కొండమింది పల్లెకు దగ్గరలో కేసరివనారణ్యం అని ఒక అడవి ఉండేది. ఆ అడవిలో లెక్క లేనన్ని జంతువులు నివసించేవి. శూరసింగ్ సింహం ఆ అడవికి రాజు. ఆయనకు కుడిభుజం, చాణక్య మంత్రి అనే నక్క. తన నమ్మకాన్ని, మిత్రుడి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని, అడవిలో అందరి మంచి చెడ్డలనూ చూసుకునేది సింహం.

మాసంలో రెండు రోజులు చాణక్య మంత్రి మారువేషంలో‌ పోయి అడవి అంతా తిరిగి వచ్చేది. అడవిలో సంగతులన్నీ రాజుగారికి విశేషాలు చేరవేసేది.

ఒకసారి చాణక్యమంత్రి ఆ పనిమీద పోయిన సమయంలో, శూరసింగ్‌కి ఏదో అనారో-గ్యమైంది. అది తన గుహను వదిలి ఆ రెండు రోజులూ బయటికి రాలేదు.

దాంతో జంతులోకంలో కొంత గందరగోళమైంది. అంతలో చాణక్యమంత్రి తిరిగి వచ్చి, హుటాహుటిన రాజుగారిని చూడబోయింది.

మూసిన కళ్ళు తెరవకుండా జ్వరంతో పడుకుని ఉన్నాడు శూరసింగ్. చాణక్య మంత్రి రాజుకు ధైర్యం చెప్పి "మన ఆస్థాన వైద్యుడు ఎలుగుబంటి సంజీవయ్యను తీసుకువస్తాను" అని బయలుదేరింది.

వైద్యుడు సంజీవయ్య రాజుగారిని పరీక్షించి, "ఏమీ పర్వాలేదు. మామూలు జ్వరమే. తగ్గిపోతుంది" అంటూ గుహ బయటికి పోయి కొన్ని రకాల ఆకులు తెచ్చి నూరింది. వాటి రసాన్ని తాను తెచ్చిన చిన్న ముంతలో పోసి ఇచ్చి "దీన్ని బాదాం ఆకులో పోసి మూడు పూటలా నాకించండి. జ్వరం తగ్గిపోతుంది. భయపడాల్సిన పనిలేదు. ఒక్క ఐదు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఇక నేను వెళ్ళివస్తాను" అన్నది. చాణక్య మంత్రి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపి, గౌరవించి పంపించింది.

ఎన్నాళ్ళ నుండో అడవికి రాజు కావాలన్న ఆశతో ఉన్న తంత్రీపాలుడు అనే‌ పులికి తెలిసింది ఈ సంగతి. "శూరసింగ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను వాడిని ఏమీ చేయలేను. అయితే ఇప్పుడు మంచి సమయం. ఈ అవకాశాన్ని ఉపయోగిం-చుకోవాలి" అనుకున్నదది.

రాజ్యాన్ని చక్కబెడుతూ బిజీగా ఉన్న మంత్రి చాణక్యుడిని కలిసి, ముందు కొద్ది సేపు ఆమాటా, ఈమాటా కలిపింది. రాజుగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి బాధ పడుతున్నట్లు నటించింది. అటుపైన గొంతు తగ్గించి ఇప్పుడు కొంచెం మెల్లగా గర్జిస్తూ, "మహామంత్రి గారూ! మీరు ఏమీ అనుకోనంటే, మరి- నేను నా మనసులో మాట బయట పెడతాను... చూడండి, నేను కూడా మీ‌ రాజులాగానే వేటాడగలను; నాకు కూడా పంజా విసరటం వచ్చు; నాకు కూడా కోర దంతాలు ఉన్నాయి..ఏమంటే మీ రాజుగారికి గడ్డం ఉంది, నాకు లేదు- అంతే కదా తేడా?! మిగతావన్నీ‌ అచ్చం మీ రాజులాగానే‌.... ఆ!... ఏమంటారు?" అని వికవికా నవ్వింది.

