బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో బెజవాడ దగ్గర్లోనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లె చాలా చిన్నది.

అక్కడ ప్రజలంతా చాలా అమాయకులో, అజ్ఞానులో- 'వాళ్లకి అసలు ఏమి తెలుసు, ఏమి తెలీదు' అనేదే మనకు తెలీదు.

వాళ్లెవ్వరికీ అసలు కరెంటు బల్బు అంటే తెలీదు. ఊరు మొత్తానికీ ఒకే ఒక్క టెలిఫోన్- పోస్టాఫీసులో ఉండేది. దాన్ని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉండేవాళ్ళు.

అట్లాగే ఊరు మొత్తానికీ కలిపి ఒకే ఒక్క గడియారం ఉండేది. పంచాయితీ ఆఫీసుకు పైన ఉండేది, ఆ గడియారం.

ఊళ్ళో ఒక్క రేడియో కూడా ఉండేది కాదు; ఇక టెలివిజన్ సంగతే అడగకండి. సెల్‌ఫోనులు, కంప్యూటర్లు అప్పటికి ప్రపంచంలోనే ఇంకా ఎక్కడా లేవు, ఇంక ఆ ఊళ్ళో ఎందుకుంటాయి?- అట్లాంటివేమీ లేవు.

ఒకనాడు ఉన్నట్టుండి ఏదో అయ్యింది- ఎవ్వరికీ తెలియదు, నిజంగా ఏమైందో- కానీ ఆనాటి నుండీ రోజులు తొందరగా గడిచిపోసాగాయి ఊళ్ళో. పొద్దు నిలవడం లేదు- మధ్యాహ్నం ఒంటిగంటకే సూర్యుడు అస్తమిస్తున్నాడు! ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఊళ్ళోవాళ్ళకి నిద్ర ఆగట్లేదు. అందరూ గందరగోళ పడసాగారు.

చూస్తూ చూస్తూండగానే పరిస్థితులు మరింత విషమించాయి. తెల్లవారుజామున ఐదు గంటలకే సూర్యుడు అస్తమించటం మొదలు పెట్టాడు! రాత్రిపూట ఎవ్వరికీ నిద్ర పట్టట్లేదు- ఉదయం ఎనిమిదికల్లా అందరికీ నిద్ర రావటం మొదలైంది!

జనాలంతా దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇప్పుడే ఇట్లా ఉంటే, ముందు ముందు ఇక సూర్యుడే గ్రామంలోకి రాని రోజులు ఉంటాయని అందరూ భయపడ్డారు. "నిద్రలేకపోతే ప్రజలకు పిచ్చి పడుతుంది" అని శ్లోకాలు వినబడసాగాయి. ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు.

అట్లాంటి గడ్డు సమయంలో ఆ ఊరి ప్రజలకు ఆశాకిరణంలాగా వచ్చాడు ఒక స్వామీజీ. ఊరి ప్రజలందరూ ఒక్కటై ఆయనకు స్వాగతం చెప్పారు. "మా గ్రామానికి ఏమైందో చెప్పండి స్వామీ" అని వేడుకున్నారు.

స్వామీజీ కళ్లు మూసుకుని కొద్ది సేపు మౌనంగా ఉన్నారు. తన దివ్య చక్షువుతో చూసి, సర్వం గ్రహించారు. కొద్ది సేపటికి ఆయన ముఖం మీద చిరునవ్వు విరిసింది. మెల్లగా కళ్ళు తెరిచారాయన.

"మరేం లేదు నాయనలారా. ఈ గ్రామానికి విపరీతమైన అరిష్టం ఒకటి పట్టింది. దాని వల్ల దేవతలకు ఈ ఊరిపైన అకారణమైన ద్వేషం కలిగింది; దుష్టశక్తులకు ఊరంతా లోబడింది.

దానికి నివారణ లేకేమి, ఉన్నది- శాస్త్రయుక్తంగా సంకట నివారణ హోమం చెయ్యాలి. లేకపోతే ఊరంతా స్మశానంగా మారుతుంది; అందరూ చనిపోతారు.

అంతటి అరిష్టం ఏదైనా గ్రామానికి చుట్టుకోవటం అన్నది అసలు చాలా అరుదు. మరి ఈ హోమం చాలా ప్రత్యేకమైనది. చాలా డబ్బు ఖర్చుతో కూడుకున్నది- కనీసం లక్ష రూపాయలు అయినా అవుతుంది. అందువల్ల ప్రజలంతా చందాలు వేసుకొని ఈ మొత్తాన్ని సేకరించుకోవాలి. ఆ తర్వాత నాకు తెలియజేస్తే హోమాన్ని ప్రారంభించగలను"

స్వామీజీ మాటను అలా వెలువరించారో లేదో, ప్రజలు చందాలు ఇవ్వటం మొదలు పెట్టారు. హోమానికి ముహూర్తం కూడా నిర్ణయించబడింది అప్పటికప్పుడు.

చీకటి పడింది.. హోమం ఏర్పాట్ల విషయంలో ఊరి సర్పంచికి ఏదో సందేహం కలిగింది- 'ఈ సమయంలో స్వామీజీని కలవచ్చో, లేదో' అని, అనుమానంగానే ఆయన ఉన్న ఇంటి వద్దకు వెళ్ళాడు.

యథాలాపంగా కిటికీలో నుండి లోపలికి తొంగి చూశాడు. చూస్తే ఏముంది?- అక్కడ స్వామీజీ మందు తాగుతూ ఉన్నాడు! దాంతో గుమ్మడికాయలాగా గుంభనంగా ఉన్న ఊరంతా ఒక్కసారిగా బ్రద్దలైంది! "అతను దొంగ స్వామి" అని తెలిసిన ఊళ్ళో జనాలంతా మహా సముద్రంలాగా అతని మీద పడ్డారు.

చివరికి దొంగ స్వామి అసలు సంగతి చెప్పాడు: "నేను నెలరోజుల క్రితం ఈ గ్రామానికి వచ్చాను.. ఊరు మొత్తానికీ ఒకే ఒక్క గడియారం ఉందని గమనించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో నేను పంచాయతీ ఆఫీసు పైకి ఎక్కి, గడియారపు సమయం మార్చాను.

ఆ నాటినుండి ఏ రోజుకారోజు రాత్రిపూట సమయాన్ని నా ఇష్టం వచ్చినట్లు మారుస్తూ పోయాను.

మీరందరూ మూర్ఖులు; నేను ఊహించినట్టే ఈ గడియారంలోని తప్పుడు సమయాన్ని చూసి మోసపోయారు. కళ్లకెదురుగా కనబడే ప్రకృతి సహజమైన సూర్యుడిని కాక, తప్పుడు సమయాన్ని సూచించే కృత్రిమ గడియారాన్ని మరీ అతిగా నమ్మారు. ప్రొద్దున మూడు గంటలకే సూర్యుడు అస్తమిస్తున్నాడని గందరగోళపడ్డారు.

మీ తిక్క కుదరాలంటే, కొంచెం డబ్బు వదలాల్సిందే! అందుకనే నేను వేషం మార్చి, సాధువులాగా ఈ గ్రామానికి వచ్చాను. మీ ఊరిని ఉద్ధరించేందుకు ప్రయత్నించాను.

తప్పు నాది కాదు; మీ అజ్ఞానానిది! అర్థం చేసుకోండి" అని.

అయినా అదేమీ అర్థం కాని జనాలు అతన్ని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి, పోలీసులకు అప్పగించారు!