1.

వసంతకాలం వచ్చింది. నులి వెచ్చని సూర్య కిరణాలను కిటికీ తెరలు ఆపలేక పోతున్నాయి. ఆరవ తరగతి గది అంతా వెలుతురు పరచుకుంటున్నది. అలాంటి వాతావరణంలో ఎవరైనా దు:ఖంగా ఎందుకు ఉంటారు? ఉపాధ్యాయిని మామూలుగా అయితే చండ శాసనురాలు. అయితే ఇవాళ్ళ ఆమె కూడా బయటకి చూస్తూ ఉంది, చివరి బెంచీల్లోని పిల్లలు చేస్తున్న అల్లరిని పట్టించుకోకుండా. రానున్న వేసవి సెలవల ఊహతో పిల్లలంతా హుషారుగా ఉన్నారు.

అయితే ఆండ్రూస్ ముఖంలో మాత్రం ఆందోళన కనిపిస్తున్నది: అతను ఒక సమస్యలో ఇరుక్కుని ఉన్నాడు- ఆ సమస్యకి తగిన సలహాని కేవలం ఒక్క డోటాస్ మాత్రమే ఇవ్వగలడు..

సలహా కోసం అతని దగ్గరికి ఆండ్రూస్ ఇప్పటికి పది సార్లన్నా వెళ్ళి ఉంటాడు. అయినా అతను ఇతన్ని పట్టించుకోవడం లేదు... ఆ రకంగా తన విలువ పెంచుకుంటున్నాడు- అడగ్గానే సలహా ఇస్తే విలువ ఎలా వస్తుంది మరి?

బడి వదిలి పెట్టిన తర్వాత డోటాస్‌ను వదలకుండా పట్టుకున్నాడు ఆండ్రూస్. “డోటాస్! ఆగు, నువ్వు నాకు సహాయం చేయాలి! లేకపోతే మా నాన్న చేతిలో నేను చచ్చానే!" అన్నాడు బ్రతిమాలుకుంటు-న్నట్లుగా.

“సరే చెప్పు!" అన్నాడు డోటాస్.

“మా నాన్న ఇటీవల 'కిర్గీజియా' దేశానికి వెళ్ళి వచ్చాడు. ఆ దేశం వెళ్ళడానికి రైలులో నాలుగు రోజుల ప్రయాణం. మా నాన్న విమానంలో వెళ్ళాడనుకో, అయితే మా నాన్న కిర్గీజియా నుండి వస్తూ ప్రత్యేకమైన టోపీ ఒక దాన్ని తెచ్చాడు! అది నల్లగా, నలుచదరంగా ఉంది! దాని చుట్టూ తెల్ల సిల్కు లేసు కుట్టి ఉంది! దాన్ని ఆ దేశంలో 'పుర్రెటోపీ' అంటారట- మా నాన్న చెప్పాడు. మా ఇంట్లో అందరికీ దాన్ని చూపించి, ఆ తర్వాత దాన్ని భద్రంగా బీరువాలో పెట్టాడు. మా నాన్నకి టోపీలు సేకరించే అలవాటుంది. అవంటే ఆయనకు చాలా ఇష్టం. మా బీరువాలో వివిధ దేశాలనుండి తెచ్చిన టోపీలు ఎన్నో ఉన్నాయి-" అని ఆగాడు.

“అయితే ఇప్పుడు నీ సమస్యేమిటి?” అడిగాడు డోటాస్.

“ఆ టోపీ భలే ఉంది. దాన్ని మీకందరికీ చూపించాలనిపించింది నాకు. దాంతో మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ టోపీని తీసుకున్నాను, బీరువా లోంచి. దాన్ని నా తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటానో చూసుకోవాలనిపించింది, దారిలో.

'సరే' అని నది దగ్గరకు పోయానా, తల వంచి చూస్తుండగానే టోపీ జారి నీళ్ళల్లో పడిపోయింది!" అన్నాడు ఆండ్రూస్.

ఆ మాట చెప్తుంటే వాడి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసాయి!

“ఆ తర్వాత?” అన్నాడు డోటాస్.

