆయనకు మొరపెట్టుకున్నాడు- "సర్, నేను అమాయకుడిని. హంతకులెవరో ఆ కత్తిని తెచ్చి నా కారు డిక్కీలో వేసి ఉంటారు. డిక్కీకి తాళం వేసి లేదు కదా. నన్ను కాపాడండి" అని.
జడ్జిగారు పోలీసులను అడిగారు- "ఇతని వేలిముద్రలు తీసుకున్నారా? అవి హత్యా ప్రదేశంలోని వేలిముద్రలతో సరిపోయాయా?" అని.
"తీసుకున్నాం సర్, కానీ అక్కడున్న ముద్రలు వేరు, ఇతని వేలి ముద్రలు కావు అవి" చెప్పారు పోలీసులు.
"మరి మీ కుక్కలు ఇతన్ని గుర్తుపట్టి చూపాయా?"
"లేదు సర్, ఇతని కారును చూపించాయంతే"
"మరయితే ఇతన్ని పట్టుకొచ్చారెందుకు? ఇతను హంతకుడికి ఏమవుతాడు?"
"ఇతను ఉండేది ఆ పక్క ఇంట్లోనే సర్. అతను ఇతనూ మిత్రులు"
"అంతకు మించి వేరే ఏ సంబంధమూ లేనప్పుడు, మీ దగ్గర వేరే ఆధారాలేమీ లేనప్పుడు, ఇతన్ని పోలీసు రిమాండ్‌లో ఉంచేందుకు నేను ఒప్పుకోను. ఇతని తరపు లాయరును పిలిపించండి. వెంటనే బెయిలు ఇచ్చి పంపించండి. ఇదిగో మిస్టర్ సాయి, పోలీసులు ఇప్పటికి నిన్ను వదిలేస్తారు. కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు కోర్టులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కోర్టువారికి ఒక పూచీకత్తు బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది- పదివేల రూపాయల్ని బ్యాంకులో జమ చేయాలి. ఈ కేసు పూర్తయేంతవరకూ ఆ డబ్బును ముట్టుకునే వీలుండదు. సరేనా?"
సాయి ఇంటికి వచ్చేసాడు, కానీ అతని మనసు మనసులో లేదు. "శ్రీరాం హత్యకు గురవ్వటం ఏంటి? ఎవరు చంపారు అతన్ని? ఎందుకు చంపారు?" బక్కెట్లో నీళ్ళు తీసుకొచ్చి కారును శుభ్రం చేస్తూ ఆలోచిస్తున్నాడు- "కారు డిక్కీ తలుపు ఎందుకు తెరిచి ఉన్నది? నేనెప్పుడూ తాళం వేసే ఉంచుతానే?". డిక్కీ తలుపుకు ఉన్న హ్యాండిల్‌ని పరిశీలిస్తే అర్థమైంది- "ఓహో! డిక్కీకి తాళం వేసే ఉండింది. కానీ వాళ్ళెవరో ఏదో సుత్తిలాంటి బరువైన వస్తువుతో కొట్టి, తాళాన్ని విరిచేసారు.."
అంతలో అతని దృష్టి కారు ప్రక్కనే ఉన్న పెద్ద బండరాయి మీద పడింది- "ఈ రాయి సాధారణంగా రోడ్డుకు అవతలివైపున పడి ఉండేది- మరి ఇక్కడికెలా వచ్చింది?"
సాయి మెల్లగా ఆ బండ ఎప్పుడూ పడి ఉండే చోటుకు పోయాడు. రాయి నిన్నటి వరకూ ఇక్కడే ఉండింది- దాని గుర్తులు ఇంకా ఉన్నై, అక్కడ మట్టిలో.
"దీన్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళారు? డిక్కీ తాళాన్ని పగలగొట్టేందుకు ఈ రాయిని వాడారన్నమాట!"
బండ ఉండిన ప్రాంతాన్ని పరిశీలించాడు సాయి. అక్కడికి దగ్గర్లోనే, గడ్డిలో మెరుస్తూ కనిపించింది ఒక చేతి గడియారం! గడియారం కొత్తదే, సిటిజన్‌ది. బాగా ఖరీదైనదేమీ కాదు; కానీ సిటిజన్ కంపెనీ డీలరు ఈ ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు! సాయి ఆ గడియారాన్ని పట్టుకొని తమ ఊళ్ళో ఉన్న సిటిజన్ కంపెనీ డీలరు దగ్గరికి వెళ్ళాడు. ఆ డీలరు తనకు పరిచయమే. "రండి రండి సాయిగారూ! చెప్పండి- నేను మీకేం సాయం చేయగలను?" నవ్వుతూ అన్నాడు డీలరు.
సాయి సంగతంతా చెప్పి, తనకు దొరికిన గడియారాన్ని ఆయనకు చూపించాడు.
