పక్షులన్నింటికీ రాజైన గరుడపక్షి , తన ప్రజల నందరినీ సమావేశపరిచి, వాళ్ళ కష్టసుఖాలను విచారించ సాగింది: " ప్రియమైన పక్షులారా! మీరంతా మాపాలనలో సుఖంగా జీవిస్తున్నారని భావిస్తున్నాం . మీకేమైనా చెప్పుకోవలసింది ఉంటే సందేహించక చెప్పండి-" అన్నది.
"మహారాజా! మీ చల్లని పాలనలో మాకు ఏ ఇబ్బందులూ లేవు. పిల్లాపాపలతో మేం అందరం చాలా సుఖంగా జీవిస్తున్నాం " అన్నాయి అవి, ముక్త కంఠంతో .
"కానీ నేను అడిగేది- 'మీకేమైనా బాధలున్నాయా, చిన్నవో- పెద్దవో ' అని!" అన్నారు రాజుగారు.
"ప్రభూ! మాకోయిల జాతి చక్కగా పాటలు పాడుతూ అందర్నీ సంతోషపెడుతున్నది. మా పాట వినబడగానే 'వసంత కాలంవచ్చింది'అని అంతా ఆనందిస్తారు. మేం కాకిలా నల్లగా ఉన్నాకూడా , అందరూ మమ్మల్ని ఇష్ట పడుతున్నది అందుకే . అయితే మాకున్న బాధల్లా- " అని ఆగింది కోయిల, 'చెప్పాలా, వద్దా' అన్నట్లు తటపటాయిస్తూ. "చెప్పండి, చెప్పండి- పర్వాలేదు" అని గరుడుడు భరోసా ఇచ్చాక అది కొనసాగించింది- " ప్రభూ! మా బాధల్లా 'కాకి మారంగులోనే ఉందేమి?' అని! భగవంతుడు నిజంగానే దయామయుడు- కనుక మాకు ఆయన కాకి గొంతు మాత్రం ఇవ్వలేదు , ఏదో పొరపాటున కాకి రంగు ఇచ్చాడు గానీ!" అన్నది, వెక్కిరింతగా, వెనకెక్కడో దూరంగా ఉన్నకాకిని అసహ్యంగాచూస్తూ.
"ఏం, చిలుకా, నువ్వేమీ చెప్పవా, మీ జాతి గురించి?" అన్నాడు గరుడుడు, ముందు కూర్చొని తల ఎగరవేస్తున్న చిలుకతో. "రాజా! మనుషులు పలికిన మాటలన్నిటినీ, ఉన్నవి ఉన్నట్లు తిరిగి పలుకుతున్నాం మేం; వాళ్ళకు మంచి స్నేహితులం. వాళ్ళ పిల్లలు ఎవరైనా ముద్దుగా మాట్లాడితే వాటిని 'చిలుక పలుకులు' అని అంటుంటారు! వాళ్ళు మాకు అరమాగిన పండ్లు తెచ్చి పెడుతుంటారు; వాళ్ళ తోటల్లో మేం కొరికిన పండ్లను, "అబ్బ! చిలుక కొరుకుడు!" అని సంతోషంగా తింటారు పిల్లలు. అందువల్ల మాకెవ్వరూ హానిచేయరు. పంచెవన్నెల రంగే మా అందం, మా ఆకర్షణానూ! మాకేమీ కష్టాలు లేవు" అన్నది చిలుక గర్వంగా.
" ప్రభూ ! మేం నెమళ్ళం, భారత దేశపు జాతీయ చిహ్నాలం. మనుషులు మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మాఈకలు అద్భుతమైన రంగులతో అందంగా , ఆకర్షణీయంగా ఉంటాయి. మా ఈక లను అందరూ ఇళ్ళలో దాచుకుంటారు. మా నాట్యం చూస్తే ఎవరి హృదయాలైనా రంజిస్తాయి. పైగా మేం సుబ్రహ్మణ్యస్వామికి వాహనాలం- శ్రీకృష్ణుడు మాఈకల్ని తలమీద పెట్టుకుంటాడు. అందుకే మాకింత గౌరవం! మాకేం కష్టాలు?" అందినెమలి వయ్యారంగా.

