మండువవారిపాలెంలో నారాయణయ్య, లక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. నారాయణయ్య ఆ ఊరి గుళ్ళో పూజారి. సాధుస్వభావి. ఎప్పుడూ పూజలూ, వ్రతాలూ, ఉపవాసాలూ, పురాణ కాలక్షేపాలతో తన జీవితాన్ని గడిపేవాడు. భార్య లక్ష్మమ్మ కూడా ఆయనకు తగినట్లుగా నడుచుకునేది. అయితే ఎన్ని నోములు నోచినా వాళ్ళకు పిల్లలు మాత్రం పుట్టలేదు.
ఒక రోజున భార్యతో అన్నాడు నారాయణయ్య- "లక్ష్మీ! మనకా, పిల్లలు లేరు. పున్నామ నరకం నుండి తప్పించుకోవడానికి రోజూ ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడదాం" అని.
"మనకే జరగడం లేదు. అతిథులకు మనం ఏం పెట్టగలమండీ!" అంది లక్ష్మమ్మ.
"ఉన్న దాంట్లోనే సర్దుకుందాం. ఏది ఏమైనా సరే, మనం మాత్రం రోజుకొకరికి భోజనం పెట్టాల్సిందే. నేను వెళ్ళి ఇవాల్టి అతిథిని తీసుకువస్తాను. నువ్వు భోజనం సిద్ధం చెయ్యి" అంటూ బయటకు వెళ్ళాడు నారాయణయ్య- మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరో అతిథిని వెంటబెట్టుకొని వచ్చాడు కూడానూ!
వరండాలో సిద్ధం చేసి ఉంచిన నీళ్ళతో కాళ్ళు కడుక్కుని ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. లక్ష్మమ్మ వడ్డించింది. భోజనం అయ్యాక తాంబూలం పుచ్చుకుని, దంపతులిద్దరినీ దీవించి వెళ్ళిపోయాడు అతిధి.
మరునాడూ ఇదే తంతు. ఇట్లా నెల రోజులు గడిచాయి. దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోతోంది. ఖర్చు సంగతి అటుంచి, ప్రతిరోజూ విందు భోజనం సిద్ధం చేయలేక లక్ష్మమ్మ నానా అవస్థలూ పడుతోంది.
ఒక రోజున పచ్చడి నూరుకుంటూ "భగవంతుడా! నాకీ బాధ ఎప్పుడు తప్పుతుందో కదా, ఏమిటి ఉపాయం?" అనుకుంటూ రోటి వైపు, రోకలి వైపు చూసింది. వెంటనే ఆమె కొక ఉపాయం తట్టింది. సరైన సమయం కోసం, సరైన మనిషి కోసం ఎదురు చూడసాగింది.
బ్రాహ్మణ అతిధికోసం ఊళ్ళోకి వెళ్ళిన నారాయణయ్య ఒకరోజున పేరిశాస్త్రి అనేవాణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు. పేరిశాస్త్రి నోట్లో నువ్వు గింజ నానదు. తనకు తెలిసిన విషయాన్ని ఊరంతటికీ చెప్తే గానీ నిద్రపోడు. అతన్ని చూడగానే లక్ష్మమ్మ తన పథకం అమలు చెయ్యాలని నిర్ణయించుకుంది-
కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చోబోతున్న భర్తని పిలిచి- " ఏమండీ! ఇంట్లో నెయ్యి లేదు. త్వరగా సుబ్బయ్య కొట్టుకి వెళ్ళి నెయ్యి పట్రండి" అంటూ నెయ్యి గిన్నెని చేతికి అందించింది. నారాయణయ్య దొడ్డి దారిన అటు వెళ్ళగానే, ఇటు వంట ఇంట్లోంచి రోటినీ, రోకలి బండనీ భోజనాల గదిలోకి తెచ్చింది లక్ష్మమ్మ.
పేరిశాస్త్రి అదే గదిలో ఒక ప్రక్కగా -పీటమీద- కూర్చుని ఉన్నాడు . లక్ష్మమ్మ అతనితో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి, గది మధ్యలో రోటినీ, రోకలినీ ఉంచింది. వాటికి పసుపు రాసి, బొట్లు పెట్టి, పూజ చేసింది. వాటి చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టింది. పేరిశాస్త్రికి ఈ తంతు ఏమీ అర్థం కాలేదు - "ఏం చేస్తున్నావమ్మా?! ఎందుకు, వాటికి పూజ చేస్తున్నావు?" అని అడిగాడు ఆశ్చర్యంగా.
