కొత్తపల్లి బృందం-వివరాలు
నారాయణ: ఉస్మానియాలో ఇంజనీరింగు. తరువాత ఢిల్లీ ఐఐటీ. ప్రస్తుతం బిడ్డకు ఎనిమిదేళ్ళు. వైద్యం(హోమియో, ఆయుర్వేదం), భాష, పాట, ధ్యానం అంటే అభిమానం. నడవటం అంటే ఇష్టం. లెక్కలు చెప్తుంటాడు పిల్లలకు. ఈ మధ్యే కథల్లో పడ్డాడు. అనువాదాల కంపెనీ పెడతాడట ( ఇంకా!). స్వతంత్రం లేకపోతే ఊరుకోడు. ఆలోచనల్లో సృజనాత్మకత తక్కువే- సంక్లిష్టత ఎక్కువ.
ఆనంద్: ఆనంద రూపం. తెలుగు భాషాభిమాని. ఓపెన్ సోర్స్ కన్సల్టెంట్. కూనలమ్మ పదాలు, హైకూల కోయిలమ్మ. భాషలో కొత్త ప్రయోగాల ప్రేమికుడు. ఈ e-మాసపత్రిక వెనకనున్న సాంకేతిక శక్తి- "అన్నీ తానైన" మూలపురుషుడు. మిగిలిన వాళ్లందరికీ వెన్నుదన్నుగా ఉంటున్న గుంటూరు చిన్నన్న.
లక్ష్మి: కంప్యూటర్ దేవి, లెక్కలమ్మ. కొంచెం భక్తి, ఇంకొంచెం శ్రద్ధ, మరికొంచెం కళా ప్రేమ, భాషాభిమానం- వెరసి ఆనంద లక్ష్మి. సియస్సెస్ దగ్గర్నుండి కంటెంట్ వరకూ చూసే ఓపికగల మనిషి. పేరుకు ఆనంద్ ఉన్నా, పనంతా తానే చేసింది, కొత్తపల్లిని నిర్మించటం కోసం. ప్రస్తుతం శలవులో ఉంది- పాపను జాగ్రత్తగా చూసుకుంటూ.
సుబ్బరాజు: "డాక్టర్"సుబ్బరాజు. ఐఐటీ మద్రాసు, ఆపైన బొంబాయి ఐఐటీ. కొత్తపల్లి ప్రచురణల కర్త. విద్యారంగం గురించి చాలా తెలుసు. కలలు కనటం అంటే ఇష్టం. అందరూ కలలుగనాలంటాడు. పుస్తకాలమ్ముతాడు, నేలమీద బతుకుతాడు. పల్లె పట్టున్న మనిషి. ఆవులు, మేకలు, కోళ్లు పెంచుతాడు. హాండ్ పంపుతో నీళ్ళు కొడతాడు. చేతులు నలుపు (ఎరుపు, పసుపు, నీలం రంగులు కూడా) చేసుకుంటాడు. కాగితపు బొమ్మలతోబాటు వెదురు కుర్చీలు కూడా చేస్తాడు. ఇన్నాళ్ళూ కొత్తపల్లి ఆర్ధిక వ్యవహారాలు చూసి చూసి బోరు కొట్టింది- ఇప్పుడు "ఏమీ చెయ్యను-నన్ను ముట్టుకోవద్దు" అంటున్నాడు.
మంజునాథ్: చెన్నేకొత్తపల్లి జిల్లా పరిషత్ స్కూలు పూర్వవిద్యార్థి. బడిపంతులు అవుదామని బియీడీ కూడా పూర్తి చేశాడు. కొత్తపల్లి కార్యాలయంలో ఏ తప్పు జరిగినా "ఏంటి మంజూ!" అంటుంటారందరూ. కొంచెం కుళ్ళుకుంటూ, కొంచెం సర్దుకుంటూ పోతుంటాడు. భాషాభిమానం ఉంది; కానీ భాష ఎంత అవసరమో ఇంకా తెలీదు పూర్తిగా. ఆవులన్నా, ఆదివారాలన్నా మాత్రం చాలా ఇష్టం. అయితే నెలచివర్లో ఆదివారాలొస్తేనే, కష్టం. కొత్తపల్లి ప్రచురణల ఉత్తరాలు రాసేది ఇతనే.
