అనగనగా ఒక ఊళ్లో నలుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. శివయ్య, రంగయ్య, రామయ్య, వరదయ్య- వీళ్లకు నలుగురికీ విపరీతమైన డబ్బు ఆశ. 'కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా?' అనే, వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు.
అదే ఊళ్లో ఒక ముసలి మంత్రాల అవ్వ ఉండేది. అవ్వకు వాళ్లంటే చాలా మంట- నిజానికి అవ్వకు వాళ్లంటే ఇష్టమే; వాళ్ల బుద్ధంటేనే రోత. చూసి చూసి, 'ఎలాగైనా వాళ్ల డబ్బు ఆశని వదిలించాలి' అని, అవ్వ ఓ పథకం వేసింది.

ఒకరోజు రాత్రి అన్నదమ్ములు నలుగురూ నడుచుకుంటూ పోతున్నారు. ముసలి అవ్వ వాళ్ళకు కనిపించకుండా ఒక చెట్టు క్రింద దాక్కొని, బొంగురు గొంతుతో పాడింది-

"అడవి అంచున ఉన్నది పరమ శివుని గుడి
అక్కడ దాగున్నది మరి- అంతులేని పసిడి
వెతికితేనే కదా, అది దొరికేది?
ఊరికే ఆశపడితే ఏమౌతుంది మరి?!" అని.

అది విని టక్కున ఆగారు వాళ్లు.

"ఎవరురా, పాడేది?" అని ఆ చుట్టుప్రక్కలంతా వెతికారు.

అయితే అక్కడ ఎవరూ కనబడలేదు. చెట్టు క్రింది తొర్రలో దాక్కొని ఉంది అవ్వ.

కానీ వాళ్లకు పాట అర్థం అయితే అయ్యింది. డబ్బు ఆశవాళ్లని ఇక ఆలోచించనివ్వలేదు. తొందర తొందరగా నిర్ణయించుకున్నారు: "ఇప్పటికి ఇంటికి వెళ్తాం; రేపు ఉదయాన్నే బయలుదేరి అడవి అవతలి ప్రక్కన ఉన్న పాడు బడ్డ గుడికి పోతాం" అని.

గుడిలో త్రవ్వటం కోసం కావలసిన సామగ్రి అంతా సర్దుకున్నారు వాళ్ళు. "ప్రక్క ఊరికి పని మీద వెళుతున్నాం!" అని ఇంట్లో‌ చెప్పి బయలుదేరారు.

అడవిలో పోతూ ఉంటే అన్నదమ్ములకి బాగా ఆకలైంది. వెంట తెచ్చుకున్న తిను బండారాలేవో తిన్నారుగానీ, అవి ఒక పంటి క్రిందికి కూడా చాలలేదు. తిన్నాక నలుగురికీ విపరీతమైన నిద్ర వచ్చింది. "ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందాం; ఒక్క అర్థగంట" అని నలుగురూ తలా ఒక చెట్టు క్రింద ఒరిగారు. లేచి చూసుకునే సరికి ఏముంది, తెచ్చుకున్న సామగ్రి అంతా మాయం!

నలుగురూ ఉత్తి చేతులతో‌ వెనక్కి తిరిగి వచ్చారు. కానీ‌ పట్టుదలకొద్దీ మరుసటి రోజున మళ్లీ బయలుదేరారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువ తిండి తీసుకెళ్ళారు. "మధ్యలో ఎక్కడా నిద్ర పోకూడదు" అనుకున్నారు. అయితే ఈసారి అన్నం తినగానే వాళ్ళకు బాగా దాహం వేసింది. త్రవ్వకానికి కావలసిన సామాన్లన్నీ అక్కడే ఓ చెట్టుకు తగిలించి, నీళ్లకోసం వెతుక్కుంటూ‌ పోయారు. తిరిగి వచ్చి చూస్తే సామాన్ల మూట మాయం!

'అయినా ఏమీ‌ పరవాలేదు. ముందుకే పోదాం' అని పోయారు, కానీ‌ ఎంత దూరం నడిచినా అడవి అంతమే కాలేదు. ఎక్కడో దారి తప్పినట్లున్నారు. చూడగా అదంతా ఏదో కొత్త ప్రదేశం! తమకు ఏమాత్రం పరిచయం లేని ప్రాంతం!

అప్పటికే సాయంత్రం అయ్యింది. ఇంకొంచెం సేపట్లో‌ చీకటి పడేటట్లున్నది. నలుగురూ ఓ చెట్టుపైకెక్కారు. అదే చెట్టు మీద ఓ తేనెపట్టు ఉండింది. శత్రువులు వచ్చారని తేనెటీగలన్నీ ఒక్కసారిగా వాళ్లమీద దాడి చేసాయి. వాటి బారినుండి తప్పించుకుందామని అందరూ పరుగెత్తి దగ్గర్లో ఉన్న ఓ కుంటలోకి దూకారు.

చూడగా అది ఓ ఊబి! బురదలో కూరుకుపోయిన నలుగురూ రాత్రంతా తన్నుకులాడి, అతి కష్టం మీద బయట పడ్డారు. "ఇంటికెళ్ళిపోదాం రా!" అన్నాడొకడు.

"ఇంత కష్టపడింది ఎందుకు, బంగారం దొరికించుకోనిదే ఇంటికి పోరాదు!" అన్నారు మిగిలిన ముగ్గురూ.

నలుగురూ ముందుకే సాగారు. ఆరోజు మధ్యాహ్నానికి అడవి మధ్యలో ఉన్న ఓ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. వీళ్ల కోసమే అన్నట్టు అక్కడ చక్కటి అరుగు, కూర్చునేందుకు నాలుగు మంచి బండలు పరిచి ఉన్నాయి.