“నీకు తెలుసు కదా, ఆ నది ఎంత వేగంగా ప్రవహిస్తుందో? టోపీ నీళ్ళల్లో పడిందో లేదో, కన్ను మూసి తెరిసేలోగా అది కాస్తా కొట్టుకుపోయింది!" మూలిగాడు ఆండ్రూస్.

“మరి ఇంటి దగ్గర ఈ విషయం ఎవరికీ చెప్పలేదా?” అన్నాడు డోటాస్.

“అమ్మో! చెప్తే ఇంకేమైనా ఉందా?” అన్నాడు ఆండ్రూస్. భయంతో వాడి మూలుగు ఆగిపోయింది.

“అయితే ఇప్పుడేం చేద్దామను-కుంటున్నావు?”

“అది తెలియకేగా, నిన్ను ఇబ్బంది పెడుతున్నది? ఇదిగో, ఈ తపాలా బిళ్ళ తీసుకుని ఏదైనా సలహా ఇవ్వు!" అని ఓ పాత తపాలా బిళ్ళని డోటాస్ చేతికిచ్చాడు ఆండ్రూస్.

ఒక సలహాకు ఒక తపాలా బిళ్ళ తీసుకుంటాడు డోటాస్. వాడు దాన్ని పరీక్షగా చూసి "ఇది చిరిగిపోయింది" అన్నాడు.

“నేను చూడలేదులే, అయినా ఇదేనా ఏంటి, ఇంకా చాలా తపాలా బిళ్ళలు ఇస్తాను- నువ్వు నన్ను ఈ ఆపద నుండి కాపాడితే!" అన్నాడు ఆండ్రూస్, కంగారుగా.

డోటాస్ తల పంకించాడు. ఆలోచిస్తూ అటూ ఇటూ నడవసాగాడు. "పుర్రెటోపీ! పుర్రెటోపీ!" అనుకోసాగాడు. అది మంచి శకునం. అందరూ అంటారు- 'డోటాస్ అలా అనుకుంటూ నడుస్తున్నప్పుడు అతని బుర్ర పాదరసంలా పని చేస్తుంది' అని. ఆ సంగతి విని ఉన్నాడు కనుక ఆండ్రూస్ అతన్నే చూస్తూ ఉబలాటపడుతున్నాడు.

కాసేపు అలా తిరిగిన డోటాస్, ఆండ్రూస్ వైపు చూస్తూ- "సరే- కిర్గీజియా రాజధాని ఏంటో మీ నాన్నని అడిగి తెలుసుకో. ఆ తర్వాత అక్కడ ఎన్ని బడులు ఉన్నాయో అడుగు. అతనికి ఏ మాత్రమూ అనుమానం రానీయకు సుమా! మామూలుగా తెలుసుకోవడం కోసం అడుగుతున్నట్లు అడిగి తెలుసుకో. వెళ్ళు- వెళ్ళి, రేపు ఈ సమాచారంతో తిరిగి రా!” అన్నాడు.

“ఇంతేనా?” అని నిరాశపడ్డాడు ఆండ్రూస్.

“ఇప్పటికి ఇంతే. తర్వాత ఏం చేయాలో నువ్వు ఈ సమాచారం తెచ్చాక చెప్తాను" అన్నాడు డోటాస్.

ఆండ్రూస్ ఇంటికి పరుగుతీశాడు.

2.

ఆ రాత్రి తండ్రి ప్రక్కనే పడుకుని ఆయన్ని చిన్నగా మాటల్లోకి దించాడు ఆండ్రూస్.

"నాన్నా, పోర్చుగల్ రాజధాని ఏది?” అడిగాడు, నేరుగా కిర్గీజియా గురించి అడగకుండా.

“లిస్బన్" అన్నాడు తండ్రి.

“ఓ, అయితే ఇస్టానియా రాజధాని?”

“టాలిన్"

“అవును నాన్నా, నేను మర్చిపోయాను. మరి కిర్గీజియా రాజధాని ఏమిటి?” అడిగేసాడు.

“ఫ్రంజే" అన్నాడు తండ్రి. కుమారుడు అలా అన్ని విషయాలూ అడిగి తెలుసుకుంటున్నందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది.