మంత్రి చాణక్య ఒక్క క్షణం ఖంగుతిన్నది అంతే. ఆ వెంటనే దాని కళ్ళలో ఏదో మెరుపు వచ్చింది. అది చటుక్కున తంత్రీపాలుణ్ణి పక్కకు లాగుతూ, తనూ గొంతు తగ్గించింది- "మెల్లగా మాట్లాడు. గోడలకు చెవులుంటాయి. మన మాటలు ఎవరైనా‌ వింటారు. నేను చెప్పినట్లు చెయ్యి. నేను రాత్రంతా ఆలోచించి, మనం ఏం చేస్తే ఎవరికీ‌ తెలియకుండా పని జరిగిపోతుందో చెప్తాను నీకు. రేపు సాయంత్రం ఊరి పొలిమేర దగ్గర కలుద్దాం. నేను మాత్రం శక్తిలేని ఈ‌ ముసలి రాజుతో ఎన్నాళ్ళని వేగుతాను?" అన్నది గుసగుసగా.

"ఊరి పొలిమేర వరకూ పోవటం ఎందుకు?! ఇక్కడే మాట్లాడుకుంటే‌ పోలా?!" అన్నది తంత్రీపాలుడు మూర్ఖంగా. దానికి గుసగుసగా మాట్లాడటం రాదు. అన్నిటికీ గర్జనే!

నక్క దానికి అడ్డు చెప్తూ "అందుకే! నువ్వు ఇన్నాళ్ళూ రాజువి ఎందుకు కాలేదో నీ మాటలు వింటే అర్థం అయిపోతోంది. ఇలాంటి విషయాల్ని ఊరి పొలిమేర దగ్గరే మాట్లాడుకోవాలి.. తెలుసుకో! పద..పద! వర్షం కూడా వచ్చేటట్లు ఉంది!"‌ అంటూ పులిని పంపించేసింది.

మరునాడు పొలిమేరలో కలిసారు ఇద్దరూ. "ఏమి ఆలోచించావ్.." అడిగాడు తంత్రీపాలుడు.

చాణక్య నక్క చిన్నగా నవ్వింది- "ఏముంది, అన్ని విధాలుగానూ ఆలోచించా. ఇదే మంచి తరుణం. రాజు ప్రస్తుతం జబ్బుతో ఉన్నాడు. కనుక..., సంజీవయ్య ఇచ్చిన ఆకు పసరును మార్చి, మనం వేరొకటి ఏదో ఇస్తాం.. అటు రాజు హతం.. ఇటు మీకు రాజపదవి!" అన్నది.

"శభాష్..! భలే ఆలోచన" అని మురిసింది పులి.

ఇంతలో దూరంగా మేకల గుంపుల్ని తోలుకుపోతున్న కాపరులు కనపడ్డారు వాళ్ళకు. చాణక్య మంత్రి కాపరులకేసి చూపిస్తూ, "నేను వీళ్లను ఎదుర్కొనలేను గానీ, వీళ్లంతా ఇష్టంగా తినే మేక మాంసం అంటే మటుకు చాలా ఆశ నాకు! దాన్ని తినాలని నా చిన్నప్పటి నుండీ‌ ఎదురు చూఫులే!" అన్నది.

"నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నందుకు నేను ఈమాత్రం చేయలేనా.. ఇప్పుడే వెళ్ళి వాటిని వేటాడి మాంసం తెస్తాను" అన్నది పులి.

నక్క దానికేసి చూసి తిరస్కారంగా నవ్వింది. "అన్నింటా నీకు ఆవేశం‌ఎక్కువ, ఆలోచన తక్కువ లాగా ఉందే! అందుకే మరి, నువ్వు ఇన్నేళ్ళూ రాజువి కాలేకపోయావు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి! అక్కడ కనబడుతున్న రాళ్ళ వరకూ వెళ్ళి, చుట్టూ చూసి రా! ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను!" అన్నది.

"అబ్బ! నాకు మండుతున్నది!" అనుకొని, "అయినా వీడి మాటలు వినక తప్పదు- ఏం చేస్తాం" అని గుట్టమీదికంతా పోయి నక్క చెప్పినట్టుగా చుట్టూ చూసి వచ్చింది పులి. అది తిరిగి రాగానే "ఏం చూశావ్?!" అన్నది నక్క

"ఏముందీ‌, బురద తొక్కుకుంటూ పోయా! పోయి ఊరికే పొలాలు, చెట్లు, గుట్టలు చూసొచ్చా..!" అన్నాడు తంత్రీపాలుడు చికాకుగా.