"దీన్ని ఈమధ్యే కొన్నారెవరో.. దొరుకుతారులెండి, మీరేమీ చింతపడకండి" అంటూ పుస్తకాల్లో మునిగాడాయన. కొద్దిసేపటికి రెండు అడ్రసులు ఇస్తూ చెప్పాడు- "మీరేమీ సాహసాలు చేయ-నక్కర్లేదు. ఈ రెండు చిరునామాల్లో ఒకటి మీకు కావలసింది అయి ఉండచ్చు- మీరు దీన్ని పోలీసులకు ఇస్తే నయమేమో..? చూడండి, మీ ఇష్టం!" అని.
సాయి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకొని తన వేట మొదలు పెట్టాడు.
మొదటి అడ్రసులో ఒక ముసలావిడ ఉన్నది. "అమెరికాలో ఉండే నా మనవడికి దీన్ని పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చాను. ఎందుకు నాయనా?" అన్నది.
"ఓహో అవునాండి, అతను ఇక్కడికి ఎప్పుడొచ్చాడు?" అడిగాడు సాయి.
"ఐదారు నెలలైంది నాయనా, మళ్ళీ అప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు కూడాను"
సాయి పని పూర్తయింది. తనకు కావలసిన వాళ్ళు వీళ్ళు కాదు. "సరేనండి. పర్లేదు. మళ్ళీ కలుస్తానండి"
"అయితే ఈ రెండో చిరునామాలో ఉండచ్చు- అసలు దొంగ!"
ఈ అడ్రస్ దొరకటం కొంచెం కష్టమైంది. అదొక పాత పెంకుటిల్లు. ఇంటి చుట్టూ శిథిలమైపోయిన కాంపౌండు. దాన్ని చూడగానే సాయికి "ఇదే!" అనిపించింది.
ఇంట్లో ఎవరో ఉన్నట్లున్నారు. మాటలు వినిపిస్తున్నాయి.
మెల్లగా కాంపౌండులో అడుగు పెట్టాడు సాయి. ఎండుటాకులు అతని కాళ్ల క్రింద పడి గలగలమన్నాయి. ఇంట్లో మాటలు ఆగిపోయాయి.
సాయి వెళ్ళి తలుపు తట్టాడు.
"ఎవరది?" కరకు గొంతు ఒకటి వినబడ్డది లోపలినుండి.
"అడ్వర్టయిజ్మెంట్ సర్. వస్తువులేమైనా చూస్తారా?" ధైర్యంగా అడిగాడు సాయి.
"ఏమీ అక్కర్లేదు. ముందు ఇక్కడినుండి పారిపో" చికాకుగా పలికింది గొంతు.
సాయి వెనక్కి తిరిగి వెళ్తున్నట్లు ఎండుటాకులను గలగలమనిపించాడు.
కొద్ది సేపటి తర్వాత మెల్లగా వెనక్కి వచ్చి, ఈసారి ఇంటి పైకప్పు మీదికి ఎక్కాడు. లోపలినుండి ఎవరివో రెండు గొంతులు వినిపిస్తున్నాయి.
"అవునురా! ఇప్పుడు పారిపోవాల్సిందే. ఇంక ఇక్కడ ఉండటం కుదరదు. చాలా ఇళ్ళు అయ్యాయి. పోలీసులకు కబురు అందిందంటే మన పని ఆఖరు.."
సాయి మెదడు చురుకుగా పని చేసింది. వీళ్ళే, తనకు కావలసిన వాళ్ళు! ఇప్పుడేం చేయాలి? వెంటనే తన సెల్‌ఫోనులో వీడియో రికార్డరు ఆన్ చేసాడు. మెల్లగా ఒక పెంకును తొలగించాడు. ఏర్పడిన ఖాళీ ద్వారా లోపలి దృశ్యాన్ని వీడియోలో బంధించాడు. ఆ తర్వాత కప్పు దిగి గబగబా పోలీసు స్టేషనుకు పరుగు పెట్టాడు.
పోలీసులు వీడియో సహాయంతో హంతకులను పట్టుకున్నారు. వాళ్ళు ఒక జాతీయ స్థాయి ముఠా సభ్యులు. ముఠా వారు ఆ సరికే చాలా ఇళ్ళు దోచుకున్నారు. మిగతా చోట్ల అంతటా దోపిడీలు సులభంగానే జరిగాయి గానీ, శ్రీరాం మటుకు వాళ్ళను ఎదిరించి పోరాడాడు. ఆ క్రమంలో వాళ్ళు అతన్ని కత్తితో పొడవటం జరిగింది.
"మొత్తం మీద నువ్వు మంచివాడివని నిరూపించుకున్నావయ్యా, సాయీ. అయినా నిన్ను పట్టుకోవటం వల్లనే అసలు హంతకులెవరో తెల్సింది మాకు" నవ్వారు ఇన్స్పెక్టరు గారు సాయి చేతులు పట్టుకొని ఊపుతూ!