“ఫ్రంజే, ఫ్రంజే, ఫ్రంజే" అని చాలా సేపు మననం చేసుకున్నాడు ఆండ్రూస్- మర్చిపోకుండా ఉండటానికి.

“అయితే మిస్బన్ లో ఎన్ని పాఠశాలలు ఉంటాయి?”

“మిస్బన్ కాదు, లిస్బన్- అది పోర్చుగల్ రాజధాని" అని, "ఏమో, చాలా పాఠశాలలు ఉంటాయి" అన్నాడు తండ్రి.

"అయితే మరి ఫ్రంజేలో ఎన్ని ఉంటాయో తెలుసా, సుమారుగా?” అడిగాడు.

“ఆఁ..ఓ ముప్ఫై ఐదు నలభై ఉండొచ్చు" అన్నాడు నాన్న.

“సరే నాన్నా, నిద్రొస్తోంది" అన్నాడు ఆండ్రూస్ కళ్ళు మూసుకుని.

“నువ్వు ఇలా ప్రశ్నలడగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏమైనా సందేహాలుంటే రేపు అడుగు" అన్నాడు నాన్న అమాయకంగా.

సరేనని తల ఊపి నిద్రలోకి జారాడు ఆండ్రూస్- "ఫ్రంజే, ఫ్రంజే, ముప్ఫై ఐదు-నలభై" అనుకుంటూ.

3.

మరునాడు ఉదయాన్నే డోటాస్ దగ్గరకి వెళ్ళి తండ్రి చెప్పిన విషయాలు చెప్పాడు ఆండ్రూస్.

ఇవ్వవలసిన సలహా గురించి డోటాస్ కి ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదులా ఉంది; మళ్ళీ అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టాడు.

హఠాత్తుగా ఆండ్రూస్ వైపు తిరిగి "హాజరు పట్టీలో నీ సంఖ్య ఎంత?” అని అడిగాడు.

“పదిహేను" అన్నాడు ఆండ్రూస్- 'హాజరు పట్టీలో సంఖ్య ఎందుకు, ఇప్పుడు? జాతకం చెప్తాడా ఏమిటి?' అనుకుంటూ.

“ఆఁ బాగుంది. ఇప్పుడు ఇంక నువ్వు -ఫ్రంజే నగరంలో-ఆరో తరగతి చదివే- పదిహేనో సంఖ్యగల పిల్లవాడికో, పిల్లకో- ఉత్తరం రాస్తావు"

“ఎందుకు? ఏమని?” అన్నాడు ఆండ్రూస్, ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టి.

“జాబుతో బాటు మన బడి వార్షిక నివేదిక కూడా పంపు. నువ్వు పుర్రెటోపీని పోగొట్టుకొని చిక్కుల్లో పడిన విషయాన్ని రాసి, వాళ్ళని ఒక పుర్రెటోపీ పంపమని అడుగు" చెప్పాడు డోటాస్.

“ఓ, అదా!” అంటూ ఆండ్రూస్ ఆశ్చర్యపోయాడు. 'ఎంత తెలివైన ఆలోచన! ఎంత సులభమైన ఉపాయం! నా బుర్రకు ఈ ఆలోచన రాలేదు ఎందుకని?' అనుకుంటూ సిగ్గు పడ్డాడు.

“ధన్యవాదాలు డోటాస్, చాలా మంచి ఉపాయం చెప్పావు" అని పొగిడాడు.

అయితే డోటాస్ పచార్లు చేయడం అపలేదు ఇంకా. ఆలోచిస్తున్నట్లుగానే ఉంది అతని ముఖం- “ఊఁ.. నువ్వు ఒక్క జాబు మాత్రమే రాస్తే సరిపోదు, సమాధానం రాకపోవచ్చు. కాబట్టి ఫ్రంజేలోని నలభై పాఠశాలలకీ రాయాలి" అన్నాడు.

“నలభై ఉత్తరాలు రాయమంటావా?”

