ఎద్దు మాంసం

అమెరికా, బ్రెసిల్, చైనాలతో సహా అనేక దేశాల్లో ఎద్దు మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంది. ఈనాడు ప్రపంచం తినే మాంసాల్లో మూడోవంతు ఎద్దుమాంసమేనట. ఎద్దుమాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో మన దేశానిది రెండవ స్థానం.

మన దేశ జనాభాలో 75% మంది హిందువులు: ఆవును పవిత్రంగా భావిస్తారు; ఆవుకు పూజలు చేస్తారు. హిందువుల్లో ఉన్నత కులాల వారు అనేకమంది ఎద్దు మాంసాన్ని తినరు. అంతేకాక, ఎద్దు మాంసం తినే కులాలవారిని వారు చిన్నచూపు చూస్తారు కూడా. ఆ విధంగా ఎద్దుమాంసం ఎవరో కొందరి ఆహారపు అలవాటుగా మిగిలిపోక, మతానికి-కులానికి- సమాజంలో వేరు వేరు వర్గాల మధ్య ఉన్న సంబంధాలకు, రాజకీయాలకు చెందిన సున్నితమైన అంశంగా విస్తరించింది.

చాలా ఏళ్ల క్రితం, 1856లో 'సిపాయిల తిరుగుబాటు'కు ప్రేరణనిచ్చింది ఎద్దుమాంసం. ఆ రోజుల్లో సిపాయిలకోసం లార్డ్ కానింగ్ కొత్తరకం తుపాకులు ప్రవేశపెట్టాడు. ఆ తుపాకీగుండ్ల మీది కవర్‌ను పళ్ళతో లాగి పడెయ్యవలసి ఉంటుంది. అయితే ఆ కవర్‌కు ఆవు మాంసం, పంది మాంసం పూశారని భారతీయ సైనికులంతా మండి పడి, బ్రిటిష్ అధికారులపై తిరగబడ్డారు. అలాగనే "మనకు స్వాతంత్ర్యం రాగానే మన ప్రభుత్వం మొట్ట మొదట గోవధ నిషేధ చట్టం అమలు చేస్తుంది" అని గాంధీజీ అనేక సార్లు అన్నాడు.

మన రాజ్యాంగపు ఆదేశ సూత్రాలలో కూడా గోవధ నిషేధం ఉన్నది. అయినా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు వేటికవి, తమకు తోచిన విధంగా ప్రవర్తించాయి. దీనిమీదే కాదు, ఆదేశ సూత్రాలలోని అంశాలపైన అన్నింటిపైన ఇదే వైఖరి: అధికారికంగా నిషేధాలు విధించటం తప్ప, ఆ ఆదేశాల అమలుకోసం అవసరమైన సామాజిక పరిస్థితిని కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించింది లేదు.

1976లోనే మహారాష్ట్రలో గోవధ నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. 2011లో గుజరాత్ రాష్ట్రం ఆవు మాంసంతో బాటు ఎద్దుమాంసాన్ని- అమ్మటం-కొనటం-రవాణా చేయటం అన్నిటినీ నిషేధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ లలో కూడా గోవధపై నిషేధాలు ఉన్నాయి. కేరళ-గోవా-పశ్చిమ బెంగాల్- ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో వీటిపైన ఎలాంటి ఆంక్షలూ లేవు. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణాల్లోనైతే 'అనుమతి లేని' ఆవులను-ఎద్దులను కబేళాలకు పంపరాదని నియమం ఉన్నది. అయినా 'ప్రజలని ఈ చట్టాల వెనకనున్న ఉద్దేశాల దిశగా నడిపింపజేసే ప్రయత్నాలేమీ ఎక్కడా కానరావు.

'ఇప్పుడు గోవధని నిషేధించాల్సిందే' అని కేంద్రం అనటం, వెనువెంటనే ఎద్దుమాంసం తినేవారిపై దాడులు జరగటం- మేధావులు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చెయ్యటం- గందరగోళం నడుమ నిర్ణయాలు- ఇలా జరుగుతున్నది.

ఇంతింత చరిత్ర ఉన్నది కాబట్టి, గోవధ నిషేధం గురించి మనందరం కూడా బాగా ఆలోచించాలి. ఇవేమీ చిన్న చిన్న సంగతులు కాదు. సమాజంలో ఎవరికి వాళ్ల ఆహారపు అలవాట్లున్నాయి; ఆహారం ఎప్పుడైనా మనస్సుకు దగ్గరగా ఉంటుంది. ఆహారం గురించిన ఎట్లాంటి నిషేధం వల్లనైనా చాలామంది మనసులు గాయపడతాయి; వాళ్ళకు కష్టం తోస్తుంది- 'మేమెందుకు వినాలి, మీ మాట?' అంటారు వాళ్ళు.

అయితే మరొక విధంగా కూడా చూడాలి. జంతువుల పట్ల దయతో వ్యవహరించటం నాగరికతకు ఒక సూచిక. మనకు సహాయం చేసే జంతువుల్ని మనం తినెయ్యటం ఏమంత గొప్ప పని కాదు కూడాను- ఆవులైనా సరే, ఎద్దులైనా సరే- మరే జంతువులైనా సరే!

ఆలోచిస్తారు కదూ, ఎట్లా చేస్తే మంచిది?