"కిరీటి ముఖం" అంటే `ఉన్నతమైన ముఖం' అని అర్థం.

గుళ్లల్లో - ముఖ్యంగా శివుడి గుళ్లలోను, కొన్ని బౌద్ధ దేవాలయాల్లో కూడాను - రాక్షసుడి ముఖం ఒకటి కనబడుతుంటుంది. గర్భ గుడి వాకిలిమీద, దేవతావిగ్రహాల పై భాగంలోను ఈ రాక్షస ముఖం, కోరలు చాపుకొని, నాలుక బయటికి పెట్టి, గ్రుడ్లు వెళ్ల బెట్టి కనబడుతుంది. ఈ రాక్షస ముఖాన్ని సాధారణంగా ఒక పువ్వులాంటి చట్రంలో బిగిస్తారు. అందరూ ఇదేదో భటుని ముఖం అనుకుంటుంటారు, కానీ దాని కథ వేరే ఉంది.

కిరీటిముఖుడు సామాన్య భటుడు కాదు, ఆయన స్వయంగా దేవుడే. పరమ శివుడే చెప్పాడు - "ముందుగా కిరీటిముఖుడెవరో తెలుసుకోనివాడికి నన్ను తెలుసుకోవటం అసలు సాధ్యం కాదు" అని. అందరూ మరిచిపోయిన ఈ ఉపనిషత్కథ, అందంలోను, ప్రాధాన్యతలోనూ కూడాను నిజంగా అద్భుతమే.

ఒక రోజున, వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగా, శివుడు, పార్వతీ కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిన్న పిల్లలకి మల్లే సంతోషంగా నవ్వుతున్నారు.

అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడినుండో ఊడిపడ్డాడు వాళ్లముందు. వచ్చి, శివుడి ముందు నిలబడి ఎక్కడలేని తిట్లూ తిట్టడం మొదలుపెట్టాడు వాడు. కానీ పరమ సాత్వికుడైన సదాశివుడు ఏ మాత్రం కోపగించుకోలేదు. భగవంతుడు కనుక, ఎప్పటి మాదిరే నిశ్చలంగా, నిరామయుడై నిలిచాడు.

శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్దీ రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు. ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది. "ఓహ్, ఎంత అందంగా ఉంది, ఈమె!. బూడిద పూసుకొని బిచ్చమెత్తుకునే శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హతే లేదు. ఇక్కడ ఉండవలిసింది కాదు ఈమె. మా ఇంట్లో, నా భార్యగా రాజ భోగాలు అనుభవించవలిసినది." అని వాడు పార్వతి మీదికి పోబోయాడు.

ఇక వాని అహంకారం హద్దులు దాటినట్లే. శివుని ఆగ్రహజ్వాల మింటిగెగిసింది.

త్రినేత్రుడి మూడవ కన్ను తెరుచుకున్నది. ప్రపంచం అంతా గజగజలాడింది. పిడుగులు రాలాయి. తుఫాన్లు చెలరేగాయి. సముద్రాలు పొంగాయి. ఆకాశం ఎంత నల్లగా, చీకటిగా అయిందంటే, ఎవరికైనా తమ చేతులు తమకే కనబడటం లేదు. భయంతో రాక్షసుడు వణికిపోయాడు. ఈ భీభత్సం శమించేసరికి, శివుని ముందు మరొక రాక్షసుడు, సన్నగా, పీలగా, నిలబడి ఉన్నాడు. ఆ దుర్మార్గపు రాక్షసుడిని తినేసేందుకు తనకు అనుజ్ఞ ఇవ్వాలని ఈ రాక్షసుడు శివుడిని వేడుకుంటున్నాడు! మొదటి రాక్షసుడికి ప్రాణ భయం పట్టుకున్నది. వాడు వెంటనే శివుని కాళ్ల మీద పడి తనకు బుద్ధి వచ్చిందని, తనను క్షమించమనీ ప్రాధేయపడ్డాడు.

