కొత్తపల్లికి స్వాగతం

పూర్వం ఒక రాజుగారికి ఉన్న నలుగురు కొడుకులూ అప్రయోజకులయ్యారట. బహుశ: తండ్రిగారి క్రమశిక్షణ మరీ ఎక్కువైపోయిందేమో, వాళ్లకి ఏం చెప్పినా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులూ, అమాత్యులూ, గురువులూ ఏం చెప్పాలని నోరు తెరిచినా వాళ్ల చెవులు మూసుకుపోతున్నాయి. తెలివి తేటలకేమీ తక్కువ లేదు. ఉన్నదల్లా అప్రయోజకత్వమే.

చివరికి రాజుగారు విష్ణుశర్మ అనే పండితుడిని రావించి, ఆయన్ని గౌరవించి, తన కొడుకుల్ని చూపించి, "వాళ్లని మీరే తీర్చిదిద్దాలని వేడుకున్నారు.విష్ణుశర్మ సరేనని వాళ్లని వెంటబెట్టుకెళ్ళారు. ఆరు నెలల్లో వాళ్లు నలుగురూ ప్రయోజకులై తిరిగి వచ్చారు!

విష్ణుశర్మ వాళ్లమీద వ్యాకరణ శాస్త్రాలనూ, వేదమంత్రాలనూ, క్షత్రియోచిత యుద్ధ విద్యల్నీ రుద్దలేదు. పుస్తకాలు ముందు పడేసి చదవకపోతే ఊరుకోనని ఉరమలేదు. కథలు చెబుతూ పోయాడు. ఆ కథలే రాజుగారి కొడుకుల్ని ప్రయోజకుల్ని చేశాయి. నీతి చంద్రికగానూ, పంచతంత్రంగానూ పేరొందాయి.

కథలు, ఆటలు, పాటలు వృధాపోవు. వాటిలో పిల్లలకు వాళ్లదైన ఒక ప్రపంచం దొరుకుతుంది. ఆ ప్రపంచంలో స్వేచ్చగా రెక్కలార్చుకుంటూ తిరిగి, వాళ్లు ఇతర ప్రాపంచిక విషయాల్ని సునాయసంగా నేర్చుకుంటారు.

కథలు, ఆట పాటలు సేద తీరుస్తాయి. సేద తీరిన మనసులు ఊరట చెంది, మంచి మనుషుల్ని తయారు చేస్తాయి. సమాజంలో శాస్త్ర విషయాల్ని లోతుగా నేర్వాలంటే మనుషులకు వాటి పట్ల మక్కువ అవసరం. కళలు ఆ మక్కువని నిర్మిస్తాయి.

తెలుగు పిల్లలకు సంతోషాన్ని ఇచ్చేందుకుగాను మానవీయ స్పర్శ ఉన్న కథల్ని, ఆటపాటల్ని , విద్యా, విజ్ఞాన, వినోదాల్నీ పిల్లల స్వీయ దృక్పథంలో, బేషరతుగా అందించే ఉద్దేశంతో "కొత్త పల్లి" మీ ముందు నిల్చింది.

తెలుగు భాషామతల్లి పరహస్తగతం అయిపోయి, రాను రాను తెలుగురాని తెలుగు పిల్లలే ఎక్కువైపోతున్నారు. అలాంటి పిల్లలకూ, వాళ్ల తల్లిదండ్రులకూ, వాళ్ల తల్లిదండ్రులకూ కూడా "తెలుగులో అన్నీ నేర్చుకోవచ్చు.... ఇంగ్లీషును కూడా‌ తెలుగులోనే నేర్చుకోవచ్చండి" అని సగౌరవంగా చెబుదామని "కొత్తపల్లి" తయారైంది.

విజ్ఞానం తెరిచిన పుస్తకంలా ఉండాలనీ, మేధస్సు ఏ ఒక్కరి సొంత ఆస్తీ కాదనీ, కంపెనీలకు సమాంతరంగా, వాటికి దీటైన సమాచార విజ్ఞాన వ్యవస్థల్ని ఏర్పరచింది "ఓపెన్ సోర్స్ కుటుంబం". ఆ పునాదులపై నిలబడి, వాటి వారసత్వాన్ని సగర్వంగా అందరితోటీ పంచుకునేందుకు వచ్చింది కొత్తపల్లి.

తెలుగునాట పిల్లల సృజనను, వారి పఠనాశక్తిని ప్రోత్సహిస్తూ, వ్యాపారాపేక్ష లేకుండా పిల్లల కోసమే నిలిచే మరిన్ని కొత్తపల్లులు తయారయ్యేందుకు సాయపడటం మా అందరి అభిమతం.

మీరు పిల్లలైతే, ఈ రచనల్ని, బొమ్మల్ని, పాటల్ని చదవండి, చూడండి, వినండి, ఆనందించండి. ఇలాంటివి మీకూ వచ్చి ఉంటాయి అనేకం. మాతో వాటిని పంచుకోండి. మీ రచనల్ని కూడా కొత్తపల్లి పత్రిక ప్రచురించగలదు.

మీరు పెద్దలైతే, మళ్ళీ ఓసారి పిల్లల ప్రపంచంలోకి అడుగు పెట్టండి. వాళ్లకు నచ్చేవేవో చూడండి. మీ పిల్లలకు వీటిని చదివిపెట్టండి, వారిచేత చదివించండి, వాళ్లకు వినిపించండి, మీరూ ఈ పాటలు పాడుకోండి. మీలోని సృజనకూ పదును పెట్టండి. పిల్లలకు పనికొచ్చే రచనలు ఏమైనా ఉంటే మాకు పంపండి. ఇంటర్నెట్లో తెలుగు వాడకాన్ని మరింత పెంచండి. ఓసారి రండి, స్నేహ హస్తాన్నందించండి, మీకు చేతనైన సాయం చేయండి.

మేం చేస్తున్న ఈ పని మాకు నచ్చింది. మీకెలా అనిపించిందో చెప్పండి మరి.

మీ-

కొత్తపల్లి బృందం.





ఫిబ్రవరి 2020 సంచిక చదవండి