అప్పుడు చాణక్య నక్క "అందుకే! మరి నువ్వు ఇన్నాళ్ళుగా రాజువి కాలేకపోయింది! అక్కడ అంతమంది కాపరులు మేకల్ని తోలుకుని ఇళ్ళకు పోవడం నీకు కనిపించనే లేదా?! ఇప్పుడు వేటాడడానికి వెళ్తావా? వెళ్తే వాళ్లంతా కలిసి మనల్ని పట్టుకుని చంపెయ్యరా? ఆమాత్రం‌ ఆలోచన లేదేమి?" అని కసిరింది.

"ఒక పని చెయ్యండి! తమరు రేపు మధ్యాహ్నం వేళకు రండి, ఇక్కడికి. ఆ సమయానికి కాపరులు అలిసిపోయి, అన్నం తిని, కునికిపాట్లు పడుతూంటారు. ఆ సమయంలోనైతే తమరు నిశ్చింతగా వేటాడవచ్చు; ఇటు నా కోరికా తీర్చవచ్చు. ఏమంటారు? .. కాబోయే రాజుగారూ...!" అనగానే తంత్రిపాలుడు పొంగిపోయి, "సరే సరే" అని పాటలు పాడుకుంటూ అడవిలోకి దూరాడు.

మర్నాడు తెల్లవారుజామున ఎప్పటిలాగానే పొలం పనులకు బయలుదేరారు రైతులు, మేకల కాపరులు. దారిలో అక్కడంతా బురదలో పులి అడుగులు కనిపించినై వాళ్లకి.

వాళ్ళు వాటిని గుర్తించి "ఒరేయ్! రాత్రి మన పల్లెలోకి పులి వచ్చినట్లుందిరోయ్! ఇప్పుడే‌ పోయి గ్రామాధికారికి చెప్పాలి! లేకపోతే ఇంక మనం‌ లేం!" అని వెనక్కి పరుగు పెట్టారు.

ఆ వెంటనే గ్రామాధికారి అక్కడికి వచ్చి చూసి, "నిజమే! ఇది మళ్ళీ వస్తుంది!" అని మాంసం ఉంచిన బోనును ఒకదాన్ని ఊరి పొలిమేరల్లో ఏర్పాటు చేయించాడు.

అనుకున్నట్లుగానే ఆ రోజు మధ్యాహ్నానికి నక్క, పులి వచ్చాయి అక్కడికి. బుర్ర తక్కువ తంత్రీపాలుడి ముక్కు పుటాలకు మాంసం వాసన తగిలేసరికి, ఇక అది ఉండబట్టలేక పోయింది. నక్క ఎంత వారిస్తున్నా వినకుండా అది పరుగు పరుగున పోయింది, బోనులోని మాంసం తినేందుకు.

అంతలోనే బోను తలుపు మూసుకున్నది; అది ఆ బోనులో‌ ఇరుక్కుపోయింది. గర్జిస్తూ, గింజుకుంటూ అది చాణక్య నక్క ఉండిన దిక్కుకు చూసింది.

కానీ నక్క ఇప్పుడు అక్కడ ఉంటేగా?

"మా మహారాజుకు మంత్రిని! కుడి భుజాన్ని! నమ్మిన బంటుని! నాతో పెట్టుకుంటావా?!" అని నవ్వుకుంటూ‌ అడవి వైపుకు సాగిపోతున్న ఆ నక్క వీపు మటుకు కనపడింది దానికి! అధికారులు తంత్రీపాలుడిని పట్నంలోని జంతు ప్రదర్శనశాలకు పంపించివేశారు.

అడవి అంతా హాయిగా తిరుక్కుంటూ, అనుకున్నది తింటూ, స్వేచ్ఛగా బ్రతికిన పులి, ఇప్పుడు తన అత్యాశ పుణ్యాన మనుషులకు చిక్కి, వాళ్ళు పెట్టింది తింటూ, వచ్చే పోయే మనుషులను ఆశగా చూస్తూ కాలం గడిపింది!
ఎంత దుర్దశ!!