అనగనగా, మిగతాదేశాలన్నిటికీ చాలా దూరంగా ఉన్న ఓ దేశంలో, చాలా చాలా ముసలి నేతగాడు ఒకాయన ఉండేవాడు.

మామూలుగా ఎవరైనా సరే, బట్టలు నేసారంటే వాళ్ళ దగ్గర లెక్కలేనంత ఆరోగ్యం, సంపద, జ్ఞానం- మూడూ పోగుపడతాయని చెప్పుకుంటారు అందరూ.

ఈయన దగ్గర మరి అవి ఎన్ని ఉన్నాయో తెలీదు గాని, ఆయన మాత్రం అసలు ఎవ్వరికీ అంత సులభంగా దొరికేవాడు కాదు.

అంతే కాదు, ఆ ముసలాయన తను నేసిన బట్టని ఎవ్వరికీ అమ్మేవాడు కాదు- తనకు తోచిన వాళ్లకి ఆ బట్టని ఊరికే ఇచ్చేసేవాడు. తనకు నచ్చితే తప్ప, ఎవరికంటే వాళ్లకి అస్సలు ఇచ్చేవాడు కాదు. ఆయన అసలు ఆ బట్టల్ని నేసేందుకు దారం ఎక్కడినుండి తెస్తాడో ఎవ్వరికీ తెలియదు; అట్లాంటి మాయ దారాన్ని ఏ మాయ మగ్గం మీద, ఎట్లా నేస్తాడో కూడా ఎవ్వరికీ‌ తెలీదు.

అసలు ఆయన దగ్గరికి ఆ మాయమగ్గం ఎట్లా వచ్చిందో, అంత చక్కని బట్ట నేసేలా అంత గొప్ప మగ్గాన్ని ఎవ్వరు తయారు చేసారో, మరి అట్లాంటి మగ్గం వేరే ఎవ్వరి దగ్గరా ఎందుకు లేదో కూడా ఎవ్వరికీ తెలీదు!
తను అంతగా నేసిన బట్టని తమకు ఏ కొంచెమైనా ఇస్తాడేమో అన్న ఆశకొద్దీ, ఎన్నో దూర దేశాలనుండి కూడా జనాలు, ఎన్నెన్నో శ్రమలకోర్చి, అతన్ని కనుక్కునేందుకు ప్రయత్నించేవాళ్ళు- వాళ్లంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళే!

ఎందుకంటే, మరి అతని చిరునామా ఏ మ్యాపులో కూడా దొరకదు! విమానాలు అతనుండే చోటుకు చేర్చవు, పడవలు-ఓడలు పోవు, బళ్ళూ మోటార్లూ నడవ్వు. అట్లా అతనికోసం వెతికేవాళ్ళు కూడా, చాలామంది అలసిపోయి, సడలిపోయి మధ్యలోనే తమ ప్రయత్నాలనుండి విరమించుకునేసారు. అయినా బాగా పట్టుదల ఉన్నవాళ్ళు మటుకు కొందరు అప్పుడప్పుడూ అతన్ని చేరుకున్నారు- కానీ ఏం‌ లాభం? ఆ ముసలాయన తను నేసిన బట్టని వాళ్లకు అసలు ఇస్తాడో, ఇవ్వడో- అంతా ఆయన ఇష్టమే!

అయితే ఎవ్వరికీ తెలీని ఆ రహస్యం నాకు ఒక్కదానికే తెలుసు: మాయ మగ్గపు రహస్యం, మంత్రాల బట్టని నేసే ఆ ముసలి నేతగాడి రహస్యం! నేనిప్పుడు మీకు చెప్పబోయేది ఆ కథే:

ఈ భూమి పుట్టిన కొత్తల్లో దీనిమీద అనేక రకాల జీవులు నివసిస్తూ ఉండేవి: చెట్లు, మొక్కలు, జంతువులు, మనుషులు- అన్నీ ఉండేవి, ఇప్పటిలాగానే; అయితే వేరే ఏవో గ్రహాలనుండి- వేరే లోకాలనుండి వచ్చిన వింత ప్రాణులు కూడా కొన్ని ఉండేవి. అవన్నీ కూడా ఇక్కడి మనుషుల రూపాలు ధరించి ఉండేవి. చూసేందుకు అవి అట్లా మనుషుల్లాగా కనబడేవి కానీ, వాటికి చాలా ప్రత్యేకమైన శక్తులు, మహిమలు ఉండేవి. "మనం మనుషులం చెయ్యలేం" అనుకునే చాలా పనుల్ని అవి అలవోకగా చేసేస్తుండేవి.

