ఏడో తరగతి చదివే అఖిల్ చాలా తుంటరి పిల్లవాడు. చదువుల్లో మనసు అస్సలు నిలిచేది కాదు వాడికి. కానీ చేతులు మటుకు ఎప్పుడూ వులవుల పెడుతూ ఉండేవి.

వాడి తుంటరి పనులతో అందరూ విసిగిపోయారు: "ఒరే! చక్కగా చదువుకుంటూంటే కొంచెం అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. చదవకుండా పోరంబోకువైతే అసలు ఎవ్వరూ మెచ్చరు. రాను రానూ బ్రతుకు కష్టం అవుతుందిరా!" అని ఎంత చెప్పినా వాడు మాత్రం వినేవాడు కాదు. అయితే రోజులన్నీ‌ ఒకలాగా ఉండవు కదా, అనుకోకుండా ఒక రోజున ఓ అద్భుతం జరిగింది. ఆ రోజు కూడా వాడు బడి ఎగగొట్టి ఎప్పటిలాగానే ఊరి చివర్లోని పాడుబడ్డ ఇంటికి పోయాడు. ఆ యింటి చుట్టూ చెట్లు, తుప్పలు, అటు మూలన ఓ పాడుబడ్డ బావి ఉంటాయి.

అయితే ఆ రోజున ఎందుకనో, బావిలోంచి రంగు రంగుల పొగలు బయటికి వస్తున్నాయి! దానికి తోడు "ఢుం!ఢుం!" అంటూ భయంకరమైన శభ్దాలు!

అఖిల్‌కి కొంచెం భయం వేసింది. అటూ ఇటూ చూసాడు, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తారేమో, ధైర్యానికి అని. అయితే అసలు అటువైపుకే ఎవ్వరూ రారాయె! ఒక్క క్షణం పాటు వాడికి పారిపోదామనిపించింది గానీ, అడుగులు వెనక్కి తిరగలేదు. వాడు ఎంత 'వద్దు! వద్దు!' అని గింజుకులాడినా అవి మాత్రం బావి వైపుకే దారి తీసాయి.

బావి లోపలికి దిగేందుకు మెట్లు ఉన్నాయి. మెట్లు అక్కడక్కడా విరిగిపోయి ఉంటాయి; కానీ ఎక్కడ ఎలా ఉంటాయో వాడికి కొట్టిన పిండే. ఇప్పుడు వాడి కాళ్ళు ఆ మెట్లను దిగటం మొదలు పెట్టాయి. అఖిల్ మనసు బిగిసిపోయింది. "వద్దు వద్దు" అంటోంది; కానీ‌ కాళ్ళు మనసు మాట వినట్లేదు. ఇంకేదో శక్తి వాటిని నడిపిస్తున్నట్లుంది.

వాడి ముఖం పాలిపోయింది; ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి; బావిలోంచి దట్టంగా వస్తున్న రంగు రంగుల పొగకు వాడికి ఊపిరి ఆడనట్లు అనిపిస్తోంది. ఇంకా మూడు నాలుగు మెట్లు ఉన్నాయి అనగా వాడికి ఒక భయంకర దృశ్యం కనిపించి కాలు జారింది..

బావిలో ఒక రాక్షసుడు. దుమ్ము కొట్టుకొకుండా జుట్టుకు ఓ ఎర్రటి బట్ట, ఆకు పచ్చని వొంటి నిండా వెంట్రుకలు, ఎర్రని-తెల్లని బొట్లు. మెడలోను, చేతులకు ఎముకల దండలు. నడుము చుట్టూ ఒక పుర్రెల దండ. వాడు చకిలంమకిలం వేసుకొని కూర్చొని, ఉయ్యాల లాగా ఊగుతూ ఏవేవో మంత్రాలు జపిస్తున్నాడు. వాడికి ఎదురుగుండా ఒక యజ్ఞ గుండం ఉంది. మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో ఆ మంటలోకి ఏవో పొడులు విసురుతున్నాడు వాడు. ఒక మూలగా మరుగుజ్జు ఒకడు పెద్ద ఢంకా లాంటి దాన్ని "ఢుం ఢుం" అని కొడుతున్నాడు..

అఖిల్ దబ్బుమని క్రింద పడేసరికి రాక్షసుడి యజ్ఞం భంగమైంది. వాడు కళ్ళు తెరిచి కోపంగా అఖిల్ వైపు చూసాడు. అఖిల్ తేరుకునే లోగానే వాడు చటుక్కున లేచి, పైకెగిరి, తన చేతిలోని మంత్రదండంతో అఖిల్ నెత్తి మీద దభాలున ఒక దెబ్బ కొట్టాడు. మరుక్షణమే స్పృహ తప్పాడు అఖిల్.

మెలకువ వచ్చేసరికి అఖిల్ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. వాడిప్పుడు యజ్ఞగుండం ముందు పడేసి ఉన్నాడు. మరుగుజ్జువాడు ఆగి ఆగి ఢంకా కొడుతున్నాడు. రాక్షసుడు కళ్ళు మూసుకొని "హ్రీం హ్రాం భం" అని అరుస్తూ విరగబడి నవ్వుతున్నాడు.

