ఒక ఊళ్ళో సీత-గీత అనే ఇద్దరు  స్నేహితులు ఉండేవాళ్ళు. ఆ  పిల్లలకు చదువు అంటే ఇష్టం లేదు.  వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళని చదువుకోమని చాలా సతాయించేవాళ్ళు. వాళ్ళు రోజూ బడికి పోతున్నామని చెప్పి, దారిలో ఒక గుడి వద్ద ఉండి పోయేవాళ్ళు. అక్కడే   సంతోషంగా ఆడుకునేవాళ్ళు.    
   ఒక రోజు వాళ్ళకు గుడి పక్కన చెత్తలో ఒక సీసా దొరికింది. దానిలో ఏముందో కనుక్కోవాలని దాని మూతను తీసారు. దాని నుండి  చిన్న పాము ఒకటి బయటకు వచ్చింది. పామును చూసి ఇద్దరూ భయపడి పోయారు. సీసాను అక్కడే  పడేసి, అక్కడి నుండి పారిపోబోయారు. అంతలో ఆ  పాము "పిల్లలూ,ఆగండి!” అని గట్టిగా అరిచింది.  'ఎవరబ్బా?' అని  పిల్లలిద్దరూ ఆగి, వెనక్కి తిరిగి  చూశారు.     
   "ఇదేంటబ్బా! పాము మాట్లాడతా ఉంది?! దీనికి దైవ శక్తులున్నట్లున్నాయి! ఏ రాక్షసో దీన్ని   సీసాలో బంధించి ఉంటుంది" అని  సీత-గీత ఇద్దరూ  అనుకుంటూ నిల్చుకొని ఉంటారు.     
   “మీరు అనుకుంటున్నది నిజం", అని పాము అన్నది.    
   ఇప్పుడు సీత  ధైర్యం తెచ్చుకొని, "మా మనసులోని మాట నీకెలా వినిపించింది?" అని పామును అడిగింది.     
   “నేను ఎవరి మనసులో ఉన్న మాటలనైనావినగలను, మీరు నాకు చేసిన మేలు సాన్యమైనది కాదు.  దానికి   ప్రతిఫలంగా మీకు  మూడు  వరాలు ఇస్తాను. ఏమి కావాలో కోరుకోండి ” అన్నదా పాము.     
   అప్పుడు సీత అంటుంది, "నేను ఒక తోట పెట్టుకుంటాను. దానికి రకరకాల మొక్కల విత్తనాలుండే ఒక విత్తనాల ప్యాకెట్ కావాలి" అని. అంతే! టక్కున ఒక విత్తనాల ప్యాకెట్  ఆమె చేతిలోకి వచ్చేసింది.     
   పిల్లలిద్దరికీ దాన్ని చూసి చాలా సంతోషం అయ్యింది.  అప్పుడు గీత అన్నది- "నాకు  సినిమా తీయాలని ఉంది" అని. అంతే! టక్కున ఎవరో  సినిమా వాళ్ళు వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు. తక్షణమే ఒక సినిమా తీసేశారు!    
   రెండు కోరికలూ నెరవేరాక, మరిప్పుడు 'మూడో వరం  ఏం  కోరుకోవాలి?' అని వాళ్ళిద్దరికీ సందేహం వచ్చింది.  ఏది ఆలోచించినా ఒకళ్లకి నచ్చితే ఒకళ్లకి నచ్చలేదు!  పామేమో వాళ్లని తొందర పెడతా ఉంది- "త్వరగా చెప్పండి- నేను వెళ్ళాలి" అంటోంది.     
   ఎంత తన్నుకలాడినా సీత-గీతలిద్దరికీ  మంచి ఆలోచన ఒక్కటంటే ఒక్కటీ తట్టలేదు.     
   చాలా సేపు ఇట్లా గడిచాక, వాళ్ళ అవస్థని చూసి గట్టిగా నవ్వింది పాము. "ఏమ్మా! మీరిద్దరూ విద్యార్థులు కదా? చదువుకునే వాళ్ళేనా? ఎంత ఆలోచించినా మీకు ఒక్క వరమూ దొరకలేదా, మంచిది, అడగటానికి వీలైనది?  నాకు తెలిసిపోయింది- మీ ఇద్దరికీ చదువంటే  ఇష్టం లేదు.  చదువుకునేవాళ్లకు చదువులంటే ఇష్టం లేకపోతే ఎలాగ? ఇంక వాళ్ళు ఎలా చదువుకుంటారు? అందుకని, మీ మంచికోరి, మీరు అడగకపోయినా నేనే మీకు  మూడో వరం ఇచ్చేస్తాను- "మీరిద్దరూ బాగా చదువుకొని, మంచి మనుషులుగా ఎదుగుతారు" అని చెప్పేసి అది నవ్వుతూ మాయమైపోయింది.     
   సీత-గీతలకు  ఇద్దరికీ  ఆ తర్వాతినుండీ- ఎందుకో మరి, బడి ఎగగొట్టబుద్ధి కాలేదు!
