చాలాకాలం క్రితం దేవగిరిలో వరదరాజు అనే పిల్లవాడు ఒకడు ఉండేవాడు. ఆరోజుల్లో తల్లిదండ్రులందరూ పిల్లలకు ఐదేళ్ళు రాగానే వాళ్లని గురుకులంలో చేర్చేవారు. పిల్లలు గురువుగారికి శుశ్రూష చేసుకుంటూ, ఆయన నేర్పే విద్యలు నేర్చుకునేవాళ్ళు. అట్లానే వరదరాజు కూడా ఐదేళ్లు రాగానే ఓ గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

గురువుగారు పాఠాలు చక్కగా చెప్పేవారు; పిల్లలందరూ బాగా నేర్చుకునేవాళ్ళు- కానీ ఎందుకనో, వరదరాజుకు మాత్రం ఆయన ఏం చెప్పినా తలకెక్కేది కాదు. పిల్లలంతా సంవత్సరానికోసారి పై తరగతికి వెళ్తుంటే, వీడు మాత్రం ముందుకు కదలకుండా ఒకటో తరగతిలోనే చాలా ఏళ్ళు ఆగిపోయాడు.

చివరికి గురువుగారు ఒకరోజున వరదరాజును దగ్గరకు పిలిచి, "నాయనా! నీకు చదువుకునే అదృష్టం లేనట్లున్నది. ఇంత శ్రమ పడినా చదువురాలేదంటే, అసలు ఇక శ్రమ పడవలసిన అవసరమే లేదేమో, ఆలోచించు. చదువుకోవటం నీవల్ల కాదు. కాబట్టి నువ్వు ఇక ఇంటికి వెళ్ళి, ఏదైనా పని చూసుకోవటం మంచిది" అని చెప్పేశారు.

వరదరాజు "సరేనండి" అని ఆయనకు నమస్కరించి, మిత్రులందరి దగ్గరా సెలవు పుచ్చుకొని, ఇంటికి బయలుదేరాడు. "ఇదిగో నాయనా, దారిలో‌ తినేందుకు పనికి వస్తుంది" అని కొంత పేలపిండి మూట కట్టి ఇచ్చింది గురుపత్ని. వాడు దాన్ని తీసుకొని ఇంటికి నడవసాగాడు.


కొంత దూరం నడిచాక వాడికి బాధ మొదలైంది. "ఇప్పుడు ఇంటికెళ్ళి నా ముఖం‌ ఎలా చూపించను? ఎవరికి, ఏమని చెప్పుకోను?" అని మొదలైన ఆ ఆలోచన ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. వాడి మనసంతా వికలం అయిపోయింది.

మధ్యాహ్నం అయ్యేసరికి వాడు చాలా అలసిపోయాడు. నడినెత్తిన సూర్యుని వేడికి, తలలో ఆలోచనల వేడికి వాడు ఇక తట్టుకోలేకపోయాడు.

అంతలోనే వాడికొక చేద బావి కనిపించింది- బావి ముందు బిందెలు పెట్టుకునేందుకు గాను మంచి బండ ఒకటి ఉన్నది. చేదుకునేందుకు ఓ కొబ్బరి తాడు, బొక్కెన బావికున్న ఇనప చక్రానికి తగిలించి ఉన్నాయి. త్రాడు బాగా నలిగి పోయి అక్కడక్కడా తెగినచోట ముడిపడి ఉన్నది. బొక్కెన అన్ని వైపులనుండీ నొక్కులు పడి, దెబ్బలు తినీ తినీ 'అసలిది బొక్కెనేనా?' అన్నట్లున్నది.

త్రాడు రాపిడికి ఇనప చక్రం బాగా అరిగిపోయి తళతళా మెరుస్తున్నది. బావి ముందున్న బండ వాడుక వల్ల బాగా నున్నగా అయి ఉన్నది. దానిమీద బిందెలు పెట్టీ పెట్టీ ఒరుసుకొని పోయి అక్కడక్కడా గుంటలు పడి ఉన్నాయి- "ఇప్పుడు ఇక వీటిలో బిందెలు కుదురుగా కూర్చుంటాయి.." అనుకొని నవ్వుకున్నాడు వరదరాజు.

అక్కడ కూర్చొని పేలపిండి తింటుండగా వచ్చిన ఇంకో ఆలోచన వల్ల వరదరాజు జీవితం పూర్తిగా మారిపోయింది: "రాపిడి వల్ల ఏమేం జరిగినాయో చూశావా? బండరాయి కూడా అరిగింది; ఇనపచక్రం కూడా అరిగింది; కటిక రాయి మీద మెత్తటి బిందెల గుర్తులు పడ్డాయి.. మళ్ళీ మళ్ళీ రుద్దితే పాషాణం కూడా కరుగుతున్నది.. మళ్ళీ మళ్ళీ చదివితే నాకు మాత్రం చదువు రాకుండా పోతుందా? నేనెందుకు ఓడిపోయాను, ఎందుకు ఇలా పారిపోతున్నాను, నాకు చదువెందుకు రాదు?..." అని!

ఇక పేలపిండి తినలేదు వరదరాజు- ఎంత మిగిలితే అంత మూటకట్టుకొని, తన కళ్ళు తెరిపించిన ఆ బావికి నమస్కరించుకొని, నీళ్ళు త్రాగి, వెనక్కి తిరిగి, సాయంత్రానికల్లా గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

అక్కడివాళ్లంతా వీడిని చూసి ఆశ్చర్యపోయారు. "నువ్వు ఇంటికి పోతానని బయలుదేరావు కదా, పోలేదా?" అడిగారు గురువుగారు. "త్రాడు ఒరిపిడికి రాయికూడా కరిగిపోయింది గురువుగారూ, నేను నిశ్చయించుకున్నాను- ఇప్పుడు ఇక దేన్నైనా మళ్ళీ మళ్ళీ చదువుతాను- నాకు చదువెందుకు రాదో చూస్తాను.

దయచేసి నాకు మరొక్క అవకాశం‌ ఇవ్వండి. ఈసారి మిమ్మల్ని నిరాశ పరచను" అని ప్రాథేయపడ్డాడు వరదరాజు కళ్ళనీళ్ళతో. గురువుగారికి అర్థమైంది- "ఇక వీడిని ఎవ్వరూ ఆపలేరు" అని. ఆయన వాడిని ప్రేమగా అక్కున చేర్చుకున్నారు.

తర్వాత నిజంగానే వరదరాజు గొప్ప పండితుడయ్యాడు. దేవగిరి రాజైన మహాదేవుని చేత "మహా మహోపాధ్యాయ" అని బిరుదు పొందాడు. పాణిని వ్రాసిన సంస్కృత సూత్రాలను వివరిస్తూ, 'లఘు సిద్ధాంత కౌముది' అనే ఉద్గ్రంథాన్ని రచించాడు. అది ఈనాటికీ‌ ప్రామాణిక గ్రంథంగా మన్ననలందుతున్నది!

నిజంగానే, పట్టుదలతో సాధించలేనిది ఏమున్నది?