గరుడుడు చిరునవ్వు నవ్వుతూ హంసవైపు చూశాడు. అది "మహాప్రభూ! మేం సరస్వతీ దేవికి వాహనంగా బహుకాలం నుండీ ఉంటూ , ఆమెతో సరి సమానంగా గౌరవం పొందుతున్నాం. పైగా మేం మిగిలిన పక్షుల్లాగా కనబడ్డ చెత్తనల్లా తినం- కేవలం తామర తూళ్ళే మాఆహారం. మమ్మల్ని, మా నడకల్ని చూశారు గదా? ఇంత నాజూకుదనం మాకు మాఆహారంవల్లే వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. తెల్లని మా రంగును చూసి అసూయ పడనివాళ్ళు ఉండరు- మేం రాజపక్షులం, మాకేమీ కష్టాలుండవు" అన్నది సుతారంగా.
ఇట్లా పక్షులన్నీ ఒకదాని తర్వాత ఒకటి సొంత గొప్పలు చెప్పుకున్నై. మూలన కూర్చున్న కాకి మాత్రం ఏమీ పలకలేదు. చివరికి పక్షిరాజు కాకిని చూసి " ఏం, కాకమ్మా! నువ్వు మాట్లాడవేం? బాగున్నావా? నీకు కూడా ఇబ్బందులేమీ లేనట్లేనా?" అని అడిగింది.
"అది శనీశ్వరుడి వాహనం ! దానికేం ఇబ్బందులుంటాయి?! దాన్ని చూసి అందరూ భయ పడ వలసిందే! పైగా ఇది కుడినుండి ఎడమకు వెళ్తే జనం భయపడి తమ ప్రయాణాలు ఆపుకుం టారు. ఇక దానికి ప్రత్యేకంగా ఒక ఆహారం కావాలని ఏమీ లేదు- ఏది కనిపిస్తే దాన్ని ఆబగా తింటుంది. ఇంక దానికి తిండి బాధ ఎక్కడ?! " అని మిగిలిన పక్షులన్నీ నవ్వాయి. కాకి అవమానంతో, బాధగా తల వంచుకుంది.
ఈలోగా గరుడుడి పిల్లలు ఆవలిస్తూ "నిద్ర ముంచుకు వస్తోంది " అనడంతో "సరే మరి! ఇంతటితో మన సమావేశాన్ని ముగి ద్దాం . వచ్చే పున్నమి రోజున అందరమూ కలుద్దాం మళ్ళీ. ఈలోగా మీరంతా మిమ్మల్ని మీరు కొంచెం పరిశీలించుకోండి. ఈ చర్చ ఇంకా కొనసాగాల్సి ఉంది " అని లేచింది , పక్షిరాజు.
* మళ్ళీ పౌర్ణమి రానే వచ్చింది. రాజుగారి ఆజ్ఞ మేరకు, పక్షులన్నీ, నది ఒడ్డున- తెల్లని వెన్నెల్లో కూర్చున్నై.
గరుడుడు అన్నిటినీ చూసి "సరే, అంతా వచ్చినట్లేనా? ఇక సమావేశం మొదలెడదామా?" అనగానే పక్షులన్నీ తలలాడించాయి. "మనం మన జాతుల గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం; కాకి దగ్గరికి వచ్చి ఆగాం" గుర్తు చేశారు రాజుగారు. అయినా ఎవ్వరూ మాట్లాడలేదు.

"ఏమైంది, మీకు? ఎవ్వరూ మాట్లాడరేమి?" అడిగాడు గరుడుడు . అయినా సభంతా మౌనంగానే ఉండిపోయింది. రాజు గారు నవ్వి, "రామ చిలుకా !నువ్వు మొదలెట్టు- కాకి జాతి ఎందుకంత హీనమైనదో చెప్పు" అని హుకూం చేశారు. అది కళ్ళ నీళ్ళు పెట్టుకొని "ప్రభూ! మన్నించండి! పోయినసారి మా జాతి గురించి నేను చాలా పొగరుగా మాట్లాడాను. కాకి గురించి చాలా దురుసుగా మాట్లాడాను. ఈ మధ్యే నన్ను పట్టి పంజరంలో బంధించాడు ఓ మనిషి! కనబడ్డ పక్షికల్లా నేను నా గోడు వినిపించుకున్నాను. అయినా ఎవ్వరూ నా సాయానికి రాలేదు. చివరికి ఈ కాకే, నా దగ్గరికి వచ్చి, తన గట్టి ముక్కు తో పంజరం తలుపు తీసి నన్ను కాపాడింది . లేకపోతే జీవితాంతం ఆ పంజరంలో బందీగా, స్వేచ్ఛ లేని బ్రతుకు బ్రతకాల్సి వచ్చేది . ఇంతకు ముందు దీన్ని నేను ఎంత ఎగతాళి చేసినా, అది మాత్రం చెడును మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడింది. ఈ కాకి రుణం తీర్చుకోలేనిది" అని నమస్కరించింది చిలుక.
