తలుపుల రాజ్యాన్ని పాలిస్తున్న పరమ పిసినారి రాజుగారు ఒకనాడు ఒక చాటింపు వేయించారు. ఆనాటి రాత్రి విపరీతమైన చలి పెట్టడమే రాజు గారి చాటింపుకు కారణమట!
ఇంతకీ చాటింపు ఏమిటంటే, కార్తీక పౌర్ణమినాటి రాత్రి మొత్తం చల్లని నీటిలో గడపగలిగిన వాళ్లకు వంద బంగారునాణేలు బహుమానంగా ఇస్తారట రాజుగారు.
అంతలో కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి చాటింపు విన్న ప్రజానీకంలోంచి కొందరు సాహస యువకులు ఆ రాత్రిని చన్నీటిలో గడుపుతామని వచ్చారు.
వచ్చిన వాళ్లకు పోటీ మొదలైంది. పోటీదార్లందరినీ ఒక పెద్ద చన్నీటి కొలనులోకి దిగి కూర్చోమన్నారు. ఆ కొలనులోని నీళ్ల చల్లదనానికి తట్టుకోలేక ఒక్కరొక్కరుగా యువకులు అందరూ అక్కడనుండి బయటకొచ్చేశారు. కొందరైతే రాజుగారినీ, రాజు గారి చాటింపునీ, ఆ కొలనులోని నీళ్లను కూడా తిట్టడం మొదలెట్టారు. చివరకు ఒక పేద బెస్తవాడు మాత్రం తెల్లారేదాకా చల్లని మంచులాంటి ఆ నీళ్లలో ఉండగలిగాడు.
తెల్లవారాక చూసేందుకు వచ్చారు రాజుగారు. బహుమానం ఇవ్వకుండా తప్పించుకోవటం ఆయన లక్ష్యం. ఆలోచించగా ఆయనకు ఒక మార్గం లభించింది. దూరంగా వెలుగుతున్న దీపాల్ని చూపిస్తూ చెప్పారు: "దీపాల వెలుగులో చలికాపుకుంటూ ఈ కొలనులో ఉండగలిగావు గానీ, లేకపోతే ఈ పని సాధ్యపడేది కాదు. నీకు మేం ఎలాంటి బహుమానాన్నీ ఇవ్వవలసిన అవసరం లేదు" అని.
వంద బంగారు నాణేలకోసం కలలుగన్న బెస్తవాడు నిరుత్సాహంగా వెనక్కి మళ్ళాడు.
జరిగిన దానికి మంత్రిగారు నొచ్చుకున్నారు; కానీ తన అభిప్రాయాన్ని రాజుగారికి నేరుగా చెప్పలేక మిన్నకుండిపోయారు. అయితే రాజుగారు తన తప్పును గ్రహించేట్టు చేయటం ఎలా అని ఆయన ఆలోచించటం మొదలెట్టారు.
మరునాడు ఉదయం రాజుగారు నిద్రలేచేటప్పటికి మంత్రిగారు ఒక పాలగిన్నెను పట్టుకొని ఆయన ప్రక్కనే నిలబడి ఉన్నారు. దూరంగా ఒక పొయ్యి వెలుగుతున్నది.
"ఏమి చేస్తున్నారు?" అడిగారు రాజుగారు ఆశ్చర్యపోతూ.
"పాలు కాంచుతున్నా"నని చెప్పాడు మంత్రి.
"ఏమిటీ! పాలు కాంచుతున్నారా? మరి మంట ఏదీ?" అడిగారు రాజుగారు.
"అదిగోండి మహారాజా, అక్కడ దూరంగా, పొయ్యిలో మంట ఉన్నది" చెప్పాడు మంత్రి గౌరవంగా.
"ఆ మంటసెగ పాలకు తాకేదెప్పుడు, మీ ఈ పాలు మరిగేదెప్పుడు?" అన్నారు రాజుగారు.
"కొలనుల్లో వణికే మనుషులు దూరంగా గోడలమీద ఉన్న దీపాలతో చలికాపుకోగాలేనిది, దూరంగా ఉన్న మంటతో నేను ఈ కొన్ని పాలను కాంచుకోలేనంటారా, మహారాజా?" అడిగారు మంత్రిగారు ధైర్యంగా.
రాజుగారికి తన తప్పు తెలిసి వచ్చింది. బెస్తవానికి న్యాయం జరిగింది.