అయితే ఇట్లా వేరే లోకాలనుండి వచ్చిన ప్రాణులకి, మన భూమి మీద ఉండే మనుషులకు- (నేను మనుషుల్ని ‘మామూలు మనుషులు’ అనట్లేదు, చూసారా? ఎందుకంటే, నా ఉద్దేశం ప్రకారం అసలు ‘మామూలు మనుషులు అంటూ ఎవ్వరూ‌ ఉండరు. ఎవరికి వాళ్లం ప్రత్యేకమైన వాళ్లమే!) అయితే, ఈ వేరే లోకం నుండి వచ్చిన ప్రాణులకు, మనుషులకు ముఖ్యమైన తేడా ఏంటంటే, వాళ్లు అసలు చెడుని ఏమాత్రం చూడలేరు; ఆలోచించలేరు- కనీసం ఊహించను కూడా లేరు! వాళ్లలోపల ఉన్నదంతా పూర్తిగా కేవలం మంచితనమే.

పుట్టుకతోటే వాళ్ళు అట్లా తయారయి ఉన్నారు- మంచితనం అనేది వాళ్ళు కావాలని ఎంచుకొని అలవరచుకున్న సంగతి కాదన్న మాట! అందుకనే వాళ్లకు తమ ఈ మంచితనం ఒక పెద్ద పరిమితి గానూ, అవరోధం గానూ అనిపించేది- "ఎవరో తమ మీదికి ఇట్లా మంచితనాన్ని రుద్దటం ఏమిటి- అది కూడా తమని అడక్కుండా, చెప్పా పెట్టకుండా?!” అనిపించేది!

అందుకని వాళ్లకి మనుషులంటే చాలా గౌరవం ఉండేది: ‘వీళ్ళైతే ఏ పని చేయాలన్నా- చిన్నదైనా సరే, పెద్దదైనా సరే- ఎంచక్కా మంచినో-చెడునో; తమకు కావలసినదాన్ని తాము ఎంచుకోవచ్చు!’ అని ముచ్చటగా కూడా ఉండేది.

ఎవరైనా మనుషులు ఇట్లా మంచి, చెడులని గమనించుకొని, మంచి వైపుకు మొగ్గుతూ నిర్ణయాలు తీసుకుంటుంటే, అలాంటి సమయాల్లో వాళ్ళు ఆ మనుషులకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్ళు. అట్లా మంచికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవాళ్లకు దగ్గరైనప్పుడు, మరి ఎందుకనో, ఈ‌ వేరేలోకం ప్రాణులకు ఒక వింత మెరుపు వచ్చేది. వాళ్ల శరీరాలు వింతగా వెలిగి తమవైన కాంతులు వెదజల్లేవి: సోలార్ బల్బులు వెదజల్లినట్లు.

అయితే ఎప్పుడైనా వాళ్లకు చెడువైపుకు మొగ్గే మనుషులు ఎదురైతే మటుకు, దీనికి వ్యతిరేకంగా జరిగేది- వాళ్ళు నిస్తేజంగా, చీకటిలాగా తేజోవిహీనం అయిపోయేవాళ్లు. చివరికి రెపరెపలాడి క్యాండిళ్ళు మలిగినట్లు, ఆరిపోయేవాళ్ళు.

మనుషులు మంచికంటే చెడుకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం వల్ల, వీళ్లకు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఎక్కువ ఎక్కువ మంది మనుషులు చెడువైపుకు మొగ్గు చూపుతున్నకొద్దీ, మంచిని వదిలేస్తున్నకొద్దీ, ప్రపంచంలో కూడా అంతా చీకటి నిండుకోసాగింది. పుట్టినప్పుడు ప్రపంచంలో ఉన్నంత వెలుగు ఈమధ్య కనబడట్లేదు అసలు!

అట్లాంటి ప్రాణులలో ఒకటి, మిత్యా. ఆమె- (-అతడు అనాలో, ఏమో మరి?! మిత్య ఆడామెనా, మగవాడా? తెలీదు. ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆమె అంటాను)- ఇట్లాంటి అద్భుతమైన జీవుల్లోకెల్లా అద్భుతమైన జీవి. ఆమె వేరే లోకం నుండి అలా మన భూమి మీదికి వచ్చిన మొదటి జీవుల్లో ఒకర్తె- మన భూమి మీద తిరుగాడుతూ, భూమి మీద ఉండే గాలిలో ఎగురుతూ, భూమి ఉపరితలంలో‌ ప్రవహించే నదీనదాల్లోనూ, అవన్నీ‌ చేరుకునే సముద్రాలలోనూ ఈదులాడుతూ, అనేక మానవ జీవన ప్రమాణాల్ని చూస్తూ గడిపింది ఆమె.