శివుడు కొంచెం సేపు ఆలోచించి, రెండో రాక్షసుడితో అన్నాడు "సరే, వాడిని తినకు" అని. కానీ, శివభృత్యుడైన ఈ రాక్షసునికి అది నచ్చలేదు. "ప్రభూ, మీరు నన్ను పిలిచిందే, వాడిని తినమని. ఇప్పుడు నాకు ఆకలి దహించుకుపోతున్నది. నేను దేన్ని తినాలో సెలవివ్వండి" అని వాడు శివుడిని వేధించాడు.

"అయితే నిన్ను నువ్వే తిను" అని ఆజ్ఞాపించాడు శివుడు. భృత్యుడు సరే'నని పని మొదలుపెట్టాడు. ముందుగా తన పాదాల నుండి మొదలుపెట్టాడు. శివుని ఆజ్ఞ ప్రకారంకరకరమని నములుతూ, తింటూ - కాళ్లు, చేతులు, పొట్ట.. ఇలా అతను మెడ వరకూ తినెయ్యగానే "ఇక చాలు" అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ. "నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. నీకు కిరీటిముఖుడ'ని పేరు పెడుతున్నాను.జీవం, జీవం ఆధారంగానే జీవిస్తుంది’ అనే మౌళిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు. నేటి నుండీ ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కల్పిస్తున్నాను. భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోలేనివాళ్లు నన్ను కనుగొనలేరు" అన్నాడు.

"జీవం అనేది ఇక విభజించడానికి వీలుకాని ఏకత్వం. భూమిపైన అది వేర్వేరు రూపాల్లో కనబడుతుంది. అయినా అది విడదీయరాని ఏకత్వమే తప్ప, వేరుకాదు. పులి, జింకను చంపి తిన్నంత మాత్రాన, జీవం అయిపోయినట్లు కాదు - అది కొంచెం కదిలినట్లు. పులి, నిజానికి చంపెయ్యదు - అది `జీవం' అనే ఆహారాన్ని కేవలం తింటుంది అంతే. జింక గడ్డిని తిన్నప్పుడూ, మనిషి పండును తిన్నపుడూ కూడా జరిగేదిదే. జీవం అంటే ఆహారమే. ఆహారమే జీవం.

జీవమే పరబ్రహ్మ. ఇవన్నీ ఒకటే. అంతా జీవమే తప్ప వేరుకాదు. మనుషులు దీన్ని మరిచిపోయి గందరగోళానికి లోనౌతూంటారు. తమ ఆలోచనల్లో తామే పరిభ్రమిస్తూ ఉంటారు. వారికి వాస్తవం ఏంటో గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. కిరీటిముఖుడు అలా దాన్ని గుర్తు చేస్తూంటాడు".

శివుడు ఇంకో సంగతినీ చెప్పాడు: "దీని అర్థం ఏ ప్రాణైనా, దేన్నైనా తినవచ్చని కాదు. వేర్వేరు శరీరాలు వేర్వేరుగా పరిణామం చెందాయి. ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేర్వేరు ఆహారాలు అవసరమౌతూంటాయి. జంతువులన్నిటికీ ఈ నియమం తెలుసు, అవి ఈ నియమానికి తలొగ్గుతాయి. అందుకనే పక్షులు ధాన్యాన్నీ, పిల్లులు మాంసాన్నీ, పశువులు గడ్డినీ, చెద పురుగులు మొద్దుల్నీ తింటూంటాయి. ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెలువడుతుంటూంది. ఈ సంగతిని గుర్తించుకుంటే చాలు - ఏది తినాలో నీకు నీకుగానే తెలుస్తుంటుంది. కానీ నువ్వు ఏది తింటున్నా సరే, అది జీవమే తప్ప వేరు కాజాలదు!" అని అర్థమయ్యే వాళ్ల కోసం జోడించాడు శివుడు దయతో.

ఇక మీద గుడికి వెళ్లినప్పుడు కిరీటిముఖుడిని తప్పకుండా `దర్శిస్తారు' కదూ?