“నలభై కాదు- మన బడిలో ఆరో తరగతిలో నాలుగు సెక్షన్ లు ఉన్నాయి కదా, ప్రతి సెక్షన్‌లోనూ ఒక పదిహేనో నంబర్ ఉంటుంది. అలా అక్కడ కూడా, నలభై పాఠశాలల్లోనూ పదిహేనో‌ నంబర్ ఉన్న ఆరో తరగతి వాళ్ళు నలుగురు ఉంటారు. అంటే నువ్వు మొత్తం నూట అరవై జాబులు రాయాలన్నమాట. అందులో కనీసం ఇద్దరన్నా నీకు పుర్రె టోపీ పంపిస్తే బావుండు- ఒకటి నేను తీసుకోవచ్చు" అన్నాడు డోటాస్.

“అది నువ్వు అడగాలా? రెండు పుర్రె టోపీలు వస్తే తప్పకుండా నీకు ఒకటి ఇస్తాను" అన్నాడు ఆండ్రూస్. అంటూనే పనిలోకి దిగేసాడు. తన నోటు పుస్తకంలోని పేజీలను విడివిడిగా చింపి, ఒక పేజీలో ఇలా రాశాడు -

ప్రియమైన అపరిచిత స్నేహితుడా,
నీ పేరు ఏంటో నాకు తెలియదు. అయితే మనిద్దరం మన బడుల హాజరు పట్టీలో పదిహేనో సంఖ్య గల పిల్లలం. ఆ సంబంధంతో నీకు వ్రాస్తున్నాను.
నాకు ఒక కష్టం కలిగింది. మా నాన్న మీ దేశం నుండి నల్ల నలుచదరపు పుర్రెటోపీ ఒకదాన్ని తెచ్చాడు. దాని చుట్టూ తెల్లని లేసు కుట్టి ఉంది. అయితే నేను దానిని ప్రమాదవశాత్తూ మా ఊరి నదిలో పోగొట్టుకున్నాను. నాన్నకి ఇంకా ఈ విషయం తెలియదు. తెలిస్తే నాకు బాగా దెబ్బలు పడతాయి.
కనుక దయతో నాకు నువ్వు ఒక పుర్రెటోపీని పంపించగలవు. మా బడి వార్షిక నివేదిక కాపీని ఒకదాన్ని నీకు పంపిస్తున్నాను. దానిలో నా అడ్రస్ ఉంది. దయచేసి ఈ విషయాన్ని ఇతరులకెవరికీ తెలియనివ్వకు. ఇప్పటికి ఇంతే సంగతులు. శుభాకాంక్షలతో నీ స్నేహితుడు
ఆండ్రూస్

ఉత్తరం డోటాస్ కి చూపించాడు. “ఆఁ బాగుంది, అయితే దీనికి ఒక వాక్యం కలుపు - 'మా బడి యువక బృందం ప్రతినిధి 'డోటాస్' మీకు గౌరవ వందనాలు తెలుపుతూ, మీతో పరిచయానికి సంతోషిస్తున్నాడు' అని జోడించు" అన్నాడు డోటాస్.

పాపం ఆండ్రూస్ ఆ వాక్యం కూడా కలిపి, మొత్తం 160 ఉత్తరాలు రాసి పోస్ట్ చేశాడు. అన్ని ఉత్తరాలు రాయడానికి అతనికి మూడు రోజులు పట్టింది.

ఒక వారం గడిచింది. రెండు వారాలు గడిచాయి. ఏమీ సమాధానం రాలేదు. ఆండ్రూస్ వాళ్ళ నాన్న వ్యాపారం పని మీద వేరే ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు- 'వెళ్ళేముందు బీరువా తెరుస్తాడు. పుర్రెటోపీ లేని సంగతి గమనిస్తాడు. ఎలాగ?' అనుకుంటూ కాలు గాలిన పిల్లిలాగా డోటాస్ చుట్టూ తిరుగుతున్నాడు ఆండ్రూస్.

"ఉండు ఉండు, సమాధానం వస్తుంది" అంటునే ఉన్నాడు డోటాస్ నిబ్బరంగా.

4.

ఆ రోజున తరగతి గదిలోకి రాగానే టీచర్ అన్నది- "ఆండ్రూస్- నీ కోసం ఏదో పార్సిల్ అనుకుంటాను, ఒకటి వచ్చింది. విశ్రాంతి గదిలో ఉంది- తెచ్చుకో" అని.

