ఆ రోజు ఆదివారం.
రవి అల్పాహారం తిని, అలా ఊరి బయట తిరిగి వద్దామని బయలు దేరాడు.
మెల్లగా వాళ్ల ఊరికి దగ్గర్లో ఉన్న నది గట్టున నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా పోతూ ఉంటే అతనికి నది ఒడ్డునే ఓ పెద్ద మామిడి చెట్టు కనబడ్డది.
మామిడి చెట్టుపైన ఒక పక్షి గూడు ఉంది. ఆ గూటిలో ఏమున్నాయో చూడాలని అతనికి ఆశ పుట్టింది.
వెంటనే గబగబా చెట్టు ఎక్కాడు వాడు. ఆశగా గూడులోకి తొంగి చూసాడు. గోధుమరంగు గుడ్లు ఉన్నాయి అందులో.
వెంటనే వాటిని జేబులో వేసుకోని క్రిందకు దిగబోయాడు.
అంతలోనే కాలు జారి నదిలో పడ్డాడు.
నదిలో ఉన్న మొసలి ఒకటి రవి కాలును పట్టుకొని నది లోపలికి లాక్కెళ్లింది.
నీళ్లల్లో ఊపిరి ఆడక, గట్టిగా బిర్ర బిగుసుకు పోయాడు రవి. మొసలి రవిని తీసుకు పోయి ఒక కోట గుమ్మాన వదిలేసింది.
రవి గభాలున లేచి, నదినుండి దూరంగా పోవటం కోసమని, ఆ కోటలోకి దూరాడు.
ఆ కోటలో ఒక రాజుగారు- బంగారు సింహసనం మీద కుర్చుని ఉన్నాడు. ఆయన రవికేసి చూస్తూనే, కోపంగా "నువ్వేగా, పిట్ట గుడ్లని దొంగతనం చేసిన పిల్లోడివి?. తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష తప్పదు" అన్నాడు!
వెంటనే వాడిని అక్కడికి పట్టుకొచ్చిన మొసలిని పిలిచి, "నువ్వు వీడి వీపుపై నీ తోకతో ఇరవై దెబ్బలు కొట్టు" అని ఆదేశించాడు. మొసలి రవిని కొట్టేందుకు ముందుకు వచ్చింది. తన తోకని పైకెత్తి వాడిని ధబాలున కొట్టబోయింది.
ఆ క్షణాన్నే రవి భయంతో కేక వేసి, మంచం మీది నుండి కింద పడ్డాడు. చూస్తే తనకి వచ్చింది ఒట్టి కలే! గుడ్లూ లేవు; మొసలీ లేదు! నేరమూ లేదు; శిక్షా లేదు!!