పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతిపతాకం దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం |పాడుదమా| జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి ధారలు హత్తుకొని ఉరికొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒకపరి తలచుకొని మృత వీరుల గాధలు తెలుసుకొని |పాడుదమా| వందేమాతరమని నినదించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్రం నా జన్మహక్కని గర్జించిన గళమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడు గర్వంగా కొనియాడుకొని |పాడుదమా| మన్యం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియని గుండు కెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల బాకై మెరిసిన గరిమెళ్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని |పాడుదమా| జనగణమనముల జాగృతినింపిన జెండా గాథలు చెప్పుకొని జయహే జయజయహే జననీ యని జయ గీతమ్ములు పాడుకొనీ పావన చరితం పరిమళభరితం అఖండ భారత ఖండమని అది అక్షయ అమృతభాండమనీ |పాడుదమా|