ఒక రోజు మన చేతికున్న ఐదు వేళ్ళూ ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ, ఎవరు ముఖ్యం, అని మాట్లాడుకోసాగాయి.
మొదటగా చూపుడువేలు తన గొప్పతనం గురించి చెప్పింది: "నేనే అందరికంటే గొప్పవాడిని! ఎందుకంటే ఏ మనిషినైనా, వస్తువునైనా గుర్తించి చూపించేందుకు నన్నే వాడతారు" అని.
"కాదు కాదు అందరికంటే నేనే గొప్ప!" అంది మధ్య వేలు "ఎందుకంటే మీ అందరికంటే నేనే పొడుగ్గా, దృడంగా ఉన్నాను!"
"కాదు కాదు- మీ అందరికంటే నేనే గొప్పదాన్ని" అంది ఉంగరపు వేలు. "ఎందుకంటే అందరూ బంగారు కిరీటం పెట్టినట్టు నాకే ఉంగరం పెడతారు!"
"లేదు. అందరికంటే నేనే గొప్ప!" అంది చిటికెన వేలు కల్పించుకొని. "ఎందుకంటే నేను రెండు మనసులను కలుపుతాను!"
"కాదులే! అందరికంటే నేనే గొప్ప!" అంది బొటన వేలు. "ఎందుకంటే ఎవరినైనా చాలెంజ్ చేయ్యడానికి నన్నే వాడుతారు. అంతే కాదు- నేను గనక లేకపోతే మీ వల్ల ఏ ఉపయోగమూ ఉండదు! ఏ పని చేయాలన్నా నేను ఉండాల్సిందే! అందుకని నేనే గొప్ప, అందరి కంటే!"
దాంతో గందరగోళం చెలరేగింది. ఐదు వేళ్ళూ 'నేను గొప్ప' అంటే ; 'నేనే గొప్ప' అంటూ ఒక్కసారిగా వాదులాడుకోవటం మొదలెట్టాయి.
అప్పుడు చెయ్యి కల్పించుకొని, వాటన్నిటికి ఒక మాట చెప్పింది: "ఒక్క నిమిషం!! జాగ్రత్తగా చూడండి- మీలో ఏ ఒక్కరివల్లా అన్ని పనులూ సమకూరవు. పనులు జరగాలంటే మీరందరూ కావలసిందే. అంతేకాదు- మీరంతా ఐకమత్యంగా ఉంటేనే ఉపయోగం! ఏ ఒక్కరు లేకున్నా కష్టమే! అందువల్ల మీలో ఎవరూ ఇంకొకరికంటే గొప్ప కాదు.ఏ ఒక్కరూ ఇంకోరి కంటే తక్కువా కాదు!" అని.
చెయ్యి చెప్పిన మాటలో వాస్తవాన్ని గుర్తించినై, వేళ్లన్నీ. "మనం అందరం గొప్పవాళ్లమే! ఐకమత్యమే మహాబలం!" అన్నాయి ఒక్క పిడికిలిగా దగ్గరై.