వీరాంజనేయులు: బొమ్మలు వేయటం మీద ఇష్టంకొద్దీ యం యఫ్ ఏ చేసిన ప్రకాశం జిల్లా చిత్రకారుడు; 'యాక్ థూ' అని హైదరాబాదు హిమాయత్ నగర్లో ఓ కళా స్టుడియో మొదలు పెట్టాడు. ప్రస్తుతం జెయన్టీయూ లో విజిటింగ్ ఫ్యాకల్టీగా చిత్రకళకు సంబంధించిన కొన్ని అంశాలు బోధిస్తున్నాడు కూడాను. చాలా ఏళ్ళుగా కొత్తపల్లి ముఖచిత్రంతో అందరికీసుపరిచితుడు. ప్రస్తుతం తనతో బాటు ఉన్న కళాకారుల బృందంతో కలిసి కొత్తపల్లిలో బొమ్మలన్నీ వేసే పనిని నెత్తిన వేసుకున్నాడు.
రాధ మండువ: రిషివ్యాలీ బడిలో తెలుగు పంతులమ్మగారు. తెలుగు భాషన్నా, కథలన్నా చాలా ఇష్టం. కొత్తపల్లికి హితులు- అయినా, నిజానికి ఈవిడే 'సీ యీ వో' గారు అన్నట్లుంటారు. ఈ మధ్య రకరకాల ప్రింటు పత్రికలకీ, ఈ- పత్రికలకీ పిల్లల కథలూ, పెద్దల కథలూ రాసేస్తున్నారు. పిల్లల్ని దగ్గరగా గమనించటం, వాళ్ళ ప్రవర్తనలోంచి తను నేర్చుకుంటూ ఉండటం, 'చలాకీగా పనులన్నీ నెగ్గించుకు రావాలి-నిరాశ పడి ఊరుకోకూడదు' అని నమ్మటం, అప్పుడప్పుడూ కంగారు పడుతుండటం- వెరసి రాధగారు.
అడవి రాముడు: ఇంతమంచి ఒరిజినల్ పేరును వదిలి c.రాము అని రాయించారు పెద్దలు. న్యాయపతి రాఘవరావు బాపు మీద పెట్టుకున్నన్ని ఆశలు ఇతనిమీద పెట్టుకొని ఉన్నారు ఇక్కడివాళ్లు. దూరవిద్యలో బీయస్సీ పూర్తయింది. జెయన్ టి యు ఫైనార్ట్స్ కళాశాల, హైదరాబాదు లో బీయఫ్యే చదివాడు. ఇన్నాళ్ళుగా కొత్తపల్లికి బొమ్మలు గీసి పెడుతున్నాడు. ప్రస్తుతం బాగా డబ్బులిచ్చే ఉద్యోగాలు వెతుక్కుంటున్నాడు. ఇంగ్లీషు రాస్తే మాత్రం పదానికో తప్పు తప్పదు. స్పెల్లింగ్ చక్రవర్తి.
అలివేలమ్మ: "అయ్యో! ఈమె నడవకూడదు- వీల్ ఛైర్ పట్టుకురండి" అంటుంటారు ఆస్పత్రులవాళ్ళు. ఈమెదిమాత్రం గట్టిప్రాణమే. వీల్ ఛైర్ అవసరం లేకపోవటమే కాదు- చీమ లాగా ఒక్కొక్క పనీ చేసుకుంటూనే పోతుంది. ఊపిరితిత్తులు పోయినా ఆయుర్వేద కషాయాలు తాగుతూ నెగ్గుకొస్తోంది. లైబ్రరీ పుస్తకాలు ఇంకా ఉన్నాయంటే ఈమె చలవే. ఎటొచ్చీ ఈమెకు నచ్చేట్లు వంటచేసేవాళ్ళే, ఇంకా పుట్టలేదు.