గుండె దడదడలాడుతుండగా లేచి వెళ్ళాడు ఆండ్రూస్, డోటాస్ వైపు ఆందోళనగా చూస్తూ. ఊదారంగు కాగితంలో చుట్టిన పార్సిల్ ఒకటి ఉన్నది అక్కడ. దాన్ని తీసుకుని బయటకి వచ్చి, గబ గబా విప్పి చూశాడు. లోపల – పుర్రెటోపీ! అచ్చు నాన్న తెచ్చినటువంటిదే. అద్భుతం! లోపల ఒక జాబు కూడా ఉంది:

ప్రియమైన ఆండ్రూస్,
నీ జాబు అందుకున్నాను. చాలా సంతోషం. మీ బడి వార్షిక నివేదిక నాకు నచ్చింది. నీ కోసం ఒక పుర్రెటోపీ కొని పంపుతున్నాను. దూరంగా ఉన్న నీతో స్నేహం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ దేశాన్ని గురించి, మీ అలవాట్ల గురించి విన్నాను. నేను చనిపోయిన సీతాకోక చిలుకలని సేకరిస్తుంటాను. నీకు దొరికితే వాటిని అగ్గిపెట్టెలో పెట్టి పంపు"
ఇట్లు
అసన్

ఆండ్రూస్ దాన్ని తీసుకుని తరగతి గదిలోకి వచ్చాడు నవ్వు మొహంతో. డోటాస్ చూపులలో గెలిచిన గర్వం కనిపించింది.
తర్వాతి రోజున నాలుగు పార్సిళ్ళు వచ్చాయి- అన్నీ పుర్రెటోపీలే.

తర్వాత రోజున ఆరేడు వచ్చాయి!

ఇప్పుడు వాటిని విప్పేందుకు కూడా ఆసక్తి పోయింది ఆండ్రూస్‌కు. వాటి లోపల ఏమి ఉండేదీ, చూడకనే చెప్పచ్చు కదా!
వాటిల్లో ఒక పార్సిల్‌ని పూర్తిగా డోటాస్‌కి ఇచ్చేసాడు. మిగిలిన వాటిని తన అల్మైరాలో సర్దుకున్నాడు.

తర్వాతి రోజున మళ్ళీ పార్సిళ్ళు వచ్చాయని టీచర్ చెప్పింది- వెళ్ళి తెచ్చుకున్నాడు.

ఆ మరుసటి రోజున తరగతి గదిలోకి వచ్చిన టీచర్ "ఆండ్రూస్, ఈరోజు నీకు దాదాపు యాభై పార్సిళ్ళు వచ్చాయి. ఆశ్చర్యంగా ఉందే, ఎవరు పంపిస్తున్నారు?” అంది.

“నా పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు పంపిస్తున్నారు టీచర్" చెప్పేసి, ఇంక ఆమెకి తన ముఖం చూపించడం ఇష్టం లేనట్లు గబగబా విశ్రాంతి గదికి వెళ్ళాడు ఆండ్రూస్.

అక్కడ బల్ల నిండా పార్సిళ్ళు కుప్ప పోసి ఉన్నాయి.

'వీటన్నిటినీ మోసుకుపోయేదెలాగ? ఏం చేయాలి, ఎక్కడ దాచాలి?' అని ఆండ్రూస్ తికమక పడ్డాడు. అతని పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయింది.

'ఇదంతా డోటాస్ తప్పు. ఒక జాబు రాస్తే పోయేదానికి నూట అరవై రాయించాడు!' అనుకునేసరికి అతనికి చాలా కోపం వచ్చింది. ఆ పార్సిళ్ళన్నిటినీ తెచ్చి తమ తరగతి గదిలోనే, ఓ మూలన కుక్కాడు.

పిల్లలందరూ ఆండ్రూస్‌ వైపుకు వింతగా చూస్తున్నారు. భోజనాల సమయంలో ఆండ్రూస్ డోటాస్ దగ్గరికి వెళ్ళి, గుసగుసగా- "ఇదంతా నీ వల్లే.. ఇప్పుడు గనక ప్రధానోపాధ్యాయుడు అడిగితే నీ మీదే చెప్తాను" అన్నాడు.

