అనగనగా ఒక నది ఒడ్డున పెద్ద మర్రిచెట్టు ఒకటి ఉండేదట. లెక్కలేనన్ని కొమ్మలతో ఘనంగా విస్తరించి ఉండేదట ఆ చెట్టు. అయితే దానికి గర్వం ఎక్కువ. "నేను చూడు, ఎంత పెద్దదాన్నో! వయసులోనూ‌ పెద్దనే; విస్తృతిలోనూ‌ పెద్దనే! నేనే అందరికంటే గొప్పదాన్ని" అనుకుంటూ ఉండేది.

రోజూ నది ఒడ్డున పెరిగే చిన్న చిన్న మొక్కలకు అది వినయం గురించి చెప్పేది. "మీరు నాకు రోజూ తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే, వయసులో మీరు నాకంటే ఎలాగూ‌ చిన్నవాళ్ళే; అంతేకాక శక్తిలోనూ నాకంటే బలహీనులే! ఎవరి శక్తి యుక్తులను వాళ్ళు గ్రహించి, బలవంతులతో మర్యాదగా మసలుకోవాలి" అనేది.

చిన్న మొక్కలు నవ్వి "వయసులో చిన్న అంటే ఒప్పుకుంటాం గాని, వేరే రకంగా మేము నీకంటే ఏమీ తక్కువ కాదు. ఎవరి గొప్పదనం వారికి ఉంటుంది. అయినా అడిగి చేయించుకొనే నమస్కారమూ ఒక నమస్కారమా? మేము నీకు తలొంచేది లేదు" అని వాదించేవి.

మర్రి చెట్టుకి కోపం వచ్చేసేది. గబగబా తన కొమ్మల్ని ఊపి ఓ మోస్తరు గాలిని తెప్పించేది. ఆ మాత్రం గాలికే చిన్న మొక్కలు అన్నీ వణికిపోయి తలలు వంచేవి. అది చూసి మర్రి చెట్టు పెద్దగా నవ్వి, "నేను పుట్టించే ఇంత చిన్న గాలికే నిలబడలేకపోయారు మీరు. ఇప్పుడు ఏం చేసారో- తలవంచలేదు కాబోలు!" అని ఈసడించేది.

గడ్డి మొక్కలు కూడా తగ్గక, "అయ్యో! మేము తలలు వంచింది నీకు కాదు- గాలికి! గాలి పట్ల గల భక్తితో తలలు వంచాం, నువ్వు కూడా గాలి దేవుడికి నమస్కరించు! నీ కొమ్మలు వంచి పలకరించు. ఆయన ఆగ్రహానికి గురి అయ్యావంటే తట్టుకోలేవు" అనేవి.

"నేను పుట్టించే గాలిని గురించి నాకు చెబుతారా, మీరు! ఊరుకోండి! చిన్న ప్రాణులు చిన్నగా ఉండండి చాలు!" అని ఎగతాళి చేసేది మర్రిచెట్టు.

అంతలోనే ఒకసారి పెద్ద తుఫాను మొదలైంది. ఎన్నడూ‌ కనీ వినీ‌ ఎరుగతనంత వేగంగా గాలులు వీచాయి. చిన్న చిన్న మొక్కలన్నీ‌ అల్లాడిపోయాయి. "వంగండి! మరింత వంగండి!" అని ఒకదానితో‌ ఒకటి చెప్పుకున్నాయి.

ఎగతాళిగా నవ్విన మర్రిచెట్టు తన కొమ్మల్ని అన్నిటినీ బిగబట్టుకొని గాలికి ఎదురొడ్డి నిలబడింది. అది ఎంత గట్టిగా నిలబడిందో, గాలి అంత బలంగా నెట్టింది దాన్ని. చూస్తూ చూస్తూండగానే అది కూకటి వ్రేళ్లతో‌ సహా పెకలి పోటెత్తిన నదిలో పడి, అలానే కొట్టుకుపోయింది.

ఒదిగిన మొక్కలు తుపాను తర్వాత తిరిగి నిలబడ్డాయి. పొగరెత్తిన మర్రిచెట్టు మటుకు పూర్తిగా కనుమరుగైంది.