అఖిల్‌ కళ్ళు తెరవటం చూసిన రాక్షసుడు మంత్రాలు చదవటం ఆపి బిగ్గరగా "ఒరే! కుర్రా! నువ్వు నాకు సరిగ్గా సరిపోయావ్. 'చదువు సంధ్యలు లేకుండా, పోరంబోకుగా తిరిగే కుర్రవాడిని పంపు తల్లీ! నీకు బలి ఇస్తాను!' అని ఆ తల్లిని కోరుకోగానే నువ్వు దిగి వచ్చావు. నిజంగానే చదువు రాని వాడివి! నిజంగానే పోరంబోకువి! తల్లి కోరి పంపిందిరా, నిన్ను! ఇంకొద్ది సేపట్లో ఆ తల్లినే చేరతావు నువ్వు!" అంటూ పొడిని యజ్ఞగుండంలోకి వేసి, ఊగటం మొదలెట్టాడు వాడు కళ్ళు మూసుకొని.

అఖిల్‌ గుండె ఆగినట్లైంది. ఏడుపొచ్చింది. కొంచెం సేపు బిగ్గరగా ఏడ్చాడుగానీ, రాక్షసుడు అసలు పట్టించుకోలేదు. చివరికి "నువ్వనేది అబద్ధం. నేను పోరంబోకును కాదు! నేను చదువుకున్న పిల్లాడిని!" అని అరిచే సరికి, రాక్షసుడిలో చలనం వచ్చింది. వాడు ఎగతాళిగా నవ్వుతూ "అవునా? అయితే మరి ఏమైనా పద్యాలు చెప్పు? ఎక్కాలు చెప్పు? ఇంగ్లీషు రైమ్సు చెప్పు? ఏమీ రావు, చూసావా?! వట్టి రోషం! ఎందుకు పనికొస్తుంది?!" అన్నాడు.

"బలికి పనికొస్తుంది గురూ!" అన్నాడు మరుగుజ్జువాడు, అవతలినుండి, ఆవలిస్తూ. "బాగా చెప్పావురా, బలికి పనికొస్తాడు వీడు. అంతే" అన్నాడు రాక్షసుడు.

ఆ వెంటనే కొద్ది సేపు అఖిల్‌కు తల తిరిగింది. తను రకరకాల పాములతో యుద్ధం చేస్తున్నట్లు, బలి ఇచ్చే కత్తితో వాటిని చంపుతున్నట్లు అనిపించింది.

సాధారణంగా అఖిల్‌కు ఇరవయ్యో ఎక్కం వరకూ రావు. పదమూడు నుండి అన్నీ తప్పులే ఉంటాయి. అయినా వాడు లేని ధైర్యం నటిస్తూ, రెండో‌ ఎక్కంతో‌ మొదలెట్టి గడగడా చెప్పటం మొదలెట్టాడు. వాడి తప్పులన్నీ‌ భరించిన రాక్షసుడు "తప్పులున్నాయిరా!" అని నవ్వి, "పద్యాలు?" అని అడిగి, అవన్నీ కూడా చెప్పించుకున్నాడు. 'తప్పులో, రైట్లో' గాని ప్రాణభయంతో అఖిల్ నోటికి ఏ పద్యం వస్తే అది, చెప్పాడు.

వింటున్న మరుగుజ్జు వాడు "ఇప్పుడెట్లా, గురో!" అని కేకపెట్టాడు అకస్మాత్తుగా. "వీడు కొంచెం చదివే పిల్లాడు లాగే ఉన్నాడు. మనకి పనికి రాడు గురో!" అంటూ వచ్చి అఖిల్ తలమీద గట్టిగా మళ్ళీ ఓ‌ మొత్తు మొత్తాడు.

ఆ దెబ్బకి మళ్ళీ స్పృహ తప్పిన అఖిల్‌కి ఈసారి పాములు, కత్తులు, మంచు కొండలు, కుక్కలు, సింహాలు అన్నీ కనబడ్డాయి. వాడు అన్నిటితోటీ పోరాడుతూ పోయాడు.

తెలివి వచ్చి కళ్ళు తెరిచే సరికి వాడు ఆ పాడుబడ్డ ఇంటి గేటుదగ్గరే పడి ఉన్నాడు. తల బొప్పి కట్టి ఉన్నది! బావిలోంచి పొగ ఏమీ రావట్లేదు. పరిసరాలన్నీ‌ పదిలంగానే ఉన్నాయి. రాక్షసుడూ, వాడి అనుచరుడూ ఇద్దరూ జాడ లేరు.

వణికే కాళ్లతో ఇల్లు చేరుకున్న అఖిల్, ఆ తర్వాత రెండు రోజుల పాటు నిద్రపోతూనే ఉన్నాడు. ఆ సరికే ఇంటికి వచ్చి ఉన్న రంగామామయ్య, వాళ్ల కొడుకు ఇద్దరూ అఖిల్‌ని పలకరించారు. మధ్యలో మామయ్య ఒకసారి "ఒరే! పద్యాలు చెప్పు! ఎక్కాలు?" అన్నప్పుడు అఖిల్‌కి 'ఈ గొంతు ఎక్కడో విన్నానే?!' అనిపించింది; అయితే అలసిపోయి ఉండటాన వాడు ఇక ఏమీ అనలేదు.

కానీ ఆ తర్వాత వాడు బాగా మారిపోయాడు. అల్లరి తగ్గించేసాడు; రోజూ‌ బడికి పోతున్నాడు; బాగా చదువుతున్నాడు; బాగా ఆడుతున్నాడు కూడా. తల్లిదండ్రులు అది చూసి సంతోషిస్తూ "ఇదంతా రంగా మామ చలవే!" అనుకున్నారు. "కాదు- రాక్షసుడి మహిమ" అనుకున్నాడు అఖిల్‌.