డోటాస్ వీడివైపుకొక చూపు విసిరి, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

5. ఆండ్రూస్ ముఖం వేళ్ళాడేసుకుని టోపీలన్నింటినీ బ్యాగ్‌లోను, తన వానకోటులోను కుక్కి, గోతాం లాగా ఇంటికి మోసుకు వెళ్ళాడు.

ఆ మూటను ఇంటి గోడ ప్రక్కన పెట్టి, తలుపు తట్టాడు. వాళ్ళమ్మ తలుపు తీసి, ఎప్పటిలాగానే వంటింట్లోకి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళాక, ఆండ్రూస్ మూటను మెల్లగా తన గదిలోకి చేర్చి, ఒక్కొక్క పార్సిలునూ విప్పి చూసుకున్నాడు. ప్రతి పార్సిల్‌లోనూ ఒక పుర్రెటోపీ ఉంది; స్నేహం కోరుతూ ఉత్తరం ఉంది.

ఒక పార్సిల్ లో మాత్రం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ఊలు టోపీ ఒకటి ఉంది. ఆ టోపీతో వచ్చిన జాబుని తీసి చదవసాగాడు ఆండ్రూస్.

ప్రియమైన ఆండ్రూస్,
నీ ఉత్తరం నాకు అందింది. నీకు వచ్చిన కష్టానికి నేను చాలా బాధ పడ్డాను. అయితే నీకు టోపీ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. మేము చాలా పేదవాళ్ళం. నా తండ్రి కారు ప్రమాదంలో మరణించాడు. నా తల్లి కర్మాగారంలో పని చేస్తుంది. నాకు తొమ్మిది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. మమ్మల్ని సాకడానికే మా అమ్మ చాలా కష్టపడుతోంది. అయితే నీ ఉత్తరం వచ్చినప్పటి నుండి నీకు సహాయం చేయలేకపోయానే అని నాకు చాలా దిగులు కలిగింది.
నా దిగులు తీర్చడానికేనేమో అన్నట్లు మా అత్త ఊరి నుండి మమ్మల్ని చూడటానికి వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఏడో తరగతి పాఠ్య పుస్తకాల కోసం నాకు కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బుతో ఊలు కొని, మా అక్కల సాయంతో టోపీ అల్లి నీకు పంపేప్పటికి ఆలస్యం అయ్యింది.
'అయ్యో, పుస్తకాలు కొనుక్కోకుండా నాకు టోపీ పంపిందే' అని అనుకోకు. నేను ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా నా స్నేహితుల పుస్తకాల్లోనుండి పాఠాలు రాసుకుని చదువుకుంటాను- అది నాకు మంచిది కూడా.
నీకు ఈ టోపీ నచ్చిందా? అందగానే ఉత్తరం రాస్తావు కదా?
శుభాకాంక్షలతో,
ఐగుత్

అది చదివిన ఆండ్రూస్‌కి చాలా బాధ వేసింది. 'పాపం, ఐగుత్!' అనిపించింది. 'ఈ పాపం అంతా నాది కాదు- ఆ డోటాస్ దే. వాడి పని చెబుతాను' అని తిట్టుకుంటూ మిగిలిన పార్సిళ్ళు విప్పి చూడసాగాడు.
ఆ పార్సిళ్ళ మధ్య అతనికి ఒక ఉత్తరం కనిపించింది:
ప్రియమైన స్నేహితుడా!
నన్ను క్షమించు. నేను నీకు టోపీ పంపలేక పోతున్నాను. తప్పు నాది కాదు. ఏ అంగడిలోనూ నువ్వు అడిగిన టోపీ లేదు. గత పది రోజుల్లోనే అన్నీ అమ్ముడు పోయాయిట. అది మనిద్దరి దురదృష్టం. ఆ నల్లరకం టోపీ కాకుండా మరేదైనా పంపమంటే పంపిస్తాను. ఏ విషయమూ నాకు రాయి.
శుభాకాంక్షలతో
ఇవాన్

అన్నీ చదివేసాక ఆండ్రూస్ టోపీలన్నిటినీ ఓ అట్టపెట్టెలో పెట్టి, తన మంచం క్రింద దాచాడు. ఇక ఆరోజు రాత్రి వాడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఎంత సేపటికీ తనకు తెలీని ముఖాలు- ఇవాన్, ఐగుత్, అసన్, ఇంకా ఎవరెవరో వచ్చి తనతోటి ఇష్టంగా మాట్లాడుతూ కనిపించారు. తను మాత్రం వాళ్లకేసి కన్నెత్తి కూడా చూడలేక-పోతున్నాడు.

