రంగమ్మ చాలా పేదరాలు. ఆమె ఒక్కగానొక్క కొడుకు మహేష్ పుట్టి సంవత్సరం తిరగకనే భర్త చనిపోయాడు. ఆనాటినుండి ఆమె కూలి చేసుకుంటూ కొడుకుని సాకింది. తను ఒక్కపూటే తిన్నా, కొడుకుని మాత్రం ప్రతి రోజూ బడికి పంపింది. "నాయనా, బాగా చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి నాయనా. మనకు వేరే ఆస్తులు లేవు" అని మంచి మాటలు చెప్పి బాగా చదివించింది.

మహేష్ కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్లు బాగా చదివాడు. తెలివితేటలు గలవాడు అని పేరు తెచ్చుకున్నాడు. పోటీ‌ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. "ఇంక మన కష్టాలు తీరినట్లే. నువ్వు కూలికి పోనక్కర్లేదు. జీవితమంతా దర్జాగా ఉండు" అని కొడుకు చెబితే మురిసిపోయింది రంగమ్మ.

అయినా, అన్నీ అనుకున్నట్లు సాగితే ఇది జీవితం ఎందుకవుతుంది? మహేష్‌కి పెద్ద ఇంటి సంబంధం చూసింది తల్లి. నెల తిరిగేసరికల్లా వాడి పెళ్ళి జరగనే జరిగింది. కోడలు రత్నమ్మ అందంగా, సుకుమారంగా ఉండేది. 'కొడుక్కి తగిన భార్య' అని రంగమ్మ సంతోషపడింది.

అయితే ఆ 'తగిన భార్య' రంగులు త్వరలోనే బయట పడ్డాయి. రత్నమ్మకు పొదుపు లేదు. ఎంత దొరికితే అంత ఖర్చు పెట్టేస్తుంది. పెళ్ళయిన నాటినుండీ మహేష్ తన జీతం డబ్బులు తెచ్చి భార్య చేతికే ఇవ్వసాగాడు. ఆమె అటూ ఇటూ చూడకుండా వచ్చిన డబ్బులను మొత్తాన్నీ‌ ఏ నెలకానెల ఖర్చు పెట్టేయ సాగింది.

"ఇట్లా అయితే ఎలాగ?భవిష్యత్తుకోసం కొంచెమైనా దాచుకోవాలి కదా?" అనిపించేది రంగమ్మకు. అయినా కోడలిని మటుకు ఏమీ అనకుండా, ఆమెకు నచ్చిన వంటలు చేసి పెడుతూ మురిపెంగా ఉండసాగింది. కానీ కోడలికి మాత్రం అత్త తీరు సరిపోలేదు. ముసలమ్మ ముసలి వాసన వచ్చేది. పరిశుభ్రంగా ఉండేది కాదు. అందరినీ ముట్టుకొని ముట్టుకొని మాట్లాడేది; చేతులు కడుక్కోకనే వంటపనికి దిగేది. ఇక ఇరుగు పొరుగులు వస్తే ఏవేవో ముచ్చట్లు పెట్టేది!

అంతేకాక, తన భర్తకు తన కంటే ఈ రంగమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం! రోజూ ఆఫీసునుండి రాగానే తనతో ఒక్క నిముషం మాట్లాడి, మిగతా సమయం అంతా అమ్మతోటే ముచ్చట్లు పెడతాడు! తను పలకరిస్తే అలసిపోయినట్లు ముఖం పెడతాడు కానీ తల్లి దగ్గర మాత్రం చాలా సంతోషంగా, అసలు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు!

చివరికి కోడలు విసిగిపోయింది. టీవీ సీరియళ్ళలో చూపించే అత్తాకోడళ్ళ పోట్లాటలు కూడా ఆమెను ప్రభావితం చేసి ఉండాలి: అత్తను ఎలాగైనా ఇంటినుండి తరిమేయాలని నిశ్చయించుకున్నది.

ఇక అప్పటినుండీ రంగమ్మ ఏ పని చెప్పినా చేయటం మానేసిందామె. ఎప్పుడూ "నీకు తిండి దండగ. నీవల్ల మాకు ఏమాత్రం ప్రయోజనం లేదు. నువ్వు ఏ అనాథాశ్రమానికో వెళ్లచ్చుగా, మా సంతోషానికి ఎందుకు, అడ్డుగా ఉంటావు?" అనటం మొదలు పెట్టింది.

ఒకసారి మహేష్ ఆఫీసు పని మీద క్యాంపుకు వెళ్ళిన సమయం చూసుకొని అత్తతో పెద్ద పోట్లాట వేసుకొని ఇంట్లోంచి బయటికి గెంటి వేసింది.

