అనగా అనగా ఒక ఇల్లు, దాన్ని ఆనుకొని ఒక చీమల పుట్ట ఉండేవి.

ఆ చీమల పుట్టలో చాలా రాణీ చీమలూ, వాటికి పదింతలు మగ చీమలూ, వాటికి వందరెట్లు సేవక చీమలూ ఉండేవి. మగ చీమలు సేవక చీమలకు పనులు నేర్పిస్తూ ఉండేవి. సేవక చీమలన్నీ అవి ఏమి చెబితే అవి శ్రద్ధగా చేస్తూ ఉండేవి.

ఒకసారి ఆ ఇంటావిడ ఘుమఘుమలాడే పాయసం చేసింది. ఆ వాసనకే చీమలన్నీ మత్తెక్కిపోయాయి.

"ఎక్కడ, పాయసం? ఏది, పాయసం?" అరిచాయి రాణీ చీమలు. "పోండి, వెళ్ళి వెతకండి" ఆజ్ఞలు జారీ చేశాయి మగ చీమలు- ఇల్లంతా వెతకటం మొదలుపెట్టాయి, సేవకచీమలు.

అయితే ఆ ఇంటావిడ చాలా తెలివైనది- ఆమెకు తెలుసు, ఈ చీమల ప్రతాపం. అందుకని ఆవిడ ఒక ప్లేటులో నీళ్ళు పోసి, దాని మధ్యలో‌ ఒక గ్లాసును బోర్లించింది. ఒంటి స్తంభం మేడలాగా ఉన్న ఆ గ్లాసుమీద పాయసం గిన్నెను పొందికగా కూర్చోబెట్టింది.

సేవక చీమలు హడావిడిగా వెళ్ళి వెతికాయి. ప్లేటు మీదికి ఎక్కి, నీళ్ళ అంచుల వెంబడే తిరిగి చూశాయి: "ఉహుఁ..వేరే దారి లేదు- పాయసం గిన్నెను అందుకోవాలంటే నీళ్ళలోకి దూకాల్సిందే-"

"నీళ్ళలోకి దూకద్దులే, ఊరికే చచ్చిపోతాం" అని కొన్ని చీమలు వెనక్కి వెళ్ళాయి, ఉత్త చేతులతో. రాణీ చీమలకు కోపం వచ్చి వాటిని అంతం చేసేశాయి.

మిగిలిన సేవక చీమలకు అర్థమైంది- 'వేరే దారి లేదు- దూకాల్సిందే' అని.

అంచు వెంబడి ఉన్న చీమలు ముందుగా దూకాయి, నీళ్ళలోకి. వాటి వెనకనే రెండో వరస- వెంటనే మూడోవరస- ఇట్లా వందలాది వరసల చీమలు నీళ్ళలోకి దూకి, చచ్చి తేలాయి నీళ్లలో.

తర్వాత వచ్చిన సేవకచీమలు నీళ్లలో తేలుతున్న చీమల మీదుగా దూక్కుంటూ ముందుకు పోయి, పాయసం గిన్నెను అందుకున్నాయి.

పాయసం వేడిగా ఉన్నది. దాంతో కాళ్ళు కాలి ఇంకా చాలా చీమలు చచ్చిపోయాయి.

వాటిమీదినుండి పైకెక్కి, పాయసాన్ని అందుకున్న చీమల్లో అధిక శాతం ఆ పాయసంలోనే పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.

కొన్ని సేవకచీమలకు పాయసం దొరికినట్లే దొరికింది.

అయితేనేమి, అంతలోనే వచ్చిన ఇంటావిడ వాటిని దులిపేసి, పాయసాన్నంతా తమ పిల్లలకు వడ్డించేసింది! దులిపేయబడ్డ సేవకచీమలు నోట్లో కొంచెం కొంచెం పాయసాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాయి. మగచీమలు, ఆడచీమలు వాటిని చాలా అభినందించాయి. ఆపైన అవి తెచ్చిన పాయసాన్ని తీసుకొని, తమలో తాము పంచుకొని తిన్నాయి!

చీమల సమాజంలో ఏదో తప్పుంది. మన సమాజం కూడానూ- సరిగా లేదు. ఒకరు గెలవాలంటే ఎంతో మంది ఓడిపోవాలి, ఎందుకో.

ఎన్నెన్ని పోటీ పరీక్షలున్నాయో చూడండి! ఒక్కొక్క పోటీ పరీక్షలోనూ గెలిచేది అతి కొద్ది మందే. అయినా వాటిమీద ఆశతో ఎంతోమంది పిల్లలు తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. చదువులు వ్యాపారం అయిపోయి, సున్నితత్వం లోపించి, మొరటుగా మారిపోవటం మూలాన ఎందరి పసితనాలు వికసించకుండానే ముగిసిపోతున్నాయో! ఎందరెందరి జీవితాలు ఎటెటు పోతున్నాయో!

ఇదే పరిస్థితి అన్ని రంగాలలోనూ ఉన్నది- ప్రతి అభివృద్ధి వెనకాలా చెప్పలేనంత వెనకబాటు తనం ఉన్నది. ప్రతి విజయం వెనకా లెక్కలేనన్ని అపజయాలు ఉన్నాయి.

ఈ పరిస్థితులు మారతాయని ఆశిద్దాం. ఒకరి గెలుపు కోసం వెయ్యిమంది శ్రమ దోపిడీకి గురికాని రోజుల్ని తీసుకొద్దాం.

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలతో,
కొత్తపల్లి బృందం.