13 సంవత్సరాల క్రితం ఇద్దరు స్నేహితులు విడిపోయారు. వాళ్ళు "మళ్ళీ ఇదే చోటుకి పదమూడు సంవత్సరాల తరువాత వచ్చి కలుసుకుందాము" అని అనుకున్నారు.

పదమూడేళ్ళ తరువాత, ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో ఓ యువకుడు ఒక మైదాన ప్రాంతంలో నిలబడి ఉన్నాడు. అతని పేరు మదన్. అతను ఎవరికోసమో వేచి చూస్తున్నాడు. చీకటిలో‌ నిలబడి ఉన్నాడేమో, అతని ముఖం సరిగ్గా కనిపించటం లేదు.

అంతలో అక్కడికి ఒక పోలీసు వచ్చాడు. అతను డ్యూటీలో‌ ఉన్నట్లు, పోలీసు డ్రస్ వేసుకొని ఉన్నాడు. నేరుగా ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి పలకరించాడు. 'ఇంత చీకటి వేళ, ఇక్కడ ఏం చేస్తున్నావ'ని అడిగాడు. యువకుడు తన స్నేహితుడు కైలాష్‌ గురించి, పదమూడు సంవత్సరాల తర్వాత కలుద్దామని తాము అనుకున్న సంగతీ చెప్పాడు.

కైలాష్ కోసం చూస్తున్నాను. 'నా మిత్రుడు ఎక్కడున్నా ఇవాళ్ల తప్పకుండా వస్తాడు ఇక్కడికి' అన్నాడు. తరువాత తన గురించి కూడా చెప్పాడు. తను ఆ ఊరిని వదిలి పెట్టాక ముంబాయి చేరుకున్నట్టు, అక్కడ సిటీలో వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించినట్లు వివరంగా చెప్పాడు. పోలీసతను అక్కడే మరి కొంత సేపు నిలబడి, యువకుడికి 'గుడ్ నైట్' చెప్పి వెళ్ళిపోయాడు.

కొద్ది సేపటికి అక్కడికి మరొక వ్యక్తి వచ్చి, నీడలో నిలబడిన యువకుడిని పలకరించాడు 'మదన్! ఎలా ఉన్నావు?!' అంటూ.

ఐతే యువకుడు అతన్ని గుర్తు పట్టలేదు. 'ఎవరు మీరు?' అని అడిగాడు.

"నేనేరా, కైలాష్‌ని" అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి.

కానీ‌ అతని ముఖం మీద పడుతున్న వెలుగు వల్ల అతను కైలాష్ కాదు అని గుర్తు పట్టిన మదన్ వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించాడు.

కానీ‌ ఆ మనిషి గబుక్కున అతని మీదికి దూకి అతన్ని బంధించి బేడీలు వేసాడు. "బొంబాయిలో అనేక సంవత్సరాలుగా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నందుకు గాను నిన్ను అరెస్టు చేస్తున్నాను" అంటూ, తన జేబులోంచి ఒక ఉత్తరాన్ని తీసి మదన్‌కు ఇచ్చాడు.

ఉత్తరంలో ఇలా రాసి ఉంది. 'మిత్రమా, మదన్! ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. పదమూడేళ్ల తర్వాత కలుద్దామనుకున్నాం; కలిసాం, చూసావా?! నువ్వు చేస్తున్న పనులకు గాను ముంబాయ్‌ పోలీసులు నీ గురించి చాలా కాలంగా వెతుకుతున్నారు. నేను కూడా పోలీసునే. 'నా మిత్రుడే అ దొంగ' అని ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడే గ్రహించాను. అయినా నిన్ను నా చేతులతో బంధించలేక వేరే ఇన్స్‌పెక్టర్ గారిని పంపిస్తున్నాను. అన్యథా భావించక లొంగిపోగలవు.

నీ‌ ప్రియమిత్రుడు కైలాష్.

ఉత్తరం చదివి స్మగ్లర్ మదన్‌ నోరు వెళ్ళబెట్టాడు.