ఆమె 'అద్భుతాల్లోకెల్లా అద్భుతం' అని ఊరికే ఇట్లా తిరుగాడినందుకో, లేక ఇట్లా లెక్కలేనన్ని రూపాలను ధరించినందుకో అనలేదు- ఎందుకంటే ఇట్లా వేరే లోకాలనుండి వచ్చిన ప్రాణుల్లో చాలా వాటికి ఇవి రెండూ ఇష్టమే, అవన్నీ కూడా ఇట్లా బాగా తిరుగాడాయి; వివిధ రూపాలను ధరించాయి.
మిత్య అద్భుతమైంది అని ఎందుకన్నానంటే, ఆమెకు తన సహచరులందరికంటే మానవ జాతి పట్ల అమితమైన శ్రద్ధ ఉండింది కాబట్టి. తను గమనించిన అనేక ప్రత్యేక సందర్భాలను ఆధారంగా చేసుకొని ఆమె మానవ జాతి గురించి నిరంతరం ఆలోచించేది, ఆశ్చర్యపోయేది, కంగారు పడేది!

“ఈ మనుషులు ఇంతమంది ఎందుకు, మంచి కంటే అధికంగా చెడునే ఎంపిక చేసుకుంటారు?” అని ఆమె తనని తాను ప్రశ్నించుకుంటూ ఉండేది.

మిత్యకు ఉన్నది అపారమైన శక్తి. తను అనేక యుగాలుగా మానవజాతిని గమనిస్తూ ఉంది. ఇట్లా పదివేల సంవత్సరాల మొత్తాలు పదివేలన్ని- అన్ని సంవత్సరాలుగా మనుషుల గురించి ఆలోచించి, ఆశ్చర్యపోయి, కంగారు పడ్డ తర్వాత మిత్య ఒక నిశ్చయానికి వచ్చింది: ‘తను, తన తోటి వేరేలోకపు జీవులు ఇకపైన అట్లా ఊరికే ప్రక్కన నిలబడి, మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోకూడదు.

వాళ్ళు చెడుని కాకుండా మంచిని ఎంపిక చేసుకునేట్లు తమలాంటి వేరేలోకపు జీవులు ముందుకొచ్చి, చొరవ తీసుకొని సహాయ పడాల్సిందే. దీన్ని ఎట్లా చేయాలబ్బా?!” అని తగిన దారులు వెతకటం మొదలు పెట్టింది.

తను ఏ ఏ దారుల్లో ప్రయత్నించిందో చెప్పటం మొదలుపెట్టానంటే ఇక ఈ కథ ఎంతకీ ముగియదు: మనుషులు ఇష్టపడే మాజిక్ వంటలు చేసింది తను: ‘వాటిని తింటే మనుషులు చెడుకి బదులు మంచిని ఎంచుకుంటారు!’ అని.

ఐతే మనుషులకు ఆ తిండి నచ్చలేదు. అందరూ ఆ తిండిలో ఏదో ఒక తప్పు వెతకటం మొదలెట్టారు: ఒకరేమో "అందులో ఉప్పు చాలా ఎక్కువైంది" అన్నారు. ఒకరొచ్చి "ఉప్పు సరిపోలేదు!” అన్నారు. ఒకరు "చాలా గట్టిగా ఉన్నై" అంటే, వెంటనే మరొకరు "లేదు లేదు- ఇవి మరీ‌ మెత్తగా ఉన్నై" అన్నారు. దాంతో చివరికి మిత్య మ్యాజిక్ వంటల పనిని ఎత్తి పెట్టేసింది.

తర్వాత మిత్య పుస్తకాలు తయారు చేద్దామనుకున్నది: "ఆ పుస్తకాల్లో కథలుంటాయి! మనుషులు చెడుకు బదులు మంచిని ఎందుకు ఎంచుకోవాలో చెబుతాయి ఆ కథలు!” అనుకున్నది. తను ఇంక అట్లాంటి పుస్తకాల్ని ఎన్నంటే అన్ని తయారు చేసి, వాటినన్నిటినీ చక్కని అలమారలలో పెట్టి, ఆ అలమారలన్నిట్నీ కలిపి మంచి లైబ్రరీలుగా తయారు చేసింది.

ఐతే ఆ పుస్తకాల్ని ఎవ్వరూ చదవలేదు! చూస్తూండగానే అవన్నీ‌ దుమ్ము కొట్టుకొని పోయాయి. ఆ లైబ్రరీల్లో సాలీళ్ళు గూళ్ళు కట్టాయి. ఒక ఐదువందల ఏళ్ళు ఇట్లా గడిచేసరికి తను సంపాదించి పెట్టిన ఆ పుస్తకాలన్నీ‌ రాలి, పొడి ఐపోయి, దుమ్ములో‌ కలిసిపోయాయి కూడా.