"ఆఁ, ఏమీ లేదు శాస్త్రిగారూ! మీరు ఏమీ అనుకోకండి! మాకు పిల్లలు పుట్టాలంటే మా ఇంటికి వచ్చిన అతిథులకు ఈ రోకలి బండతో గట్టిగా ఒక దెబ్బ వేయాలిట. ఇట్లా వంద మందికి వంద దెబ్బలు వేస్తే మాకు పండంటి బాబు కలుగుతాడట! అందుకని, మా వారు ఈ వ్రతం చేస్తున్నారు. ఆయన రాగానే మీరు మా మీద దయ ఉంచి, ఒక దెబ్బ వేయించుకోండి" అంది లక్ష్మమ్మ.
"అదేంటమ్మా! మీరు మంచి విందు భోజనం నెల్లాళ్ళ నుండీ పెడుతున్నారని ఊరంతా చెప్పుకుంటున్నారే, మరి!?" అన్నాడు పేరిశాస్త్రి, కొంచెం అనుమానంగా.
"పేరిశాస్త్రి గారూ! ఎవరైనా మా ఇంటికి వచ్చి దెబ్బలు తిని- 'దెబ్బలు తిన్నాము' అని చెప్పుకుంటారా, బయట!? అందుకేనేమో, అందరూ మిమ్మల్ని 'అమాయకులు' అనుకుంటారు పాపం!" బుగ్గలు నొక్కుకుంటూ అంది లక్ష్మమ్మ. ఈలోగా నారాయణయ్య దొడ్డి వాకిట్లోంచి వచ్చే అలికిడి వినబడగానే, లక్ష్మమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళింది. 'ఇదే సమయం, పారిపోవడానికి!' అనుకుని, పేరిశాస్త్రి తన చేతి సంచిని తీసుకుని ఒక్క అంగలో వీధి గుమ్మం చేరాడు. అంతలోనే లోనికి వచ్చిన నారాయణయ్య అది చూసి లక్ష్మమ్మను- "అదేమిటే? శాస్త్రిగారు వెళ్ళిపోతున్నట్లున్నారు, ఎందుకు?" అని అడిగాడు గాభరాగా.
'ఆఁ, ఏమీ లేదండీ! ఆయనకి మన రోకలి బండ కావాలట. నేను ఇవ్వనన్నాను; కోపం వచ్చి- "మీ ఇంటి భోజనమూ అవసరం లేదు; మీ రోకలీ‌ అవసరం లేదు!" అని లేచి వెళ్ళిపోతున్నారు" అంది లక్ష్మమ్మ, వంటింట్లోంచే.
"అతిథి ఏమి అడిగినా ఇవ్వాలని తెలియదా? పాపం ఎంత ముచ్చటపడి అడిగారో, ఏమిటో!" అని రోకలిబండను చేతబట్టుకొని బయటికి వచ్చాడు నారాయణయ్య- "పేరిశాస్త్రిగారూ! ఇదిగోండి- రోకలి బండ! ఆగండి! ఇదిగో, అందుకోండి!" అంటూ, రోకలిని ఊపుతూ పేరిశాస్త్రి వెనకనే పరుగుతీశాడు.

అది చూసిన పేరిశాస్త్రి " వామ్మో! కొట్టడానికి వెంటపడుతున్నాడ్రోయ్! " అంటూ పరుగు లంకించుకున్నాడు. నోరు ఆగని పేరిశాస్త్రి, తను కనుక్కున్న 'నారాయణయ్య ఇంటి రహస్యాన్ని' అందరికీ చెప్పేశాడు. రోకలి బండ చేతబట్టుకొని ఊఫుతూ "ఆగండి! ఇదిగో, రోకలి!" అని అరుస్తూ నారాయణయ్య పేరిశాస్త్రి వెంట పడటాన్ని చూసిన జనం కూడా పేరిశాస్త్రి చెప్పిన కథను చిలవలు పలవలుగా చూడని వాళ్ళందరికీ చెప్పేశారు.
అటుపైన ఎంత వెతికినా నారాయణయ్యకు అతిధులు మాత్రం దొరకలేదు.
లక్ష్మమ్మకు అతిథుల బాధ తప్పింది!