అనగనగా ఒక ఊళ్లో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఎప్పుడూ ఆట పాటలతో బలే సరదాగా ఉండేవాళ్లు వాళ్లు. ఒక రోజున వాళ్లు బడికి పోతుంటే వింత దుస్తులు ధరించిన ముసలాయన ఒకడు కనిపించాడు. రోడ్డు దాటేందుకు శ్రమ పడుతున్నాడు ఆయన. పిల్లలకు ఆయన్ని చూసి జాలి వేసింది. "రోడ్డు దాటుతావా, తాతా?" అని అడిగి, ఆయన్ని చెయ్యిపట్టుకొని రోడ్డు దాటించారు.

ముసలాయన వణుకుతున్న గొంతుతో "మేలు మేలు.. మీరు మంచి పిల్లలు. మీలో దయ ఇంకా మిగిలే ఉంది. ఆగండి- మీకు ఏదైనా బహుమతి ఇస్తాను.." అంటూ తన అంగీ జేబుల్లో వెతుక్కోవటం మొదలెట్టాడు.

"ఏమీ అక్కర్లేదులే, తాతా! దానిదేముంది?!" అన్నాడు రమేష్, కొంచెం సిగ్గుపడుతూ.

"కాదు కాదు- మంచి వాళ్లకు ఏమైనా ఇస్తే, అందరికీ మంచి జరుగుతుంది" అన్నాడు తాత పట్టు వదలకుండా, ఇంకా వెతుక్కుంటూ.

చివరికి ఆయనకు కావలసినవేవో దొరికినట్లున్నాయి- "ఏదీ, చేతులు చాచండి" అని నలుగురి చేతుల్లోనూ నాలుగు విత్తనాలు పెట్టాడాయన- "వీటిని ఎవరికి వాళ్ళు నాటండి. మేలు జరుగుతుంది" అంటూ. అందరూ వెనక్కి తిరిగి పోతుంటే, "ఇదిగో, ఇంకోటి కూడా ఉంది- ఇదికూడా ఉంచుకో, ఎందుకైనా పనికొస్తుంది" అంటూ రమేష్‌కి మరో విత్తనం ఇచ్చాడాయన.

పిల్లలు మొహమాటంగానే ఆ విత్తనాల్ని తీసుకొని, "థాంక్స్" అని చెప్పి బడిలోకి పోయారు.

మళ్ళీ బడి వదిలేసేంతవరకూ ఎవ్వరికీ ఆ సంగతి గుర్తు లేదు. సాయంత్రం ఇంటికి పోతుండగా హరి జేబులో చెయ్యి పెట్టుకుంటే విత్తనం చేతికి తగిలింది. "పొద్దున తాత ఎవరో; బలే ఉన్నాడురా; వెతికి వెతికి మరీ విత్తనాలు ఇచ్చాడు పాపం!" అన్నాడు వాడు, మిగతావాళ్లతో. అందరూ నవ్వుకున్నారు.

"పడెయ్యకండిరా- ఏం విత్తనాలో ఇవి! నలుగురం కల్సి నాటుదాం, ఎక్కడైనా! మన లైబ్రరీ వెనక బాగా బోసి పోయి ఉంటుంది. అక్కడ నాటితే మేలు!" అన్నాడు బాలు.

సరేనని నలుగురూ లైబ్రరీకి పోయి, వెనక ఉన్న ఖాళీ జాగాలో వాటిని నాటి, తలా ఒక చెంబెడు నీళ్ళు తెచ్చి పోసారు.

చూస్తూ చూస్తూండగానే ఆ విత్తనాలు నాలుగూ చకచకా మొలిచాయి! నాలుగు విత్తనాలూ నాలుగు చెట్లయిపోయాయి! ఆ చెట్ల తొర్రల్లోంచి నలుగురు విచిత్ర మనుషులు వచ్చి వీళ్ళముందు నిలబడ్డారు: "మీరు చాలా మంచి వాళ్ళు! ఇన్నాళ్లకి మాకు విముక్తి కలిగించారు. ఏమైనా కోరుకోండి!" అంటూ.

