ఒక ఊళ్ళో ఒక చాకలాయన ఉండేవాడు. ఆయన పేరు సాంబయ్య. సాంబయ్యకు పనిలో‌ సాయంగా ఒక గాడిద ఉండేది.

రోజూ ఊళ్ళో వాళ్ల బట్టలను అన్నింటినీ సేకరించుకొని, వంక దగ్గరికి వెళ్ళి, ఆ బట్టలు ఉతుక్కొచ్చేవాడు సాంబయ్య. ఆ బట్టల బరువును మోయటం ఈ గాడిద పని.

అట్లా ఒకరోజున బట్టలు ఉతికి, వెనక్కి తిరిగి చూసిన సాంబయ్యకు తన గాడిద కనిపించలేదు. "ఇక్కడే కట్టేసానే?! ఎటుపోయింది?" అని అడవంతా వెతికాడతను. ఎక్కడా గాడిద జాడ లేదు.

"ఎవరో‌ ఎత్తుకుపోయి ఉండాలి. లేకపోతే తనంతట తాను ఎక్కడికీ పోదు, పాపం నా గాడిద!" అని అతనికి చాలా బాధ వేసింది.

ఊళ్ళో కనిపించిన వాళ్లనల్లా అడిగాడు- "నా గాడిద కనపడట్లేదు ఎవరైనా చూసారా?" అని.

"మేం‌ చూడలేదు- మేం‌ చూడలేదు" అన్నారు అందరూ.

మరునాటికల్లా సాంబయ్యకు కోపం వచ్చేసింది. "గాడిద లేకపోతే బట్టల మూటలు ఎవరు మోస్తారు?" అని.

అప్పుడు ఇక తన భాష మార్చాడు: కనబడిన వాళ్లతోనల్లా "ఇదిగో! మీరెవరైనా నా గాడిదను చూసి ఉంటే మర్యాదగా ఇప్పుడే ఇచ్చెయ్యండి, చెబుతున్నాను. లేకపోతే మా తాత ఏం చేసాడో అదే నేనూ చేస్తాను! తర్వాత మీ యిష్టం మరి!" అనటం మొదలు పెట్టాడు.

ఊళ్ళోవాళ్ళు చాలా మంది "నిజంగా నేను తీసుకోలేదు సాంబయ్యా! నన్ను నమ్ము!" అని చెప్పాల్సి వచ్చింది సాంబయ్యకు.

అయితే నిజంగా గాడిదను దొంగిలించింది ఆ ఊరివాడే, ఒకడు.

"వాళ్ళ తాత చేసినట్లే చేస్తాడట తనుకూడా!' అని ఆ దొంగకు చాలా భయం వేసింది. మరో‌ రెండు రోజులు గడిచే సరికి అతను ఇక తట్టుకోలేకపోయాడు. "ఏం చేస్తాడో, మరి! ఊరికే ఎందుకు తంటాలు?!" అని అతను భయ పడుతూనే సాంబయ్య దగ్గరకు వచ్చి, "నీ గాడిదను నేనే దొంగిలించాను- నన్ను క్షమించు సాంబయ్యా! ఇదిగో నీ గాడిద!" అని గాడిదను తిరిగి అప్పగించేసాడు !

తన గాడిద తనకు చిక్కినందుకు సంబరపడిన సాంబయ్య అతన్ని ఇంక ఏమీ అనలేదు.

దొంగ వెను తిరిగి పోబోతూ సాంబయ్యతో "సాంబయ్యా! నేను వెనక్కి తెచ్చి ఇచ్చా కాబట్టి సరిపోయిందనుకో! కానీ ఒక వేళ నేను నీకు గాడిదను తెచ్చి ఇవ్వకుంటే ఏం చేసేవాడివి?" అని అడిగాడు.

"ఏం చేసే వాడిని? ఇంకో కొత్త గాడిదను కొనుక్కునే వాడిని!" అన్నాడు సాంబయ్య "అప్పట్లో మా తాత అదే పని చేసాడు పాపం!"

అది విన్న దొంగకు నిజంగా తిక్క తిరిగింది!