కృష్ణ, రాము ఇద్దరూ స్నేహితులు. ఒక సెలవు రోజున వాళ్ళిద్దరూ అట్లా అట్లా ఆడుకుంటూ ఊరు దాటి పోయారు. బాగా అలసిపోయి, నీళ్ళకోసం, నీడకోసం వెతుక్కున్నారు.

అట్లాంటి సమయంలో ఆ దగ్గర్లోనే ఓ‌ పెద్ద మర్రి చెట్టు కనిపించింది వాళ్లకు. ఆ చెట్టుకి దగ్గర్లోనే ఒక చేదబావి కూడా కనబడింది. చేదబావిలోంచి నీళ్ళు తోడుకొని త్రాగి, వాళ్ళిద్దరూ మెల్లగా చెట్టు నీడన చేరారు. పెద్ద పెద్ద ఊడల్ని క్రిందికి జార్చి గట్టిగా నిలబడి ఉన్నదది. ఆ చల్లదనానికి, అక్కడి వాతావరణానికి ఇద్దరి మనసులూ‌ ప్రశాంతంగా అయిపోయినై. ఎవరికి వాళ్ళుగా ఇద్దరూ ఓ చిన్న కునుకు కూడా తీసారు. అంతలోనే వాళ్ళకి దగ్గర్లోనే, పొదల మరుగున, పాత బంగళా ఒకటి కనపడింది:

"ఒరేయ్! అదిగో చూడు!‌ అక్కడ! బలే ఉంది!" అన్నాడు కృష్ణ.

కృష్ణ అటువైపు చూసి ఆశ్చర్యపోయాడు- "దీన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడనే లేదే?"అని.

ఇద్దరూ అటుగా నడిచారు.

బంగళాకి పోయే దారి బాగా పాడైంది. చెట్లు, తుప్పలు, ముళ్ళపొదలు అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నాయి. సాలీళ్ళు పెట్టిన గూళ్ళున్నాయి ఎక్కడికక్కడ. వాటిని అన్నిటినీ తప్పించుకుంటూ ముందుకు సాగారు మిత్రులిద్దరూ. మెల్లగా బంగళాకు చేరుకున్నారు.

"హెల్లో! ఎవరైనా ఉన్నారా, ఇక్కడ?" అరిచాడు రాము.

"హెల్లో! ఎవరైనా ఉన్నారా, ఇక్కడ?" అన్నది ఖాలీ బంగళా.

"ఎవ్వరూ‌ లేరులే! గేటుమీది దుమ్ము-దుశానం, సాలీడు గూళ్ళే దానికి గుర్తు" నవ్వాడు కృష్ణ.

"..దానికి గుర్తు" అని నవ్వింది బంగళా.

"కానీ ఇక్కడికొచ్చే దారిలో‌ అన్నీ పాము వదిలిన పొలుసులే ఉన్నై!" అన్నాడు రాము భయంగా.

"..పొలుసులే ఉన్నై" అంది బంగళా.

అప్పుడు గానీ‌ గమనించలేదు కృష్ణ. నిజమే.. అక్కడ అంతా చెదురుమదురుగా పాము కుబుసాలు పడి ఉన్నై.

"పాములేవో‌ ఉన్నట్లున్నై. జాగ్రత్త!" అంటూ ముందుకు నడిచాడతను.

మెల్లగా ఇద్దరూ బంగళాలోపలికి పోయి చూసారు- ఎవరైనా ఉన్నారేమో అని. ఎక్కడా ఎవ్వరూ కానరాలేదు.

"సరేలే, పోదాం, ఇంక తిరిగింది చాలు" అనుకున్నారు మిత్రులిద్దరూ. అలా అనుకున్నారో లేదో, వాళ్ళున్న గది తలుపులు మూసుకున్నాయి.

ఇద్దరూ కంగారుగా తలుపులు బాదారు. గది అంతా తిరిగారు. ఎక్కడా బయటికి వెళ్ళే మార్గం లేదు! అంతలోనే అక్కడ వాళ్ళకో పాము కనబడింది! అది కదలకుండా వాళ్లనే చూస్తున్నది! వాళ్ళు ఎంత బెదిరించినా అది మటుకు కదల్లేదు.

చివరికి "నువ్వేనా తలుపులు వేసింది?" అడిగాడు రాము, ఆ పాముని.

పాము తల ఊపింది.

"ఎందుకు?"

పాము చటుక్కున ఒక తలుపు క్రిందినుండి దూరి అవతలికి వెళ్ళింది.

మిత్రులిద్దరూ‌ పోయి చూస్తే ఆ తలుపు తీసే ఉంది!

ఇద్దరూ తలుపు తీసుకొని లోనికి అడుగు పెట్టారు. అది వంటగది లాగా ఉంది. ఎటుచూసినా బూజు. కొంచెం అవతలగా నిలబడి ఉంది పాము. వీళ్లనే చూస్తూ.

"ఏం చేయమంటావు?"

పాము అటు ప్రక్కగా ఉన్న ఓ బిందెకేసి చూపించింది.

చూస్తే ఆ బిందెలో నీళ్ళున్నై. "ఏం చేయమంటోంది?" అడిగాడు కృష్ణ ఆదుర్దాగా.

"మీద పొయ్యమంటావా?" అడిగాడు రాము, పాముని.

తల ఆడించింది పాము.

వెంటనే కృష్ణ, రాము ఇద్దరూ ఆ నీళ్ళని పాము మీద పోసారు.

వెంటనే పాము కాస్తా ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది!

కృష్ణకి ఆ అమ్మాయి చాలా నచ్చింది. "బలే ఉంది. కానీ‌ భయం కూడా వేస్తోంది" అన్నాడు.

"ఏమైంది?! ఏమైంది?” ఎవరో అమ్మాయి.

"పాము!! నువ్వు పామువు కదా!" అన్నాడు కృష్ణ.

మరుక్షణం వాళ్ల ముఖాలమీద బిందెడు నీళ్ళు కుమ్మరించ బడ్డాయి. మిత్రులిద్దరూ కళ్ళు తెరిచి చూసి, చాలా సిగ్గుపడ్డారు.

వాళ్ళిద్దరూ‌ ఇంకా మర్రిచెట్టు క్రిందనే ఉన్నారు. ఎదురుగుండా ఒకమ్మాయి నిలబడి ఉంది, చేతిలో‌ ఖాళీ బిందెతో. "మీరు ఎంతకీ లేవకపోతే మీకు ఏమైనా అయ్యిందేమో అనుకున్నాను. ఇళ్ళు, పనులు వదిలి ఇంత దూరం వస్తారా, పిల్లలు ఎవరైనా? సాయంత్రం అయిపోయింది- ముందు ఇంటికి నడవండి!" అంటోంది.