కొత్తపల్లి అడవిలో ఓ కుందేలు ఉండేది. దానికి పెద్ద పెద్ద కళ్లు, చురుకైన ఒళ్లు ఉండేవి. గెంతుతూ గెంతుతూ ఎంతదూరం పోయేదో లెక్కలేదు. దాన్ని చూసి ఎవరైనా ముచ్చటపడేవాళ్లు. వాళ్లమ్మ ఓ చిట్టి మువ్వనొకదాన్ని తెచ్చి కట్టింది, దాని మెడకి. చిట్టి కుందేలు గెంతినప్పుడల్లా ఆ మువ్వ "ఛమ్‌...ఛమ్‌"అనేది! 'ఛమ్‌ ఛమ్‌' అని ఎక్కడ వినబడ్డా, కొత్తపల్లిలో పిల్లలు "అదిగో! వచ్చింది కుందేలు పిల్ల!" అని గంతులు వేసేవాళ్లు.

కొన్ని రోజులకి ఊరంతా 'ఛమ్‌ ఛమ్‌'లయ్యాయి- తల్లులంతా వాళ్ల పిల్లల కాళ్లకి మువ్వలు తెచ్చిపెట్టారు మరి! ఊళ్లో ఎక్కడెక్కడ 'ఛమ్‌ ఛమ్‌' అని వినబడ్డా, పెద్దవాళ్ల గుండెలు కరిగేవి, పెదిమల మీద నవ్వులు విరిసేవి.

ఆ మధ్యనే ఎప్పుడో చిట్టి నెమలి ఒకటి, ఎక్కడి నుండి వచ్చిందో, వచ్చి చేరింది కొత్తపల్లిలో. దాని పింఛానికి ఎన్ని రంగులో లెక్కలేదు. నీలం, పచ్చ, ఆకాశనీలం, పసుపు, నలుపు-ఇంకా ఏమేమో రంగుల్ని మెరిపించేదది. అన్ని రంగులూ తళ తళలాడుతుంటే, వాటి నిగారింపులో ఊరంతా మునిగితేలేది. "అదిగో మెరుపు!" అని కొత్తవాళ్లు ఎవరైనా అంటే, "కాదులే, అది మా నెమలి!" అనేవాళ్లు ఊరి జనాలు.

కొన్ని రోజులకి ఊరంతా మెరుపులయ్యాయి. తల్లి తండ్రులంతా వాళ్ల పిల్లలకి రంగు రంగుల బట్టలు తొడగటం మొదలెట్టారు. ఇప్పుడిక ఊరంతా రంగులే! పిల్లలు చకచకా తిరుగుతూంటే వాళ్ల ఒంటి మీది వన్నెలు విరజిమ్మేవి. చూసే పెద్దవాళ్ల కళ్లలో మెరుపులు విరిసేవి.

అకస్మాత్తుగా ఓసారి మా గొప్ప సువాసన ఒకటి అలుముకున్నది ఊళ్లో. "ఎంత మంచి వాసన!" అని అందరూ ముక్కులు ఎగబీల్చటం మొదలెట్టారు. కొన్ని రోజులకి ఎవరో పిల్లలు కనుక్కున్నారు- "ఇది కదిలే వాసన!" అని. 'ఊరుకోండిరా! సువాసనలు ఎందుకు కదుల్తాయి?' అన్నారు పెద్దవాళ్లు. "కాదు కాదు. ఇది మాత్రం కదిలే వాసనే!" అని పిల్లలు! ఊరంతా అదే చర్చ అయ్యింది కొన్నాళ్ల పాటు. చూడగా అది 'పునుగు పిల్లి' పనట! ఎప్పుడొచ్చిందో, ఏంటో మరి! ఒక్క పునుగు పిల్లి ఊరంతటినీ సువాసనల్లో ముంచెత్తింది.

తర్వాత చూస్తుండగానే జనాలు రకరకాల పూలచెట్లు తెచ్చి ఇళ్లలోనూ, చేనుల్లోనూ పెంచటం మొదలెట్టారు. ఇప్పుడు గులాబీ, జాజి, మల్లెల సుగంధాలన్నీ ఊళ్ళో గాలినంతటినీ మహత్తరంగా మార్చేశాయి. ఆ పూలు పెట్టుకొని తిరిగే పిల్లలతో ఊరు ఊరంతా పరిమళించిపోయింది.