తర్వాతి రోజున ఆ ఉత్తరాలన్నీ తీసుకెళ్ళి డోటాస్‌కి చూపించి 'మళ్ళీ ఏదైనా సలహా ఇవ్వు' అని బ్రతిమిలాడాడు ఆండ్రూస్. అన్నీ చదివాక పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప, ఇంకేమీ సలహా ఇవ్వలేదు డోటాస్. ఆండ్రూస్‌కి వాడిని తన్నాలన్నంత కోపం వచ్చింది.

మర్నాడు ప్రధానోపాధ్యాయుడు ఆండ్రూస్‌ని పిలిచాడు. ఆయన బల్ల మీద ఇంకొక పెద్ద పార్సిళ్ళ కుప్ప ఉంది. ఆయన ఆ కుప్పలోంచి తల బయటకి పెట్టి "ఏంటి ఇదంతా? ఫ్రంజే నుండి ఎవరు, ఏమిటి పంపుతున్నారు?' అన్నాడు.

ఆండ్రూస్ తలవంచుకుని పాదాల వైపు చూసుకుంటూ కథ మొత్తం వివరించాడు ఆయనకి.

“లోకంలో ఎవరైనా 160 జాబులు రాస్తారా? ఒక జాబు చాలదా, పోనీ రెండు! అయినా జరిగిన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇలా ఎందుకు చేయడం?” అన్నారు ప్రధానోపాధ్యాయులు.

“డోటాస్‌తో నేనన్నాను కూడా సర్, 'రెండు చాలవా?' అని! అయినా వాడు 'నూట అరవై రాయాల్సిందే!' అని పట్టు పట్టాడు. నాకు ఆ ఉత్తరాలన్నీ రాయడానికి మూడు రోజులు పట్టింది. బొటన వేలు, చూపుడు వేలు- పేజీని తాకి తాకి ఆఖరికి చిటికెన వేలుకి కూడా, కాయలు కాచాయి!" అన్నాడు ఆండ్రూస్ ఉక్రోషంగా.

పెద్దాయన ఆండ్రూస్ మాటలకి పగలబడి నవ్వారు. ఆండ్రూస్ తల సిగ్గుతో మరింత వాలిపోయింది.

“సరే, డోటాస్ తనకు తోచిందేదో చెప్పాడే అనుకో, మరి నీ తెలివి ఎక్కడికి పోయింది? నీకు బుర్రలేదా? వాడికంటే పొడుగ్గా ఉన్నావు, తరగతిలో అందరికంటే బాగా చదువుతావు, ఇంకొన్ని రోజుల్లో పై తరగతికి వెళుతున్నావు?!" అన్నారు.

“క్షమించండి" అన్నాడు ఆండ్రూస్.

ఇద్దరూ కలిసి పార్సిళ్ళు విప్పారు. వాటిల్లో కూడా టోపీలు, స్నేహం కోరుతూ ఉత్తరాలు ఉన్నాయి.

"వాటిని తీసుకుని పద!" అని ఆయన ఆండ్రూస్‌ని వెంటబెట్టుకుని తరగతి గదిలోకి వచ్చాడు.

6.

ప్రధానోపాధ్యాయుడి కనుసైగతో టీచర్ బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిందాకా ఆగి, ఆయన ఆండ్రూస్ చేతిని టోపీలతో‌ సహా ఎత్తి డోటాస్ వైపుకి చూపిస్తూ అన్నారు- "ఓ గొప్ప సలహాదారుడా! నీ తెలివి ఇప్పుడు ఏం సలహా ఇవ్వబోతున్నదో చెప్పు?! ఇంతకీ నీకు అర్థం అయ్యిందా, నేను ఏ విషయం గురించి అడుగుతున్నానో?!” అని.

