యూరోపియన్ కమిషన్ వారు యూరోపియన్ యూనియన్లో భాగస్వాములైన దేశాల్లోని (మన దేశంలోని వాళ్లకి కాదు!) పదహారేళ్ళ వయసు పిల్లలకి 'Juvenes Translatores'- "యువ అనువాదకులు" అని ఓ పోటీ నిర్వహిస్తారు. 2007నుండి ఈ పోటీ ఏటేటా జరుగుతూ వస్తోంది.

ప్రతి ఏడాదీ వీళ్ళు ప్రకటన విడుదల చేశాక, ఈ దేశాల్లోని స్కూళ్ళు తమ తరపున ఓ నలుగురైదురు పిల్లల్ని ఎంపిక చేయొచ్చు పోటీకి. అట్లా వచ్చిన స్పందనల్ని చూసుకొని యూరోపియన్ యూనియన్ వాళ్ళు ముందుగా కొన్ని స్కూళ్ళని ఎంపిక చేసుకొని అందరికీ తెలియపరుస్తారు. అప్పుడు ఈ పిల్లలు అందరూ ఒక అనువాద పరీక్ష కి వెళ్ళి, అక్కడ ఇచ్చిన అంశాన్ని అనువాదం చేయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష అయ్యాక, వాళ్ళు ఒక్కో దేశానికి ఒక్కో విద్యార్థి చొప్పున ఎంపిక చేసి, అందరినీ పిలిచి, ఒక సభలో బహుమతి ప్రదానం చేస్తారు అన్నమాట. ఈ ఏడాది బ్రిటన్ దేశానికి చెందిన వాకర్ థాంసన్ అనే అబ్బాయి ఈ అవార్డుకి ఎంపికయ్యాడు. అతన్ని గురించి వార్తల్లో చదివాను. ఈసారి అతన్ని గురించి పరిచయం చేస్తున్నాను.

ఈ అబ్బాయికి చిన్నప్పటినుంచీ 'రకరకాల భాషలు నేర్చుకోవటం' అంటే ఇష్టమట! ఇప్పటికే ఇతనికి ఫ్రెంచి, జర్మన్, గ్రీకు, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్, సంస్కృతం, ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషల గురించి, పూర్తి స్థాయిలో కాకపోయినా, ఎంతోకొంత అవగాహన- ఉందట! "ప్రస్తుతం అరబిక్ భాషని నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను" అని చెప్పాడు అతను, ఒక వెబ్సైటుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో! అవార్డు వచ్చిన సందర్భంగా వాకర్ తన రష్యన్ ఉపాధ్యాయుడికీ, తోటి విద్యార్థులకీ ధన్యవాదాలు తెలిపాడు.

"ఆయా భాషలని నిజ జీవితంలో ఉపయోగించటంతో పాటు, ఆ భాషల వెనక ఉన్న శాస్త్రీయ అంశాలని భాషాశాస్త్ర పరంగా తెలుసుకోవడం అంటే కూడా నా కెంతో ఇష్టం" అని చెప్పాడు థాంప్సన్. భవిష్యత్తులో తనకున్న ఈ బహుభాషా పరిజ్ఞానాన్ని వాడుకోగలిగే ఉద్యోగం ఏదన్నా చేయాలని అతని కోరికట! -అంటే, వేరు వేరు భాషలు మాట్లాడే దేశాలమధ్య వచ్చే తగవులు తీర్చటం, పెద్ద పెద్ద బహుదేశీయ ప్రాజెక్టులలో- వివిధ దేశాల వాడకందారులతో సంప్రదింపులు జరపడం - ఇలాంటివన్నమాట.

"మనంకూడా చిన్నప్పటి నుండీ రెండు మూడు భాషల్లో చదవటం, రాయటం నేర్చుకుంటూ పెరుగుతాం గదా?! ఒక భాషలో వచ్చే అంశాలను మరో భాషలోకి అనువాదం చేస్తూంటే..? అట్లా మన భాషా పరిజ్ఞానం మెరుగుపడుతుందిగదా!"అనిపించింది నాకు, వాకర్ థాంప్సన్ గురించి చదువుతుంటే. ఈ వ్యాసం రాయడానికి అదీ ఒక కారణం.

మరి మీలో ఎవరైనా మీకు నచ్చిన ఒక చందమామ కథనో, కొత్తపల్లి కథనో ఆంగ్లంలోకి అనువదించడానికి ప్రయత్నిస్తారా? లేదంటే,

మీరు చదివిన ఆంగ్ల కథని దేన్నైనా తెలుగులోకి అనువదించండి- కొత్తపల్లి బృందానికి నచ్చితే దాన్ని ప్రచురిస్తారు కూడాను! వీటిల్లో ఏది చేసినా మన భాషా పరిజ్ఞానం మెరుగు పడుతుంది కదా, ఏమంటారు?