మిత్రులు నలుగురూ ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

"ప్రపంచంలో అంతటా లెక్కలేనన్ని రోబోలు ఉండాలి. అన్నీ మనుషులకు ఏ పనంటే ఆ పని చేసి పెట్టాలి!" అన్నాడు ఆసిఫ్ వెంటనే, గట్టిగా కళ్ళు మూసుకొని.

"ప్రపంచంలో లెక్కలేనన్ని ఫ్యాక్టరీలు ఉండాలి. ఏవంటే అవి తయారు అయిపోతుండాలి. డబ్బులు లేకపోయినా పిల్లలకు కావలసినవన్నీ‌ ఊరికే దొరుకుతుండాలి" అడిగాడు రమేష్.

"భూమి మీద జనాభా ఎక్కువైపోయింది- ఇంతమంది ఉండనక్కర్లేదు. అక్కడొకరూ, అక్కడొకరూ ఉంటే చాలు" అడిగాడు హరి, ఆరోజు ఉదయమే జరిగిన 'జనాభా' పాఠాన్ని గుర్తుచేసుకుంటూ.

"క్రూరమృగాలు ఏవీ అసలు ఉండకూడదు- ప్రమాదాలు అనేవే జరగకూడదు" బాగా ఆలోచించి అడిగాడు బాలు.

"అబ్బ! బలే అడిగారు! ఇట్లాంటి కోరికలు ఇవాల్టి వరకూ ఎవ్వరూ కోరలేదు మమ్మల్ని. మీ ఇష్టప్రకారమే అవుతుంది" అని ఆ వింత మనుషులంతా నవ్వి, మాయమైపోయారు.

మరు క్షణం వాళ్ల చుట్టూ‌ ఉన్న ప్రపంచం మొత్తం వింతగా ఐపోయింది. మనుషులు ఎక్కడో గాని ఒకరు కనబడట్లేదు. ఎక్కడ చూసినా రోబోలు- మనుషులు చెప్పకనే అన్నీ చేసేస్తున్నాయి. ఎటు చూస్తే అటు ఫ్యాక్టరీలు వచ్చి ఉన్నాయి. అన్నిటిలోనూ టాఫీలు, ఐస్క్రీములు, రకరకాల బొమ్మలు తయారౌతున్నాయి. ఒక్కోసారి ఎవరో పిల్లలు వచ్చి ఏవంటే అవి తీసుకుపోతున్నారు వాటినుండి. అక్కడక్కడా జింకలు, ఆవులు, దూడలు కనిపించి గంతులేస్తున్నాయి.

పిల్లలు నలుగురికీ సందడే సందడి. వాళ్ళు ఆడుకునేందుకు ఎన్నో బొమ్మలు వచ్చి పడి ఉన్నాయి. తినేందుకు చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పరమెంట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.

పెద్ద పెద్ద భవంతులు, అన్నీ‌ ఖాళీగా, వీళ్లకోసమే ఉన్నట్లు ఉన్నాయి. ఎక్కడా హడావిడి లేదు. ఎక్కడా జనసమ్మర్దం లేదు.

పిల్లలు నలుగురూ సంతోషంతో‌ పొంగిపోయారు. రోజంతా‌ ఆడుకున్నారు. రాత్రి అయ్యాక వాళ్లకు అమ్మనాన్నలు గుర్తుకొచ్చారు- పిల్లలు గబగబా వాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళి చూసారు. ఇళ్ళల్లో మనుషులన్న వాళ్ళు ఎవ్వరూ లేరు! తగ్గిపోయిన జనాభాలో వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నట్లున్నాయి! "యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్. మే ఐ హెల్ప్ యూ గైస్?" అంటూ వచ్చింది ఒక రోబో. వీళ్ళు ఏం చెబితే అది చేసి పెట్టింది.

