విజయదుర్గాన్ని జయేంద్రుడు అనే ప్రభువు పాలించే సమయంలో సైనికులను ఎంపిక చేసుకోవటంలోను, యుద్ధ శిక్షణను ఇవ్వటంలోను విజయదుర్గానికి భరత ఖండంలోనే గొప్ప పేరు ఉండేది. ముందుగా బలమైన యువకులను తనదైన శైలిలో ఎంపిక చేసుకునేవాడు జయేంద్రుడు. ఆ తర్వాత వారికి ఖడ్గ యుద్ధంలోను, గదా యుద్ధంలోను, విలు విద్యలోనూ శిక్షణని-ప్పించేవాడు. కనీసం ఒక విద్యలోనైనా అద్భుత ప్రతిభ కనబరచిన వారినే తన సైన్యంలో చేర్చుకునేవాడాయన.

అంతే కాక వాళ్లకు ప్రతి యేడాదీ పోటీలు పెట్టించి, వాళ్ళు తమ విద్యని ఎంత మెరుగు పరచుకున్నారో పరిశీలిస్తుండేవాడు; ఆ పోటీలలో గెలిచిన వాళ్లకు రకరకాల బహుమతులనిచ్చి సత్కరించేవాడు.

ఒకసారి ఆ పోటీలన్నిట్లోనూ 'పురుషోత్తం' అనే యువ సైనికుడే మేటిగా నిలచాడు. జయేంద్రుడు అతనిని ప్రత్యేకంగా అభినందించటమే కాకుండా, తనతో బాటు అతన్ని కూడా రథంలో కూర్చోబెట్టుకొని వేటకు తీసుకెళ్ళాడు.

అయితే, ఆనాటినుండీ పురుషోత్తమునిలో గర్వం తలెత్తింది. తానే గొప్ప వీరుడనని విర్రవీగసాగాడు. తనకంటే పై అధికారులపట్ల అవిధేయతతో కూడా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. పురుషోత్తముడి పొగరు-మోతుతనాన్ని మహామంత్రి కూడా అనేక పర్యాయాలు గమనించాడు. 'సైన్యంలో అవిధేయులకు తావు ఉండరాదు. బయటివారికి ఎల్లవేళలా సైన్యపు సమైక్యతా శక్తి అభివ్యక్తం అవ్వాలి. సైనికులు ఎవరికివారుగా తామే గొప్ప అనుకుంటే ఇక ఆ సైన్యం శత్రువులకు సైతం చులకనైపోతుంది. అందువల్ల అలాంటి వారి పొగరును మొగ్గలోనే త్రుంచివేయాలి’. పురుషోత్తముడి అహంకారాన్ని తగ్గించి బుద్ధి చెప్పాలనుకున్న మహామంత్రి అతనిపై ప్రత్యేక దృష్టి ఉంచాడు.

విజయదుర్గపు సరిహద్దు అడవుల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒకటి ఉండేది. విజయదుర్గ వాసులే కాక, పొరుగు రాజ్యాల నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి దేవుడిని దర్శించుకునేవాళ్ళు. రాజ్యాలమధ్య సద్భావనకు, సత్సంబంధాలకు ఆధారంగా నిలచిన ఆ దేవాలయంలో ఆయుధ ధారులైన సైనికులెవ్వరినీ ఉంచేవాళ్ళు కాదు. విజయదుర్గపు రాజులంతా ఆ పరంపరకు కట్టుబడి ఉండేవాళ్ళు.

అయితే అకస్మాత్తుగా ఆ దేవాలయంలో దొంగలు పడి, విలువైన నగల్ని, పూజా సామగ్రిని మొత్తంగా దోచుకుపోయారు!

వెంటనే మహామంత్రి, సేనాపతి ఇద్దరూ భారీ సైనిక దళాలను వెంటబెట్టుకొని పోయి, దేవాలయం చుట్టు ప్రక్కల అడవులన్నీ గాలించి, దొంగల్ని పట్టి బంధించటమే కాక, వస్తువులన్నిటినీ తెచ్చి ఖజానాకు జమ చేసారు. "అయితే ఇక మీద దేవాలయానికి సైనిక భద్రత కల్పించటం అవసరం ప్రభూ!" అని విన్నవించుకున్నారు.

కానీ రాజు జయేంద్రుడు అందుకు సమ్మతించలేదు. "మా వంశంలో ఎవ్వరూ చేయని పని ఇది- దేవాలయంలోకి సైనికులకు ప్రవేశం లేదు. పవిత్రతకు, శాంతికి ఆలవాలంగా నిలువవలసిన దేవాలయంలోకి ఆయుధాలు ప్రవేశించకూడదు" అన్నాడు.

"ఆయుధాలు ఉండవు మహారాజా! ఆయుధాలు ధరించని సైనికులు మాత్రమే ఉంటారు" అన్నాడు సేనాపతి. మహారాజు నవ్వాడు: "ఆయుధాలు లేని సైనికులు ఎవరికి రక్షణ కల్పిస్తారు?" అంటూ.