“అవును అర్థం అయింది!" అన్నాడు డోటాస్, 'దొరికిపోయాను' అనుకుంటూ.

'డోటాస్ చిక్కులో పడ్డాడు!' అనుకున్నారు పిల్లలందరూ.

'అడుగుతుంటే వారం రోజుల నుండీ తప్పించుకు తిరుగుతున్నాడు, ఇప్పుడు ఇరుక్కుపోయాడు. ఏం చెప్తాడింక?!' అని సంతోషాన్ని గొంతులోనే కుక్కుకుని నిలబడ్డాడు ఆండ్రూస్.

డోటాస్ కిటికీ గుండా కాసేపు బయటకి చూశాడు...

ఎండిన ఆకులన్నీ రాలిపోయాక, చెట్లు ఇప్పుడిప్పుడే లేత చిగుళ్ళని వేస్తున్నాయి. సూర్యుడు పడమటిదిక్కుకి సాగిపోతుంటే భూమి మీద నీడలు పరుచుకుంటున్నాయి.

పిల్లలు, ప్రధానోపాధ్యాయుడు, అందరూ నిశ్శబ్దంగా డోటాస్‌ వైపే చూస్తున్నారు.

బయటికి చూస్తున్న డోటాస్ మెల్లగా నవ్వాడు. అతనికి ఏదో ఆలోచన తట్టినట్లుందని అందరూ ముందుకు వంగి ఆత్రంగా అతని వైపుకి చూసారు-

అతను లేచి నిలబడి, జేబులోంచి ఐగుత్ రాసిన ఉత్తరాన్ని తీసి, పెద్దగా చదివాడు. అతను దాన్ని చదవటం పూర్తి చేసే సరికి పిల్లలందరూ మరింత నిశ్శబ్దంలోకి జారిపోయారు. కొంతమందికైతే కళ్ళల్లోంచి నీళ్ళు కూడా కారాయి!

ఇంతలో డోటాస్ స్థిరమైన గొంతుతో అన్నాడు- "ఈ టోపీలన్నిటినీ మనం కొనుక్కుందాం! వచ్చిన డబ్బుతో ఐగుత్‌కి ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు కొని పంపుదాం!" అని.

పిల్లలందరూ చప్పట్లు కొడుతుంటే ప్రధానోపాధ్యాయులవారు మనసులో 'నాకీ ఆలోచన రాలేదే?!' అనుకున్నారు. డోటాస్ భుజం మీద చెయ్యి వేసి "నువ్వు చాలా తెలివిగల వాడివోయ్, చాలా దయగల అబ్బాయివి కూడా" అన్నారు నవ్వుతూ.

"ఎంత చిన్న విషయం, కదా?! నేనేమిటో, ఎప్పుడూ చదువులోనే పడి కొట్టుకుపోతుంటాను. ఇట్లాంటివి నా బుర్రకి తట్టవెందుకో! అందుకేగా, అందరూ డోటాస్‌ని సలహాలు అడిగేది?!' అనుకున్నాడు ఆండ్రూస్. 'టోపీలన్నీ వదిలి పోతాయి' అనుకోగానే గుండెల మీద నుంచి ఒక్కసారిగా పెద్ద బరువు దిగిపోయినట్లనిపించిందతనికి.

డోటాస్ దగ్గరకి వెళ్ళి "భలే ఆలోచన! నేనిప్పుడే ఐగుత్‌కి ఉత్తరం రాస్తాను" అన్నాడు.

"వద్దు- ముందస్తుగా ఉత్తరం రాయకు. ఈ వారాంతానికల్లా మనందరం కలిసి తనకి నేరుగా పుస్తకాలే పంపిద్దాం. అట్లా ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోతే ఎంత బావుంటుందో కదా?!” అన్నాడు డోటాస్.

“కదా!” అన్నాడు ఆండ్రూస్ - పుస్తకాలు అందుకున్నప్పుడు ఐరిస్‌కి కలిగే ఆశ్చర్యం అంతా తనకే కలిగినంత ఆనందంగా నవ్వుతూ.