అలసిపోయిన నలుగురూ ఆ బండలమీద చేరగిల బడ్డారు. మరుక్షణం బండలు వేగంగా కదిలి, క్రింద నేలలోకి వెళ్ళిపోయాయి! కళ్ళు మూసి తెరిచేంతలో వీళ్ళు నలుగురూ ఓ‌ పెద్ద భవనంలో‌ ఉన్నారు!

అది ఒక బంగారు భవనం. అక్కడి వస్తువులన్నీ బంగారమే. వీళ్ళు నలుగురూ ఆత్రంగా తమకు నచ్చిన సామాన్లన్నీ‌ సంచీల్లోకి వేసుకుంటూ పోయారు; ఎవరైనా కనబడతారేమోనని వెతుకుతూ. అక్కడ అసలు ఎవ్వరూ ఉన్నట్లు లేరు!

అంతలో బంగారు రంగులో మెరిసిపోతున్న ఆవు ఒకటి ప్రత్యక్షమైంది అక్కడ. వీళ్ళు నలుగురూ దాని చుట్టూ చేరి, దాన్ని నిమిరారు. దాని కళ్ళు, పళ్ళు, తోక- మొత్తం అంతా బంగారమే! అంతలో అది తోక ఎత్తింది-

"బంగారు ఆవు పేడ వేస్తున్నదిరా, బంగారంలోంచి బంగారమే వస్తుంది, ఇంకేంటి' అని నలుగురూ దాని వెనక్కి చేరారు. అది బంగారు పేడ వేసిందనుకుంటున్నారు కదూ? కాదు- అది మామూలు పేడే వేసింది! వీళ్లందరి ముఖాలమీద చిందింది ఆ పేడ!
అందరూ కలిసి ముఖాలు కడుక్కునేందుకు వెళ్లారు. అది కూడా ఓ‌ బంగారు కొలనులో ఉన్న బంగారు నీళ్ళతో! అక్కడే ఉన్న బంగారు బిందెలో‌ ఆ నీళ్ళు నింపుకున్నాడు రంగయ్య. వెంటనే అతని కాళ్ళు అక్కడి నేలకు అతుక్కుపోయాయి! ఎంత ప్రయత్నించినా అతను శిలమాదిరి ఐపోయాడు తప్ప, ఇక కదలలేకపోయాడు! మిగిలినవాళ్ళు ఆ బిందెను వాడినుండి ఊడబెరికాకగానీ రంగయ్యకు మామూలు రూపం రాలేదు.

దాంతో నలుగురికీ చాలా భయం వేసింది.

అంతలోనే వాళ్లకు వినబడింది: "ఇక్కడినుండి వెళ్ళాలంటే మీరు అందరూ మోకాళ్ళమీద నిలబడి, ఏడ్చుకుంటూ ఏదైనా పాట పాడాలి. మాకు ఆ పాట నచ్చితే మిమ్మల్ని ఇక్కడినుండి తీసుకెళ్లటం కోసం మెరిసే తెల్లతామరలు, నల్లకలువలు పంపిస్తాం" అని.

నలుగురూ ఆ గొంతు చెప్పినట్లే మోకాళ్ళమీద నిలబడి, ఏడ్చుకుంటూ‌ పాడారు-

"మెరుపులు పూవుల దండగా
మబ్బులు మెత్తని దిండుగా
గగనము వెచ్చని శయ్యగా
హాయిగా ఉందుమె, తారకా?
కన్నుల క్రమ్మిన మబ్బులు తొలగెను
మనసుల నిండిన మోహము వదిలెను
తెల్ల తామరల తేరుపై, నల్లతామరల- నంచున నిడుకొని రావే రంగుల తారకా! మమ్ముల కొనిపోవే రంగుల తారకా!" అని.

మరుక్షణం అక్కడ రెండు తెల్లతామరలు, నల్లకలువలు ప్రత్యక్షం అయ్యాయి. "మీ దురాశ వదలకపోతే మరిన్ని కష్టాలు తప్పవు, జాగ్రత్త. ఇప్పుడిక తెల్లతామరలమీదికెక్కి నిలబడండి" అని వినిపించింది. అప్పటికే బాగా భయపడిపోయిన నలుగురూ చెంపలు వేసుకొని తెల్లతామరలు ఎక్కి నిలబడ్డారు. కన్నుమూసి తెరిచేలోగా వాళ్ళు వాళ్ల ఊరి అంచున ఉన్నారు! అంతవరకూ వాళ్లు పోయాయనుకున్న సామాన్లన్నీ వాళ్లతోటే ఉన్నాయి!

సంచులు మోసుకుంటూ వస్తున్న నలుగురినీ చూసి, అవ్వ ముసిముసి నవ్వులు నవ్వింది.

"ఉడతా ఉడతా బడి కొస్తావా,
నా సంక నున్న సంచి కాస్త మోస్తావా?
చంటి నీ వెంట వస్తూ ఉంటినే,
కాని సంచి మోయలేక చస్త ఉంటినే
ఏమి దాస్తివే బంగారు ఇంత నీ సంచిలో
ఇంత బరువదేల నీ పెయ్యి నొయ్యదానే?" అని పాడింది గట్టిగా.

ఆ గొంతు విని, "ఈ ముసలిదానికి వయసు చచ్చింది కానీ చూపు చావలేదు- అయినా ఇంకోళ్లను అనేదేముంది, మాకు బాగా బుద్ధి వచ్చింది" అనుకుంటూ నలుగురూ ఎవరి ఇంటికి వాళ్ళు పోయారు.