అనగా అనగా ఒక ఊళ్ళో ఓ రాజావారి గోదాం. అందులో ఎలుకల బెడద ఎక్కువైపోయింది. గోదాం అంటే తెలుసుగా? తినే సామానులన్నీ‌ నిలువ ఉంచుకునే స్థలం అది. అక్కడ చేరినై, వందల కొద్దీ ఎలుకలు. ఆ ఎలుకలు గోదాంలో పెట్టిన వస్తువులన్నిటినీ పాడుచేస్తున్నాయి. బియ్యం బస్తాలను, పిండి బస్తాలను కొట్టేస్తున్నాయి. పప్పుల్లో పిల్లల్ని పెడుతున్నాయి. దాంతో రాజావారికి చాలా కష్టం వేసింది. "ఏం చేస్తే బాగుంటుంది?" అని మంత్రుల్ని అడిగాడు.

ఎలుకలకు మందు దొరుకుతుంది ప్రభూ! అయితే అది ఆహారంలో కలిస్తే మటుకు చాలా ప్రమాదం" చెప్పారు మంత్రులు. "మీకు తెలిసి ఎలుకల్ని తినే జంతువులేమీ లేవా?" అడిగాడు రాజు-"ఎలుకలు పోవాలంటే పిల్లుల్ని తెచ్చి పెంచుకుంటే సరి" అని తీర్మానించి చెబుతూ.

"భలే ఐడియా! చాలా బాగుంది!" అన్నారు అందరూ. "ఎలుకలు పోవాలంటే పిల్లుల్ని తెచ్చి పెడితే సరి!"

"సరే! అయితే పెద్ద పెద్ద పిల్లుల్ని తెచ్చి వదలండి" అన్నారు రాజుగారు.

పిల్లులు వచ్చాక ఎలుకల బాధ తప్పింది. కానీ రాను రాను పిల్లుల బెడద ఎక్కువయ్యింది. వందలకొద్దీ పిల్లులు- ఎక్కడ పడితే అక్కడ కక్కుతున్నాయి. దొడ్డికి పోతున్నాయి. వాసన.. "ఏం చేస్తే బాగుంటుంది?" మంత్రుల్ని అడిగారు రాజుగారు.

ఆ సరికి రాజుగారు ఏమనుకుంటున్నదీ‌ మంత్రులకు అర్థమైపోయింది. ఆయన మనసులో మాట చెబితే మెచ్చుకుంటారు!

"పిల్లుల్ని తరిమేయాలంటే కుక్కల్ని తెప్పించాలి" సలహా ఇచ్చారు మంత్రులు.

"బాగు బాగు! అలా చేద్దాం" అన్నారు రాజుగారు.

కుక్కలు వచ్చాయి. పిల్లుల బాధ తప్పింది.

అయితే రాను రాను ఇప్పుడు కుక్కల బెడద ఎక్కువయ్యింది.

"చిరుత పులుల్ని తెస్తే కుక్కల బెడద ఉండదు" అన్నారు మంత్రులు.

"సరే, తెప్పించండి మరి!" అన్నాడు రాజు.

కుక్కల బాధ తీరిపోయింది. అయితే త్వరలోనే చిరుతపులులు ఊళ్ల మీదికి వెళ్లసాగాయి. ప్రజలంతా వచ్చి రాజుగారికి మొరపెట్టుకున్నారు.

" 'ఏనుగులు ఏలే చోట చిరుతలు తిరగవు' అని శాస్త్రం.." చెప్పారు మంత్రులు, కొంచెం అనుమానంగానే.

"సరేలే, అదీ చూద్దాం" అని ఏనుగులను వదిలారు రాజుగారు.

కొద్దిరోజులకు నిజంగా ఏమైందో గాని, చిరుత పులులన్నీ‌ మాయం అయ్యాయి. అయితే ఇప్పుడు ఏనుగులు పొలాలమీద పడ్డాయి. చెరకు తోటలన్నీ నాశనం అవ్వసాగాయి.

"ఏనుగులు సింహాలకు భయపడతాయి ప్రభూ.." గొణిగారు మంత్రులు.

"చాలు చాలు! మీ సలహాలతో రాజ్యం అంతా గందరగోళమైంది. వీటన్నిటికంటే ఎలుకలే నయం" అన్నారు రాజుగారు. రాజుగారిని పొగిడి ఇల్లు గట్టెక్కించుకునే మంత్రులంతా ఆయన తెలివిని ప్రశంసించారు. మరైతే ఎలుకల్ని తెప్పిస్తాం" అని ఎలుకల్ని తెచ్చి వదిలారు.

ఎలుకలు ఏనుగుల తొండాలలోకి దూరి సతాయించసాగాయి. చివరికి ఏనుగులు తట్టుకోలేక అడవిలోకి పారిపోయాయి.

రాజావారి గోదాంలో ఎలుకల బెడద మొదటికి వచ్చింది.

"ఎలుకల బెడదకు తట్టుకోలేక ఏనుగులంతటివే పారిపోయాయే, ఇక మనం ఎంత? పట్టించుకోవద్దు" అన్నారు తెలివి తెచ్చుకున్న రాజుగారు!

"అవునవును. పట్టించుకోకపోతే సరి!" అన్నారు భట్రాజు మంత్రులు, ఎగుర్లాడుతున్న ఎలుకల్ని చూసి మురిసిపోతూ.