ఆ రోజునే రంగమ్మ నిశ్చయించుకున్నది: 'తనకు ఇంకా శక్తి ఉన్నది; ఇట్లా వీళ్ల మీద ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు- తమ ఊరికి వెళ్ళి స్వతంత్రంగా ఉండచ్చు' అని.

అయితే ఆమె అట్లా రైలెక్కేందుకు వెళ్తుండగానే, క్యాంపునుండి ఇంటికి తిరిగి వస్తున్న కొడుకు ఎదురయ్యాడు- "ఎక్కడికి, వెళ్తున్నావు?" అంటూ. తల్లి చెప్పకనే సంగతినంతా గ్రహించిన అతను "సరే, నువ్వు ఊరికి వెళ్ళు" అని చెప్పి, తన మిత్రుడు ప్రవీణ్‌కు ఫోను చేసాడు. ప్రవీణ్ పోలీసు అధికారి.

అతను సంగతంతా విని, "ముసలి తనంలో తల్లి దండ్రులను చూసుకోవటం పిల్లల బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తించని వాళ్ళు శిక్షార్హులు కూడా! నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ముందు నా దగ్గరికి వచ్చి, రెండు మూడు రోజులు మా ఇంట్లోనే ఉండు" అని ఏదో చెప్పాడు.

తర్వాత కొద్ది సేపటికే పోలీసులు రత్నమ్మ ఇంటి తలుపు తట్టారు: "మీరు మీ అత్తని ఇంట్లోంచి తరిమేసారని వార్త అందింది మాకు. మీరు మా వెంట స్టేషనుకు రావాలి" అని.

రత్నమ్మ కంగారుగా భర్తకు ఫోను చేసేందుకు చూసింది. కానీ మహేష్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు! దాంతో ఆమె ఆ రోజంతా పోలీసు స్టేషన్‌లో గడిపింది. మరునాడు కూడా ఆమె స్టేషనులోనే ఉంది.

అక్కడి పోలీసులు ఆమెతో "మీ అమ్మే గనక నిన్ను చిన్నప్పుడు భారమనుకొని వదిలేసి ఉంటే నువ్వెక్కడ ఉండేదానివి? రేపు ప్రొద్దున నీకు పుట్టబోయే కొడుకు, వాడి భార్య నిన్ను భారంగా బావించి ఇంటి నుండి తరిమేస్తే నీ పరిస్థితి ఏంటి?" అని రకరకాలుగా చెప్పారు.

"ఆమె మంచిది కాబట్టి మా దగ్గరికి రాలేదు. వచ్చి కేసు పెట్టి ఉంటే నీతోబాటు నీ‌ భర్తని కూడా మేం అరెస్టు చేయాల్సి వచ్చేది. ఆమెకు ఏదైనా అయితే మీ ఇద్దరికీ ఏళ్ల తరబడి జైలు శిక్ష తప్పదు" అని భయపెట్టారు కూడా.

మూడో రోజు ఉదయం పోలీసు స్టేషనుకు వచ్చిన మహేష్ తనకు ఇదంతా ఇప్పుడే తెలిసినట్లు నటిస్తూ, "అయ్యో! మా అమ్మ ఇంత పని చేస్తుందనుకోలేదు. నీ మీదనే పోలీసు కంప్లయింటు ఇస్తుందా?! ఆమె పని చెబుతానాగు!" అన్నాడు.

అప్పటికే హృదయపరివర్తన చెందిన రత్నమ్మ "ఇందులో అత్తమ్మ తప్పేమీ లేదు. అంతా నేను చేసిందే! పాపం, ఈ వయసులో ఆమె ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో! తను పోలీసుల దగ్గరికి పోనే లేదట! నేనే, పనికి మాలినదాన్ని, తనని అర్థం చేసుకోలేక ఇంట్లోంచి తరిమేసాను" అని కళ్లనీళ్ళు పెట్టుకున్నది.

పోలీసు అధికారిగా ప్రవీణ్‌ కూడా భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టుకొని గట్టిగా మాట్లాడాడు. "మీ అమ్మ మీ సొంత ఊరికే వెళ్ళిందని తెల్సింది. మర్యాదగా మీరిద్దరూ వెళ్ళి అవిడని ఒప్పించి ఇంటికి తెచ్చుకుంటారా, లేకపోతే మేమే మీ మీద పూర్తిస్థాయి క్రిమినల్ కేసు వ్రాసుకోవాలా?" అని అడిగాడు.

రత్నమ్మ చెంపలు వేసుకుంటూ "బుద్ధి వచ్చింది సర్, ఇక ఎన్నటికీ‌ ఇలాంటి పరిస్థితి రానివ్వం. ఆవిడని పువ్వుల్లో‌ పెట్టి చూస్కుంటాం" అన్నది.

అదే రోజున వాళ్ళిద్దరూ వెళ్ళి రంగమ్మను ఒప్పించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఇక ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా అంతా కలిసి మెలసి జీవించారు.