మహామంత్రి కల్పించుకొని "మేం దాన్ని గురించి ఆలోచించాం ప్రభూ! ఆయుధాలతో ప్రమేయం లేని చీనా దేశపు యుద్ధ విద్యలు కొన్ని ఉన్నాయి. తమరు సరేనంటే మన రాజ్యపు యువకులు ఒక పది మందికి మేం అలాంటి శిక్షణ నిప్పిస్తాము" అన్నాడు.

"అవి ఊరికే పేరుకు మాత్రమే. అట్లాంటి విద్యలు సైనికుల ఆత్మ రక్షణకే సరిగ్గా ఉపయోగపడవు- ఇంక దేవాలయాన్ని అవేమి రక్షిస్తాయిలే!" అన్నారు రాజుగారు చటుక్కున. అయినా మంత్రి-సేనాపతుల ఉత్సాహాన్ని నీరుకార్చటం ఇష్టం లేక "సరే! కానివ్వండి! చూద్దాం. అయితే ఆరు నెలల తర్వాత పరీక్ష పెడతాం వాళ్లకు!" అని అనుమతించారు.

వెంటనే మహామంత్రి ప్రకటనలు జారీ చేసి, పది మంది మెరికల్లాంటి యువకులను ఎంపిక చేసుకున్నాడు. సేనాపతి స్వీయ నేతృత్వంలో వారికి ఆయుధాలు లేకుండా పోరాడే విద్యలలో శిక్షణ ఇవ్వబడింది.

చూస్తూండగానే ఆరు నెలలు గడిచాయి. ఒకనాడు మహామంత్రి "ప్రభూ! తమరు ఇక మన ఆయుధ రహిత రక్షా దళాన్ని పరీక్షించవచ్చు. వారి శిక్షణ ఒక స్థాయికి వచ్చింది" అని తెలియపరచాడు. వాళ్లని పరీక్షించటం కోసం రాజుగారు తమవెంట తీసుకువచ్చే యోధులలో పురుషోత్తం ఉంటాడని మహామంత్రికి తెలుసు. "ఇక పురుషోత్తంకి కనువిప్పు కలిగే రోజు దగ్గర పడింది" అనుకొని నవ్వుకున్నాడాయన.

అందరూ దేవాలయ ప్రాంతానికి చేరారు.

అక్కడ ఒక మర్రి చెట్టు నీడలో ఇరవై-ఇరవై ఒక్క సంవత్సరాల యువకులు కొందరు నిలబడి ఉన్నారు. పల్లెల్లో వాళ్ల మాదిరే పంచెలు కట్టుకొని, గుండు చేసుకొని, పిలకలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు.

వాళ్లలో ఒక పిల్లవాడిని ముందుకు రమ్మన్నాడు రాజు. అతడు వచ్చి అందరికీ నమస్కరించాడు.

కండలు తిరిగిన సైనికుడిని ఒకడిని ముందుకు పిలిచారు రాజుగారు- "నువ్వు ఈ‌ పిల్లాడిని ఓడించాలి.." అన్నారు.

అతను సిగ్గు పడుతూ, "ప్రభూ! పిల్లవాడితో..?" అన్నాడు.

"శత్రువు ఎవరైనా పోరాటం పోరాటమే!" అన్నారు రాజుగారు కఠినంగా.

"క్షమించండి మహారాజా! తమరి ఆజ్ఞను శిరసా వహిస్తాను" అంటూ అతను ఆ బాలకునితో‌ ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఏం జరిగిందో తెలీనే లేదు. మరుక్షణంలో సైనికుడు మట్టి కరచి, మెడ పట్టుకొని మూలుగుతున్నాడు!

రాజుగారు "శహభాష్!" అని చప్పట్లు కొట్టి, పురుషోత్తముడిని పిలిచారు. "నీకు సరిజోదు, వీడు" అని ఆ పిల్లవాడిని చూపించారు.

పురుషోత్తం మీసాలు మెలివేసి, "ప్రభూ! తమరు నన్ను అవమానిస్తున్నారు. ఇతని శరీరంలో పిడికెడు కండలేదు. చేతుల్లో ఒక్క ఆయుధం కూడా లేదు. ఇంకా మీసాలు మొలవనే లేదు. వీడా, నాకు సరి జోడు?! నేను కత్తి పట్టి నిలిస్తే, ఒక్క వేటుతో ఇతన్ని రెండు ముక్కలు చేస్తా. గద అవసరం లేదు- నా ఒక్క పిడిగుద్దుతో ఇతని తల టెంకాయ మాదిరి పగిలిపోతుంది. ఇక నేను వేసే బాణాల ధాటికి వీడి శరీరం తూట్లు పడిపోతుంది" అన్నాడు.