ఆ తర్వాత మిత్య మాజిక్ నీళ్ళు ట్రై చేసింది, మ్యాజిక్ మబ్బులు, మ్యాజిక్ చెప్పులు- ఇట్లా రకరకాలుగా ప్రయత్నించింది పాపం. అయినా ఏవీ‌ పని చెయ్యలేదు!

చివరికి ఒక రోజున, మిత్యకి ఒక కుర్రవాడు కనబడ్డాడు: బాగా రద్దీగా ఉన్న ఓ వీధిలో నడుచుకుంటూ పోతున్నాడు అతను. అతనిలో‌ మంచితనపు వెలుగు కనబడ్డది మిత్యకి.

అతను నడుస్తున్న తీరు కూడా మిగతావాళ్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. చూస్తే ఇది బాగా నడవటం వచ్చినవాళ్ల నడకలాగానే లేదు! ఎప్పుడూ కూర్చొని ఉండేవాళ్లెవరో ఒక్కసారిగా నడుస్తున్నట్లుంది అతను నడిచే పద్ధతి.

“ఎవరితను?” అనుకుంటూ అతనివైపు నడిచింది మిత్య. అతనికి దగ్గరైనకొద్దీ తన శరీరం కూడా ఇంకా ఇంకా కాంతివంతంగా మెరవ సాగింది!

"నమస్కారం!” అన్నది మిత్య అతని దగ్గరకు వెళ్ళి.

“నమస్తే!” అన్నాడా యువకుడు చిరునవ్వుతో- “చెప్పండి, నేను మీకు ఏం సాయం చెయగలను?” “మీరు ఏం పని చేస్తుంటారు?” అడిగింది మిత్య.

“నేను బట్టలు నేస్తాను" చెప్పాడు జమాల్-

అదీ, అతని పేరు! అట్లా తన కథ తెలిసింది మిత్యకి. అతను రోజంతా మగ్గం మీదే కూర్చొని పని చేస్తాడు- అందుకనే అతని నడక ఆ విధంగా వంకరగా అయ్యింది.

అతను బట్టలు నేసి, దాన్ని అమ్ముకొని, అట్లా వచ్చిన డబ్బులతో ఇంట్లో ఉండే ముసలివాళ్ళని, చిన్న పిల్లల్ని సాకుతాడు. అంతా పోగా మిగిలిందేదో తన ఖర్చులకు వస్తుంది.

“కానీ‌ నాకో కల ఉంది" చెప్పాడు జమాల్- "నేను నేసిన బట్టని జనాలకి ఊరికే ఇచ్చెయ్యాలి- అస్సలు అమ్మకూడదు అని.”

“ఎందుకు?”

"ఎందుకంటే అట్లా ఊరికే ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బట్టని డబ్బులకి అమ్మినప్పుడల్లా ఎందుకనో నాకు చాలా విచారం వేస్తుంది"

అతను చెప్పిన ఈ మాటలు వింటున్నకొద్దీ మిత్య ఇంకా ఇంకా ధగధగా మెరిసిపోయింది.

ఇంక నేను మీకేమీ చెప్పనవసరం లేదు: మిత్య జమాల్ కోసం మాయ మగ్గం ఎలా చేసిందో, ఎప్పుడూ తనకి అందుబాటులో ఉండేలా మాయ దారాన్ని ఎలా తయారు చేసిపెట్టిందో!

దాంతో ఇక అతను ఎప్పటికీ‌ తను నేసిన బట్టను ఇక ఎవ్వరికీ అమ్మవలసిన పనే లేదు! తనకి ఎవరు నచ్చితే వాళ్లకి- తనని, తన బట్టని ఎవరు చాలా ఇష్టపడితే వాళ్లకి- ఇచ్చేయచ్చు!

వాళ్ళు అతనికీ అతని కుటుంబపు అవసరాలన్నిటికీ కావలసిన వస్తువుల్ని- ఆహార పదార్ధాలు, ఇంకేవైనా సరే- అన్నిటినీ‌- ఇస్తూంటారు! ఆ విధంగా మిగిలినవాళ్లకూ మంచి ఎంపిక చేసుకోవటం అలవడుతుంది! అట్లాంటివాళ్లు ఎక్కువైన కొద్దీ, మిత్యకి మరింత సంతోషం!

మిత్య ఒక్కటే షరతు పెట్టింది- ఈ మాయమగ్గం తన దగ్గరికి ఎట్లా వచ్చిందో మటుకు జమాల్ ఎవ్వరికీ చెప్పకూడదు.

అందుకనే కదా, నేను చెప్పేవరకూ మీక్కూడా ఎవ్వరికీ ఈ కథ తెలీనిది?!