చాలా కాలం క్రితం  వెంకటంపల్లి ప్రక్కనే ఒక చిన్న అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు.  అడవిలో  దొరికిన వన మూలికలతో ఆయుర్వేద మందులు  తయారు  చేసేవాడు  ఆ సాధువు.  జబ్బు  చేసిన  వాళ్ళు చాలామంది  వచ్చి  ఆయన  దగ్గర మందులు తీసుకొని వెళ్లేవాళ్లు.    
   ఆయన ఇచ్చే మందులు బాగా పని చేస్తాయని పేరు ఉండేది. ఆయనకు సహాయకుడుగా పని చేసేవాడు మల్లయ్య. మూలికల సేకరణలోను, మందుల తయారీలోను మల్లయ్య  ఆ సాధువుకు  చేదోడు వాదోడుగా  ఉండేవాడు.    
   ఆ సమయంలో  అనంతపురం  జమీందారుగారికి   తీవ్రమైన తలనొప్పి మొదలైంది. ఆస్థానంలోని  వైద్యులు  ఆయనకు వైద్యం చేశారు గానీ ఆయన సమస్య  వాళ్లకెవ్వరికీ  లొంగలేదు. చివరికి  ఎవరి ద్వారానో విని, జమీందారు గారు స్వయంగా  సాధువు  దగ్గరకు  వచ్చి  తన  తలనొప్పికి  మందు  తీసుకొని  వెళ్ళటం మొదలు పెట్టారు. త్వరలోనే ఫలితం కనిపించింది!  అచిర కాలంలోనే ఆయన   తలనొప్పి  పూర్తిగా  తగ్గిపోయింది!     
   దాంతో జమీందారుగారికి సాధువంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడ్డది. తనకు వీలు దొరికినప్పుడల్లా, వారం వారం-  క్రమం తప్పకుండా  వచ్చి ఆయన  సాధువును కలుసుకొని వెళ్ళేవాడు. రాను రాను ఆయనలో ఒక కోరిక బలపడ సాగింది- "ఇంత శక్తి గల  సాధువు ఎక్కడో మారుమూలన, వెంకటం పల్లిలో ఉండటం కంటే, తమ ఆస్థానంలో ఉంటే  ప్రజలందరికీ వీలుగా ఉంటుంది కదా? ఆయన కారణంగా ఆయుర్వేదానికీ ప్రాచుర్యం లభిస్తుంది; ప్రజలకూ మేలు జరుగుతుంది!" అందుకని ఆయన  ఒక  రోజున  సాధువును  తమ సంస్థానానికి ఆహ్వానించాడు.    
   అయితే సాధువు అందుకు అంగీకరించలేదు. "నాయనా! నేను ప్రకృతిలో  పెరిగినవాడిని- అంతంత దూరాలు  రాలేను  నాయనా! సంస్థానాలు తిరగటం నావల్ల కాదు" అన్నాడు. "ఒక్కసారి వచ్చి వెళ్ళండి- కొన్ని రోజులు ఉండి వెళ్ళండి " ప్రాధేయపడ్డారు జమీందారుగారు. ఎంత చెప్పినా సాధువు ససేమిరా ఒప్పుకోలేదు.     
   "కానీలే, నువ్వైనా రావయ్యా, మల్లయ్యా!" అన్నారు జమీందారు గారు మల్లయ్యతో. ఎన్నాళ్లనుంచో  అనంతపురం   వెళ్ళి వింతలు-విశేషాలు చూడాలని   ఉండేది మల్లయ్యకు. అందుకని, ఆహ్వానించిందే తడవు జమీందారు గారి  వెంట  బయలు దేరి  సంస్థానానికి   వెళ్ళాడు.      
అనంతపురం చేరుకోగానే జమీందారు గారు  రెండు గుడ్డలను   తెప్పించారు. ఒకటి  తన మూతికి  కట్టుకున్నారు; మరొకటి మల్లయ్యకిచ్చి కట్టుకొమ్మన్నారు. "ఎందుకు, మహాప్రభూ?"  అడిగాడు  మల్లయ్య అనుమానంగా. "సంస్థానంలో అంతటా వాతావరణం బాగుండటం లేదు మల్లయ్యా! అనేక చోట్ల చెడు  వాసనలు ఉంటున్నాయి. అలాంటి మురికి గాలిని   మనం తట్టుకోవాలంటే ఈ గుడ్డ  తప్పనిసరి" అన్నారు జమీందారు గారు. "ఓహో!" అని ముఖానికి అడ్డంగా  గుడ్డను కట్టుకున్నాడు మల్లయ్య.      