అంతలో నెమలి- "ప్రభూ ! నేనుకూడా పోయినసారి కాకిని ఎగతాళి చేసిన వాళ్లలో ఉన్నాను. అయితే మొన్ననే నేను ఒక వలలో చిక్కుకున్నాను! ఎంత ఏడ్చానో చెప్పలేను. చివరికి ఈ కాకే, నా ఏడుపును విని, నన్ను ఓదార్చి, తన స్నేహితుడైన ఒక ఎలుకను తెచ్చి, వలను కొరికించి, నన్ను కాపాడింది. లేకపోతే నేను ఆ దుర్మార్గ మానవులకు చిక్కిపోయేదాన్ని. నా మాంసమంటే వాళ్లకు చాలా ఇష్టమట! నాకే అందమైన ఈకలు ఉన్నాయని గర్వంగా మాట్లాడాను- అయితే అవే నా ప్రాణాలకు ఎసరు తెస్తాయని తెలుసుకోలేదు నేను. ఒట్టి ఈకల అందమే తప్ప, నోరుతెరిచామంటే ఎవ్వరూ మాకంఠం వినలేరనే సంగతి మర్చిపోయి ప్రవర్తించాను" దీనంగా అన్నది నెమలి.
"మహారాజా! వారం రోజుల క్రితం నేను ఎప్పటి మాదిరే నదిలో ఈదుతూ తామర తూళ్ళకోసం వెతుక్కుంటున్నాను. నన్ను పట్టుకోవటం కోసం పడవలో వెంబడిస్తున్న మనుషులను నేను గమనించనే లేదు. ఈ కాకి తన అరుపులతో నన్ను హెచ్చరించకపోతే నేను ఆ మనుషుల పాల పడేదాన్ని. గొప్పమనస్సు గల ఈ కాకిని నేను అంతలేసి మాటలన్నందుకు ఇప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాను " అని కాకివైపు తిరిగి నమస్కరించింది హంస.
"మహాప్రభూ! నేను దాని రంగు గురించే కాక, దాని స్వరాన్ని గురించికూడా ఎత్తిపొడిచి, కాకిని చిన్నబుచ్చాను. నాపాట గొప్పగా ఉంటుందని ఏమేమో చెప్పాను; కానీ ఈ కాకమ్మ తన గుడ్లతో పాటు మాగుడ్లను కూడా పొదిగి ఇస్తున్నదని మరచాను . అంతేకాక, నిన్న నామీద వల విసిరి నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన మనుషుల్ని ఈ కాకమ్మే, తన ముక్కు తో పొడిచి, వాళ్ళ గురి తప్పి పోయేలా చేసి, నన్ను కాపాడింది. దానికి వేలవేల కృతజ్ఞతలు “ అన్నది కోయిల, సిగ్గుతో తలదించుకొని.
గరుడుడు చిరునవ్వు నవ్వి, "పక్షులారా! మీరంతా మీ మీ తప్పుల్ని తెలుసుకొని, కాకిని గౌరవించటం నాకు చాలా సంతోషం కలిగించింది. పక్షి జాతిలో కాకిది చాలా ప్రత్యేకమైన స్థానం. అది పరిసరాలను శుభ్రం చేసే గొప్ప పక్షి. దాని రంగును, అరుపును, శరీర నిర్మాణాన్ని ఎత్తిచూపి అంతటి పక్షిని చిన్నబుచ్చటం నిజానికి, మీ అందరి చిన్నతనమే. సరిగ్గా చూస్తే పక్షిజాతికి ప్రధాన శత్రువు మనిషే- ఈపాటికి ఆ సంగతి మీకు అర్థం అయ్యే ఉంటుంది. పక్షులన్నీ ఒకటిగా ఉండకపోతే మనుషుల ఈ ప్రపంచంలో వాటి మనుగడ కష్టమే!" అన్నాడు.
పక్షులన్నీ అంగీకారంగా తలలూపాయి. తమలో తాము పోట్లాడుకోవటం వల్ల బయటివాళ్లకు లోకువ అవుతామని అవన్నీ గుర్తించాయి. తమ విభేదాలను ప్రక్కన పెట్టి నిజంగా కలిసి బ్రతకాలని నిశ్చయించుకున్నాయి.