"నువ్వు నీకు నచ్చిన ఏ ఆయుధమైనా వాడచ్చు- ఈ కుర్రవాడిని ఓడిస్తే చాలు" అన్నాడు మహామంత్రి.

"అవునవును" అన్నారు రాజుగారు.

రాజుగారి ఆదేశంతో పురుషోత్తం ఆ బాలవీరునితో పోరాటానికి సిద్ధపడ్డాడు. పురుషోత్తం అతన్ని కత్తితో కొట్టజూచాడు. ఆ బాలకుడు అతి చాకచక్యంతో ఉన్నవాడు ఉన్నట్లే క్రిందికి వంగి లేచాడు. పురుషోత్తం అతన్ని కత్తితో ఎన్నిసార్లు పొడవచూచినా బాల యోధుడు కుడి ఎడమలకు వంగటం, లేదా గాలిలో పైకి ఎగిరి, గిరటాలు కొట్టి తిరిగి నిటారుగా నిలబడడం చేస్తున్నాడు. పురుషోత్తం గదను ఉపయోగించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. గద ఆ పిల్లవాడి శరీరాన్ని కనీసం తాకను కూడా తాకలేదు. క్రమంగా పురుషోత్తం అలసిపోయాడు. ఇదే అదునుగా ఆ పిల్లవాడు చాకచక్యంకొద్దీ పైకెగిరి, తన కాలి మడమతోటీ, పాదాలతోటీ, పిడికిలి గుద్దులతోటీ పురుషోత్తం ఎదపైనా, తలపైనా, వీపుపైనా మహావేగంతో మోదటం మొదలు పెట్టాడు. వరసగా పడుతున్న ఆ దెబ్బలకు దిక్కు తోచలేదు పురుషోత్తముడికి. అసలు ఆ వీరుడు తనకు ఎదురుగా ఉన్నాడో, ప్రక్కన ఉన్నాడో, వెనుక ఉన్నాడో కూడా ఊహించలేనంత వేగంగా తిరుగాడుతూంటే, ఇక ఏమీ చేయలేని నిస్సహాయతలో పురుషోత్తం చేతులు మోడ్చి నేలకొరిగాడు.

రాజుగారు ఆశ్చర్యంతో "మహామంత్రీ! మన సాంప్రదాయక యుద్థ విద్యల్ని అన్నిటినీ మించిన ఈ విద్యను ఏమంటారు? నువ్వన్న చీనాదేశపు యుద్ధ విద్య ఇదేనా? దీనిని మీకెవరు నేర్పారు?" అని ప్రశ్న వెనుక ప్రశ్న సంధించాడు.

"వీటిలో పలు రకాలు ఉన్నాయి- ఈ విద్యలని 'మార్షల్‌ విద్యలు' అంటారు ప్రభూ. కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి పేర్లతో‌ ఇవి మన తూర్పు దేశాలలో ఔన్నత్యాన్ని పొందాయి. వస్తుత: ఏ విద్యా కూడా తనంతట తాను గొప్పదీ కాదు; తక్కువదీ కాదు ప్రభూ, తమరికి తెలియనిదేమున్నది? యోధునికి ఔన్నత్యమే ఆ విద్యలో ప్రకాశిస్తుంది. యోధుని సాధనవల్ల విద్య పరిపుష్టం అవుతుంది; యోధుని గర్వం విద్యని హరిస్తుంది" అన్నాడు మహామంత్రి, ఓరకంట పురుషోత్తముడిని చూస్తూ. "తమరు ఈ పదిమంది కుర్రవాళ్ల మీదికి ఇరవైమంది సైనికులను పంపండి ప్రభూ! వీరి ప్రజ్ఞను ప్రత్యక్షంగా చూడవచ్చు" అని జోడించాడు.

రాజుగారి ఆజ్ఞతో ఇరవైమంది సైనికులు, కొందరు గదలు ధరించి, కొందరు ఖడ్గాలు ధరించీ ముందుకు దూకారు. కొందరు తమ ధనుస్సులనుండి బాణాలు వేయటం మొదలెట్టారు. మార్షల్ విద్యలు నేర్చిన యువయోధులంతా వీర విహారం‌ చేసారు. కొద్ది సేపట్లోనే మైదానం అంతా ఖాళీ అయింది: ఇరవై మంది సైనికులూ మట్టి కరచారు!

రాజుగారు యువకుల్ని మెచ్చుకొని, దేవాలయ రక్షణ కోసం వారిని నియోగించేందుకు అనుమతించారు. 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లు, మహామంత్రి ఒక వైపున పురుషోత్తముడి అహాన్ని ఓడించాడు; మరో వైపున దేవాలయపు సమస్యనీ తీర్చాడు. రాజుగారి మెప్పు నందాడు. బుద్ధి శాలుల ప్రతిభ బహుముఖంగా ఉంటుంది కదా!