అట్లా కొన్ని రోజులు గడిచాయి. అంతలో మరి ఎక్కడినుండి వచ్చాయో, అడవి దున్నలు, ఏనుగులు, నీటి గుర్రాలు అన్నీ పట్టణంలోకి వచ్చి తిరగటం మొదలెట్టాయి. కోతులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ మనుషులకంటే ఎక్కువ ఐపోయి, దొరికిన వస్తువునల్లా నాశనం చేసేస్తున్నాయి.

"ఎందుకైందిరా ఇట్లా?" అడిగాడు హరి, ఒక రోబోని

రోబో చెప్పింది "ఇప్పుడు ఈ ప్రపంచంలో క్రూరమృగాలే లేవు. దాంతో గడ్డి మేసే ప్రాణులు ఎక్కువైపోయాయి. వాటన్నిటికీ సరిపడా గడ్డి లేదు; అందుకని అవన్నీ‌ ఊళ్ళలోకి వచ్చేసాయి" అని. చూస్తూ చూస్తూండగానే వీళ్ళు తినేందుకు సహజమైన వస్తువులేమీ‌ దొరకకుండా అయ్యింది. సాధు జంతువులు అన్నిటినీ ఐపోగొడుతున్నాయి!

ఇట్లా మరి కొన్ని రోజులు గడిచేసరికి పిల్లలు నలుగురికీ బుద్ధి వచ్చేసింది. కానీ పాపం, ఇప్పుడు ఏం చేయగలరు?

బాధగా జేబులో చెయ్యిపెట్టుకున్నాడు రమేష్. ముసలి తాత ఇచ్చిన ఐదో విత్తనం చేతికి తగిలింది! అతను ఎగిరి గంతేసి, మిగిలిన ముగ్గురినీ పిలిచి చూపించాడు దాన్ని. విత్తనాన్ని చూడగానే వాళ్లందరి ముఖాలూ వెలిగాయి: "అన్నీ‌ ఇది వరకు ఉన్నవి ఉన్నట్లుగా చేసేయమందాం!" అరిచారు మిత్రులు సంతోషంగా, ఒక్క గొంతుతో.

"మనం తప్పు చేసాం అసలు. మంత్రాలతో పని జరగదు. ప్రకృతిలో అన్నీ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నై. ఏ ఒక్కటి లేకున్నా, మిగతా ప్రపంచం అంతా గందరగోళం అవుతుంది. ఏ మార్పులు కావాలన్నా మనకు మనమే చేసుకోవాలి, జాగ్రత్తగానూ, ఆలోచించి!" చెప్పాడు ఆసిఫ్.

ఐదో విత్తనాన్ని నాటగానే మొక్కలు, చెట్టు, ఆపైన చెట్టు తొర్రలోంచి వింత మనిషి వచ్చారు- "మీరు చాలా మంచివాళ్ళు..ఏం కావాలో‌ కోరుకోండి!" అన్నాడు వింతమనిషి.

"ప్రపంచాన్నంతా ఇదివరలో ఎలా ఉందో అట్లా మార్చేయండి! ప్రకృతిని ఇంకా పచ్చగా, వాతావరణాన్ని ఇంకా ఆరోగ్యవంతంగా చేయండి, మనుషుల్నీ, జంతువుల్నీ అన్నిట్నీ ఇదివరకు ఉన్నవాటిని తిరిగి తెప్పించేయండి- వాళ్లందరూ మాకు అవసరమే, ప్లీజ్!" అన్నారు పిల్లలు.

మరుక్షణం ప్రపంచం మొత్తం అంతకు ముందు లాగా ఐపోయింది!

ఇప్పుడు పిల్లలకు నలుగురికీ ప్రపంచాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. పచ్చపచ్చని చెట్లు, రకరకాల జంతువులు, వాటి మధ్యలో మనం.. చల్లచల్లని గాలి, మెల్లగా వీస్తూ ఉంటే ఎంత హయిగా ఉంటుందో!