ఇట్లా పిల్లలు రంగుల్నీ, రుచుల్నీ, వాసనల్నీ, అరుపుల్నీ- ఇవన్నీ మోసుకొని ఊరంతా‌ నింపేసరికి, నవంబరు నెల వచ్చేసింది. బడిలో పెద్దవాళ్ళు అందరూ ఒకటే ముచ్చట పడ్డారు: యీసారి పిల్లల పండగ చాలా బాగా జరపాలని.

"ఉహుఁ డబ్బుల్లేవు" అన్నారు హెడ్మాస్టరుగారు, నీరసంగా. బాలల దినోత్సవాలు జరిపేందుకని ఈమధ్య ప్రత్యేకించి డబ్బులేమీ ఇవ్వట్లేదు పైవాళ్ళు."

అందరూ నిశ్శబ్దమైపోయారు. చివరికి తెలుగు అయ్యవారు అన్నారు “అయినా పండగలు డబ్బుల్తోటి జరుగుతాయాండి? పిల్లలు, పెద్దలు మనస్ఫూర్తిగా పాల్గొంటే జరుగుతాయి గానీ?!” అని.

“ఊరికే ముందు రోజున బడినంతా శుభ్రం చేసుకొని, అలికి ముగ్గులు వేయిద్దాం! డ్రాయింగ్ అయ్యవారు వేయించిన బొమ్మలే మనకి తోరణాలు!” అన్నారు సోషల్ టీచర్.

“పిల్లలు వేసుకొచ్చే రంగురంగుల బట్టలే మతాబులు; వాళ్ల కళ్లలో సంతోషాలే వెలుగులు; వాళ్ళు సంతోషంగా పాడే పాటలే మంగళ వాయిద్యాలు" అన్నారు తెలుగు అయ్యవారు.

"అయినా అందానికి మనకేం తక్కువ?! ఊరంతా ఇంత చక్కని పూలు ఉంటేను?!” అన్నారు లెక్కల టీచరుగారు.

“పిల్లల చేత చక్కగా ఉపన్యాసాలిప్పిద్దాం, కవితలు రాయిద్దాం, పాటలు పాడిద్దాం. బానే ఉంటుంది. డబ్బుల్తో పనేంటి?!" అన్నారు ఇంగ్లీషు అయ్యవారు, సాలోచనగా.

“ప్లాస్టిక్ గ్లాసులు, తోరణాలు లేకపోతే పర్యావరణానికీ మంచిది- అవేమీ లేకపోతేనే నయంలెండి, నిజమే" అన్నారు భౌతికశాస్త్రపు అయ్యవారు.

“మీకెందుకు సార్, నామీద వదలండి. జోకులు, కధలు బాగా రాలితే, పండగ అద్భుతంగా ఉంటుంది" అన్నారు డ్రాయింగ్ సార్.

“అన్నీ బాగున్నాయి గానీ.. కొంచెం మంచి మంచి స్వీట్లు, చక్కని భోజనం ఉంటే.. “ సణిగారు ఒకరు, వెనకనుండి.

“డబ్బుల్లేవు. అవి మాత్రం కుదరవు" గుర్తుచేశారు హెడ్మాస్టరుగారు.

"పండగరోజు స్వీట్లు లేకపోతే బావుండదులెండి- అవి నావంతు! నేను తెచ్చిస్తాను" అన్నారు, అప్పటివరకూ ఏమీ అనని హిందీ టీచరుగారు.

“మరింకేం, అయితే భోజనాలు నావంతు!” అన్నారు హెడ్మాస్టరుగారు నవ్వుతూ.

ఇంకేముంది, పిల్లల పండగ మా గొప్పగా జరిగింది! ఊరు ఊరంతా ఆరోజున బళ్ళోనే!

మరి మీరూ ఏదైనా ప్లాన్ చేయండి, చూద్దాం!

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.