   అంతలో జమీందారు గారు  రెండు  మంచినీళ్ల  బాటిళ్ళు తెప్పించారు. "ఇవి ఎందుకు ప్రభూ?" అడిగాడు మల్లయ్య . "సంస్థానంలో అన్ని చోట్లా నీళ్ళు బాగుండటం లేదు మల్లయ్యా! నీటి కాలుష్యం వల్ల వ్యాధులు వ్యాపిస్తున్నాయి.  వాటినుండి తట్టుకోవాలంటే ఈ జాగ్రత్త తప్పనిసరి. ఎక్కడ  పడితే అక్కడ  నీళ్లు త్రాగకూడదు" వివరించారు జమీందారు గారు.      
   అంతలో  ఇద్దరూ  జమీందారు గారి భవంతిని చేరుకున్నారు. సేవకులు వాళ్ళిద్దరికీ మర్యాద చేసి, భోజనం వడ్డించారు. మల్లయ్య  చేత్తో భోజనం చెయ్యబోతుంటే వారించి, జమీందారు గారు   అతని  చేతికి  రెండు స్పూన్లు ఇచ్చారు. "ఇవెందుకు ప్రభూ? చక్కగా చేతితో తినచ్చుగా?" అన్నాడు మల్లయ్య. " నాకూ శుభ్రంగా చేత్తో అన్నం తినాలని ఉంటుంది మల్లయ్యా! కానీ మన సంస్థానంలో ఎన్నెన్ని  సూక్ష్మ క్రిములు ఉంటున్నాయంటే, ఇక్కడ- మన చేతిలోనే, మనకు కనబడకుండా   ఎన్నో  సూక్ష్మజీవులు  ఉంటున్నాయి. అవి ఒక్కసారి మన కడుపులోకి వెళ్ళినా ప్రమాదం తప్పదు! ఇంకేం చేస్తాం? అందుకని ఇప్పుడు అందరమూ  స్పూన్లతోటే  తింటున్నాం!" అన్నారు జమీందారు గారు. మల్లయ్య  ఆ స్పూన్లతోటే  ఏదో తిన్నాననిపించాడు.      
   ఆ సరికి బాగా చీకటి పడింది. జమీందారు గారు  తనకోసం సిద్ధం చేయించిన పరుపులో పడుకున్నాడు  మల్లయ్య. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. "ఊరికే అలా తిరిగి వద్దాం" అని  లేచి  మూతికి  గుడ్డలేకుండా  బయటకు  వెళ్ళాడు మల్లయ్య. అక్కడ ఉన్న  మురికి  వాసనకు  కడుపు తిప్పినట్లైంది. సంస్థానంలో 'త్రాగు నీరు' అని రాసి పెట్టి ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి కాసిని నీళ్ళు త్రాగాడు-అంతే! ఏం జరిగిందో గాని, వదలకుండా వాంతులు మొదలయ్యాయి. 
తెల్లవారే సరికి  పూర్తిగా నీరసించిపోయాడు మల్లయ్య.  'మా వైద్యుల చేత వైద్యం చేయిస్తాను ఉండమ'న్నారు జమీందారు గారు.      
   కానీ మల్లయ్య  ఒప్పుకోనేలేదు. "లేదు లేదు- నేను వెళ్తాను. నాకు ఏమాత్రం బుద్ధి ఉన్నా ఇంక  సంస్థానాలకు  రాను. ముందుగా నేను సాధువు దగ్గరకు  వెళ్లాలి- క్షమించండి- ఇక్కడ నీరూ బాగాలేదు; గాలీ బాగా లేదు; వాతావరణమూ బాగాలేదు- ఇక ఇక్కడ ఉండేది  దేనికి? నేను వెళ్తాను-ఏమీ అనుకోకండి" అంటూ నీరసంగానే లేచి, మల్లయ్య  వెంకటంపల్లి దారి పట్టాడు.
