అనగనగ ఒక వూర్లో ఒక ఈగ ఉందంట. 'రేపు నూకాలమ్మ  పండగ కదా, ఇల్లు గుమ్మాలు కడుక్కోవాలి' అనుకుని పని మొదలు పెట్టిదంట. అలాగ కడుగుతూ కడుగుతూ అలిసి పోయి, తన పేరు మరచి పోయిందంట. అయ్యో ఎలాగా అని గురుతు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిదంట. పాపం అయినా గురుతుకు రాలేదంట! దాంతో 'సరేలే, ఎవరినైనా  అడిగి తెలుసుకుందాం'అని బయలుదేరిందంట.     
మొదట కోడిపిల్ల దగ్గరకు వెళ్లి అడిగింది- "ఓహ్ కోడిపిల్లా! నా పేరు నీకు తెలుసా?" అని అడిగింది. కోడిపిల్ల "కొక్కురోక్కో" అని ఈగ చెవిలో గట్టిగా కూసింది. దానితో ఈగ  "నా చెవి బద్దలు ఐపోయింది బాబోయ్! అయినా నా  పేరు కొక్కురోక్కో కాదు" అని అక్కడ నుండి పారిపోయింది.    
   అంతలో దానికి  ఒక కుక్కపిల్ల కనిపించింది. "అబ్బ! ఎంతటి ముచ్చటయిన తోకో!" అని ఈగ ఈర్ష పడింది.    
   అంతలో వచ్చిన పని గురుతుకు వచ్చి- "ఏమండీ, కుక్కపిల్ల గారూ! నా పేరు ఏమిటో చెప్పగలరా?" అని అడిగింది.  
కుక్కపిల్ల చిరాకు పడింది. "అన్నం తినే హడావిడిలో నేనుంటే, ఈ ఈగ గోల ఏమిటో" అనుకొనింది. "బో బో" అని గట్టిగా  మొరిగింది. దానితో ఈగ  అక్కడ నుండి తుర్రుమంది.     
   "అమ్మయ్య" అని రొప్పుతూ ఒక చెట్టు మీద కూర్చుని సేద తీరింది. "అమ్మో ఇంక  నా పేరు నాకు ఎప్పటికీ తెలీదేమో, యలాగా?' అని దిగాలు పడింది. అంతలో చెట్టు మీద కాకమ్మ ఈగను పలకరించింది- చెట్టు తొర్రలో ఉన్న పిల్లి మామ చాల తెలివైందని, దానిని అడగమని సలహా ఇచ్చింది.     
   దానితో ఈగ  వెళ్లి  పిల్లిని "నా  పేరు ఏంటో తెలుసా, నీకు?" అని అడిగింది. "అయ్యో! నేను ముసలిదాన్ని అయ్యిపోయినానమ్మా! నాకు ఏమీ గుర్తుకు ఉండడం లేదు! అయినా పర్వాలేదు, ఆలోచిస్తాను- రేపు కనిపించు" అని అంది అది. దాంతో  తన పేరు తెలుసుకో గలనన్న నమ్మకం ఈగకు పూర్తిగా పోయింది.     
   అంతలో దగ్గర్లో ఎక్కడో  గోల గోలగా అనిపించి, అది అక్కడికి  పరిగెత్తింది. అక్కడ చాలా- కోడి,కుక్క,పిల్లి,ఝుమ్మంటూ కందిరీగ,రోద చేస్తూ దోమ- ఇంకా చాలా మంది పోగై ఉన్నారు. వాళ్ళంతా అప్పుడే ఈనబోతున్న గేదె వైపు చూస్తున్నారు. "నొప్పులు వోర్చుకో" అనీ, "అంతా మంచిగానే జరుగుతుందిలే" అని ధైర్యం నూరి పోస్తున్నారు. ఈగ కూడా తన పేరు గొడవ కాసేపు మర్చిపోయింది. 'ఎప్పుడు గేదె ఈనుతుందా, ఒక చిన్న దూడ పుడుతుందా' అని చూస్తుండగానే  "హీ హీ" అని సకిలిస్తూ దూడ గేదె కడుపు  లోనించి బయటకు వచ్చింది. అందరూ సంతోషంగా అరిచారు గానీ  దూడమాత్రం 'హీ హీ' అని సకిలించడం ఆపడం లేదు.     
   అది విన్న ఈగకు తన పేరు 'ఈగ' అని గుర్తుకు వచ్చింది. "హమ్మయ్య" అనుకోని అది  ఇంటి దారి పట్టింది.
