తెలుగుబాల పద్యాల్లో ఓ తిట్టు పద్యం ఉంది:

బడికి నడవలేడు; పాఠాలు వినలేడు;
చిన్న పద్యమప్పజెప్పలేడు-
రాజరాజు బిడ్డరా, నేటి విద్యార్థి
లలిత సుగుణజాల తెలుగుబాల!

మనందరం ఇంకా అంత పాడైపోలేదులేగానీ; నిజంగానే ఆ బాటలో వేగంగా ప్రయాణిస్తున్నామేమో అనిపిస్తుంది చూడగా.

బడికి చేర్చేందుకు బస్సులూ, ఆటోలూ వచ్చేశాక, దూరాలన్నీ దగ్గరయి-పోయినట్లున్నాయి, దాంతో మన పిల్లల్లో నడిచే అలవాటు బాగా తగ్గిపోయింది. వ్యాయామపు వేళల్లో తప్ప మరెప్పుడూ శరీరానికి పని లేకుండా అవుతోంది - ముఖ్యంగా నగరపు పిల్లల్లో. ఒకనాడు సైకిళ్లను విస్తారంగా వాడిన పిల్లలు, ఈ రోజున మోటారు వాహనాలమీద అంతగా ఆధారపడాల్సి వస్తోంది. అట్లా బడికి నడవని పిల్లలు, నడవలేని పిల్లలు ఎక్కువౌతున్నారు మరి!

ఇక, 'పాఠాలు వినటం'లోంచి "పాఠాలు చూడటం"లోకి కూడా మనం గబగబా దూసుకెళ్తున్నాం. సాంకేతికతను ఉపయోగించుకోవటంలో భాగంగా వస్తున్న యీ (e)సంస్కృతి - పిల్లల్ని 'వినటం' నుండి 'మల్టీమీడియా'ని అనుభవించటంలోకి మోపుగానే మోసుకెళ్తోంది. రానురాను, పాఠాలు వినాల్సిన అవసరం తగ్గేకొద్దీ, 'పాఠాలు వినే శక్తీ' సన్నగిల్లుతుందేమో, పిల్లల్లో. ఇక పద్యాలు అప్పచెప్పటం కూడా తగ్గిపోతోంది. 'అప్పచెప్పటం' అనే 'కళ' పట్ల కొందరికి అనురాగమూ, మరికొందరికి ఏహ్యభావమూ అయితే చాలానే ఉంటుంది గానీ, పద్యాలపట్ల మటుకు ద్వేషం- ఎందుకో, అందరిలోనూ బాగా ఎక్కువైంది. వెరసి,'చిన్నపద్యం అప్పజెప్పలేక పోవటం' సాధారణమవుతోంది.

అట్లా మనమంతా త్వరలో 'రాజరాజుబిడ్డలం' అయిపోయే ప్రమాదం తలెత్తుతోంది. దీన్నించి తప్పించుకోవాలంటే వేరే మార్గంలేదు - వీలైనంత త్వరగా పుస్తకమహారాజుకు తిరిగి పట్టం కట్టెయ్యాల్సిందే!

అందరం బాగా చదవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. అన్నింటినీ తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, నేర్చుకుంటూ పోవాలి. రాజ రాజు బిడ్డలం కాకూడదు మరి!