లలిత, వనిత ఇద్దరూ అక్కచెల్లెళ్లు. వాళ్ళది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి పోయేవాళ్ళు. అయితే అకస్మాత్తుగా ఒక రోజున ప్రమాదంలో వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయారు! ఆ సమయానికి లలిత చాలా చిన్నది- ఆరేళ్ళు అంతే. వనితేమో కొంచెం పెద్దది; ఆ పాపకు పదేళ్లు.
వాళ్ళిద్దరినీ చూసుకునేందుకు బంధువులు ఎవ్వరూ లేరు కూడా. చుట్టు ప్రక్కల వారి సహకారంతో కొద్ది రోజులు నెట్టుకొచ్చాక, చివరికి వనిత రామారావు గారి ఇంట్లో పనికి కుదురుకున్నది.
రామారావుగారు మంచి మనిషి. 'చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు' అని ముందు వనితని పనిలోకి రానివ్వలేదు ఆయన. అయితే అందరూ నచ్చజెప్పాక, 'ఆ పాప పనిచేస్తూ చదువుకోవాలి' అన్న షరతు మీద ఆయన ఒప్పుకున్నాడు. అయితే వనితకు చదువు ఏమంత అబ్బలేదు. ఆ పాప మనసంతా పనిమీద, చెల్లెమీదే ఉండేది. 'చెల్లెని సరిగ్గా చూసుకోవాలి' అనే ఉండేది ఎప్పుడూ.
అంత చిన్న వయస్సులోనే తనకొచ్చే కాస్త నెలజీతాన్నీ రెండు భాగాలు చేసేది వనిత. ఒక భాగాన్ని ఇంటి ఖర్చులకు వాడేది; ఇంకొక సగాన్ని ఒక కుండలో దాచి పెట్టేది.
ఒక రోజున ఆ కుండలో ఇక డబ్బు పట్టలేదు- చూస్తే కుండ నిండిపోయి ఉన్నది! లలితకి, వనితకి ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియలేదు. అంత డబ్బును ఇంట్లో ఉంచుకోవటం ఏమంత మంచిది కాదు!
కొంచెం సేపు ఆలోచించాక, దాన్ని తీసుకొని రామారావుగారి దగ్గరికి వెళ్ళారిద్దరూ- "ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి; ఏమైనా అవసరం పడితే మళ్ళీ తీసుకుంటాం" అని.
ఆయన కాసేపు ఆలోచించి, "చూడమ్మా! లలితది ఇప్పుడు బడికెళ్ళే వయస్సు. నిజానికి నువ్వూ బడికి వెళ్ళాలి- కానీ వెళ్ళట్లేదు. ఒక పని చేద్దాం. ఈ డబ్బులు నా దగ్గర ఉంచుతాను. వీటితోటే లలితను చదివిద్దాం, మా పాప రేఖతో పాటు. ప్రభుత్వ బడిలో చేరితే ఖర్చులు కూడా ఏమంత ఉండవు- మధ్యాహ్నం భోజనం బడిలోనే పెడతారు; ఇక ప్రొద్దున-మాపున భోజనం మా యింట్లోనే చేయచ్చు- మెల్లగా వనిత కూడా కనీసం ఒకపూట బడికి పోవచ్చు" అన్నారు.
అట్లా లలిత బడికి వెళ్లటం మొదలెట్టింది. రామారావుగారు ఆరోజునుంచి లలిత-వనితలకు చాలా సహాయం చేశారు. తన సొంత కూతురు రేఖతో పాటు వాళ్లనీ ఒకేలా చూసుకున్నారు.
అయితే ఒక రోజున రామారావు గారి చేతి గడియారం మాయం అయ్యింది. ఆయన స్నానం చేసేముందు దాన్ని, తన కళ్లజోడును ముందుగదిలో టేబుల్ మీద పెట్టి వెళ్ళారు. వచ్చి చూసేసరికి అది లేదు! తన గడియారాన్ని ఎవరో తీసారని ఆయనకు అర్థం అయ్యింది. కానీ ఎవరు?
ఆ సమయానికి రేఖ బడికి వెళ్ళి ఉన్నది. వనిత ఇల్లు తుడుస్తూ ఉండింది. రామారావుగారికి వనిత మీద కొద్దిగా అనుమానం వచ్చింది. "బయటివాళ్లను ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నారా? చూడండి, ఇట్లానే అవుతుంది. ఈ రోజున గడియారం, రేపు మరొకటి!" అని రామారావుగారి భార్య గట్టిగా అనటం మొదలు పెట్టింది. అది విని వనిత చాలా నొచ్చుకున్నది.
