పదవ సిఖ్ గురు - గురుగోవింద సింగ్ కూర్చొని ఉన్నారు - నది ఒడ్డునే ఉన్న ఒక పెద్ద బండరాతి మీద. పంజాబ్ రాష్ట్రంలో మారుమూలన అడవిలోంచి వేగంగా ప్రవహిస్తున్న చిన్న నది అది. ఆయన వెనుకగా శివాలిక్ పర్వత శ్రేణి - వాటి వెనకగా ఉన్న ఉన్నత హిమాలయాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ అరచెయ్యి సూర్యకాంతిని ఎంతని అడ్డుకోగలదు? శివాలిక్ పర్వతాలకు పైనుంచి మంచుతో కప్పబడ్డ హిమాలయ శిఖరాలు మెరుస్తూ కానవస్తున్నై.

గురూజీ గురు గ్రంథసాహిబ్ ని పఠిస్తున్నారు మౌనంగా. ఈ సమయంలో ఆయనను ఎవరూ పలకరించరు. ప్రతిరోజూ కొంత సమయాన్ని ఆయన గ్రంథ పఠనానికీ, ఆత్మ విమర్శకూ కేటాయిస్తారు. ఆ తర్వాత ఆయన తోటి శిష్య సమూహం మంచి చెడ్డల్ని పరిశీలిస్తారు కొంతసేపు.

ఆ సమయంలో సందర్శకుడొకడు వచ్చి, నమస్కరించి, గురువుగారి దగ్గరే కూర్చున్నాడు. గురువుగారు తలెత్తి చూసి, గుర్తుపట్టారు. ఆ వచ్చినది రఘునాథ్. పక్క గ్రామంలో ఉన్న సంపన్న గృహస్థు; సిఖ్ సమూహానికి మద్దతుదారు. గురూజీని దర్శించుకొని, వారు మొగలులపై ప్రకటించిన యుద్ధానికి మద్దతుగా తన వంతు ధన సహాయం చేసేందుకు వచ్చాడక్కడికి.

అందరూ మౌనంగా కూర్చున్నారు - అక్కడ మాట అవసరమే లేకుండింది...

కొంత సేపటికి, రఘునాథ్ తన జేబులో చేయిపెట్టి ఒక చిన్న ప్యాకెట్ ను బయటికి తీశాడు. బట్టపీలికలు చుట్టి ఉన్నాయిదానికి. దాన్ని జాగ్రత్తగా విప్పాడు. లోపల, ధగధగా మెరుస్తున్న రెండు బంగారు మురుగులు! చాలా విలువైన ఆ కంకణాలకు వజ్రాలు తాపడం చేసి ఉన్నై. వాటి రెండింటి విలువా కొన్ని లక్షల బంగారు మొహరీలు ఉంటుంది.

రఘునాథ్ అన్నాడు - "గురూజీ! ఈ పేద సేవకుడు తమకు సమర్పిస్తున్న ఈ చిన్న కానుకల్ని స్వీకరించండి. మీరు చేపట్టిన అత్యుత్తమ కార్యం కొనగోటికి కూడా సరితూగవు ఈ కానుకలు. అయినా వీటిని స్వీకరించి నన్ను ధన్యుణ్ని చేయండి" అని.

అతని మాటల్లో వినయం ఉట్టిపడింది. కానీ హృదయం నిండా గర్వమూ, అవకాశవాదమూ రాజ్యమేలుతున్నాయి. గురూజీ కళ్లు రఘునాథ్ హృదయాన్ని తడిమాయి. సునిశితమైన ఆయన చూపు నుండి ఏ ఆలోచనా తప్పించుకొనజాలదు.

రఘునాథ్ ఆలోగా ఒక మురుగును తీసి, గురువుగారికి అందించాడు వినమ్రంగా. గురువుగారు దాని అందాన్నీ, కళాత్మకతనూ ప్రశంసించాలని అతని కోరిక. ఏదో సాధారణ వస్తువును అందుకున్నట్లే గురుగోవింద సింగ్ దాన్ని అందుకున్నారు. రెండు వేళ్లను ఆ కంకణంలోకి దూర్చి, ఆ వేళ్ల చుట్టూ దాన్ని తిప్పటం మొదలెట్టారు. చూస్తూండగానే ఆ కంకణం జారి, రాయిమీద పడి, దొర్లి, క్రిందనున్న ప్రవాహంలో పడి, మరుక్షణంలో కనుమరుగైంది.

రఘునాథ్ ముఖం పాలిపోయింది. అతను తక్షణమే లేచి, బాణంలాగా దూసుకుపోయి, నదిలోకి దూకి మురుగుకోసం వెతకటం మొదలుపెట్టాడు. గురూజీ మౌనంగా గురుగ్రంథ సాహిబ్ పఠనంలో మునిగారు మళ్లీ.

ఒక గంట తర్వాత రఘునాథ్ ఒట్టి చేతులతో వెనక్కి తిరిగివచ్చాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు; తలనుండి పాదాలవరకు తడిసిముద్దై ఉన్నాడు. వచ్చి, గురూజీకి దగ్గర్లో చేరగిలపడి "నదిలో అంతా వెతికాను కానీ ఆ బంగారు మురుగు మాత్రం దొరకలేదు గురూజీ! ఖచ్చితంగా ఎక్కడపడిందో చూపించారంటే, నేను మళ్లీ ఇంకోసారి దిగి, అది దొరుకుతుందేమో చూస్తాను" అన్నాడు.

గురుగోవింద్ సింగ్ అతని ముఖంలోకి తేరిపార చూశారు... ఆ ముఖంలోని ఆందోళనను అర్థం చేసుకున్నారు... రెండో బంగారు కడియాన్ని చేతుల్లోకి తీసుకున్నారు... మెల్లగా దాన్నీ బండమీదికి - అలా నీటిలోకి - జారవిడిచారు: "అదిగో..అక్కడ పడింది!" అన్నారు ప్రశాంతంగా.

ధనిక శిష్యుడి అహంభావం, రెండు మురుగుల్నీ తీసుకుపోయిన ఆ ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి ఉండాలి! మహాత్ములు చూసేది బంగారాన్ని కాదు; మనసులోని భావాన్ని!