ఆ పాప చిట్టి హృదయం చిన్నబోయింది. ఇల్లు తుడిచేటప్పుడు తను కూడా చూసింది- నిజంగానే ఆ గడియారం టేబుల్ మీద ఉండింది. మరి ఇప్పుడు అది ఎటు పోయింది?
ఆ రోజంతా వనిత మనసు మనసులో లేదు. ఒక వైపున పని చేస్తూనే మరో వైపున ఇల్లంతా వెతుకుతూ ఉండింది. గడియారం జాడలేదు.
ఆరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక, మాయమైన గడియారం గురించి చెల్లెలికి చెప్పింది వనిత. "ఇవాళ్ళ బడిలో రేఖ తన స్నేహితురాళ్లకు ఒక గడియారం చూపిస్తూ ఉండింది. అదే అయి ఉంటుంది బహుశ:. నువ్వేం కంగారు పడకు- రేపు నువ్వు వెళ్ళేసరికి గడియారం ఇంట్లోనే ఉంటుంది చూడు" అని అక్కను ఊరడించింది.
మరునాడు వనిత పనికి వెళ్ళేసరికి, నిజంగానే గడియారం యథాప్రకారం టేబుల్ మీద ఉండింది. రేఖ దాన్ని తిరిగి తీసుకొచ్చేసిందనమాట!
అయితే గడియారం గురించి, రేఖ దాన్ని బడికి తీసుకెళ్లటం గురించి తనతో ఏమైనా చెబుతారేమోనని ఆ రోజంతా చాలా ఎదురుచూసింది వనిత. కానీ రామారావుగారు ఆఫీసుకు వెళ్ళిపోయారు; ఆయన భార్యేమో తనకుగా ఏమీ అనలేదు! మరునాటికి వనితకు జ్వరం వచ్చేసింది. ఆ పాపకు ఇక పనికి వెళ్లాలనిపించలేదు. లలిత బడికి వెళ్ళింది; వనిత మూలుగుతూ ఇంట్లోనే పడుకున్నది.
ఆరోజు సాయంత్రం అవుతుండగా వచ్చారు రామారావుగారు. వనితను, లలితను తమ ఇంటికే తీసుకెళ్ళారు. డాక్టరును పిలిపించి మందులు ఇప్పించారు. నిద్రలో అంతా వనిత కలవరిస్తూనే ఉండింది- 'నేను గడియారం తీయలేదు' అని. మరునాడు జ్వరం కొద్దిగా తగ్గాక, వనిత వెళ్ళి రామారావుగారికి చెప్పింది- "ఇంక నేను పని మానేస్తాను" అని.
రామారావుగారు నవ్వారు. "అర్థమైందా?" అన్నట్లు భార్యవైపు చూశారు. రామారావుగారి భార్య కళ్ళనీళ్ళు పెట్టుకొని వనిత చేతులు పట్టుకొన్నది. రామారావుగారు వనితతో అన్నారు "మేమిద్దరం నిన్న దీని గురించి బాగా ఆలోచించాం- నిజంగానే, నిన్ను ఇక పనిలోంచి తీసేస్తున్నాం!" అని. వనిత నిర్ఘాంతపోయింది.
రామారావుగారు కొనసాగించారు చిరునవ్వుతో- "అయితే విను- ఇకనుండి మీ అక్కచెల్లెళ్ళిద్దరూ వేరుగా ఉండటానికి వీలులేదు- మాతోబాటు మా ఇంట్లోనే ఉండాలి. మేం ఇద్దరం మిమ్మల్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపైన మాకు ముగ్గురు ఆడపిల్లలు. నువ్వు, లలిత, రేఖ. ముగ్గురూ బడికి వెళ్ళాలి; ఆరోగ్యంగా, బలంగా, ఎదగాలి. గొప్పవాళ్ళవ్వాలి!"
"అవునే, మా మాట కాదనకు!" అన్నది రామారావుగారి భార్య. వనిత మళ్ళీ నిర్ఘాంతపోయింది- అయితే ఈసారి సంతోషంగా! అటు తర్వాత వనిత కూడా బడికి వెళ్లటం మొదలు పెట్టింది.
రామారావుగారికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు! ముగ్గురూ చక్కగా చదువుకుంటున్నారు. ముగ్గురూ తప్పకుండా గొప్పవాళ్లవుతారు!