అది ఒక స్వతంత్ర దేశం. ఆ దేశంలో చాలా రాష్ట్ర్రాలు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్ర్రం- మిగతావాటిలాగే అది కూడా అవినీతితో నిండిపోయి ఉన్నది. ఆ రాష్ట్ర్రంలో ఒక అమాయకుడు ఉండేవాడు.

అన్ని రాష్ట్రాలలో లాగే ఆ రాష్ట్ర్రంలో కూడా కరెంటు కోత ఉండేది. ఒకసారి ఆ కోత మరీ ఎక్కువైంది. దాంతో ఆ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశాడు. విద్యుత్తును పొదుపు చేసేందుకు, కరెంటు కోతకు తట్టుకునేందుకు రాష్ట్ర్రంలోని ప్రజలందరూ రాత్రి వేళల్లో కిటికీలు తెరిచి పడుకోవాలని ఆ ప్రకటన సారాంశం.

దాన్ని విన్న అమాయకుడు నిజంగానే కిటికీలు తెరిచి పడుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక దోమ అతన్ని కుట్టింది. మళ్ళీ ఒక దోమ. తర్వాత ఒక దోమ. అలా ఓ రెండు వారాలయ్యేసరికల్లా అతనికి మలేరియా వచ్చి మంచాన పడ్డాడు.

'అసలు తనకొచ్చింది నిజంగానే మలేరియానా, కాదా?' అని, 'పరీక్ష చేయించుకుంటే నయం' అనుకున్నాడు అమాయకుడు. పరీక్ష కోసం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు.

కరెంటు లేకపోవడం వల్ల ఆసుపత్రి అంతా కటిక చీకటిగా ఉంది. ఇంతలో కొంతమంది డాక్టర్లు టార్చ్ లైట్లు పట్టుకొని వస్తున్నారు. మన వాడిని చూడగానే వాళ్ళూ కంగారు పడిపోయారు. వాళ్ళలో కొందరు టార్చిలైట్లను నేరుగా వాడి కళ్ళలోకే వేసి మెరిపించటం మొదలు పెట్టారు. దానికి తట్టుకోలేక, కొంత సేపటికి మనవాడు కళ్ళు తిరిగి పడిపోయాడు.

అక్కడ ఉన్న నర్సులకు వాడిని చూస్తే జాలి వేసింది. 'ఇక్కడి కంటే ప్రైవేటు ఆస్పత్రి అయితే నయం' అని వాళ్ళు 911 అంబులెన్సుకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన 911 వాళ్ళు మెల్లగా చెప్పారు: "బండ్లలో డీజిల్ లేదు. మీరు మాట్లాడుతున్న ఈ ఫోను పనిచేసేందుకు కరెంటు లేకపోతే జనరేటర్ ఆన్ చేశాం. అప్పుడింక జనరేటర్లో డీజిల్ అయిపోయింది. దానికోసం బళ్ళలో డీజిల్ వాడుతున్నాం. ఇంక రెండేళ్ళవరకూ కరెంటు సరిగ్గా ఉండదు; కాబట్టి రెండు సంవత్సరాల దాకా బండ్లూ కదలవు" అని.

చేసేదేమీ లేక నర్సులు అమాయకుడిని వాడి మానాన వాడిని వదిలేశారు. కొంత సేపటికి తేరుకున్నాక కూడా‌ వాడికి కళ్ళు సరిగ్గా కనిపించలేదు- అంతటా చీకటి అలుముకొని ఉన్నది కద, అందుకని!

మన వాడికేమో చీకట్లో పడుకునే అలవాటు లేదు. దాంతో వాడు గోడలు తడుముకుంటూనే పోయి పోయి, ఎక్కడో చిన్న దీపపు వెలుగు కనిపిస్తే ఆ గదిలోకి పోయి పడుకున్నాడు. వాడికేం తెలుసు, అది ఆపరేషన్ థియేటర్ అని? తెల్లవారు జామున వచ్చిన డాక్టర్లు వాడు ఇంకా నిద్రలేవకుండానే వాడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేశారు. మత్తు దిగిన తర్వాత అమాయకుడు 'కుయ్యో మొర్రో' అని ఎంత మొత్తుంకుంటే మటుకు ఏం ప్రయోజనం?

అందుకని, మనం అందరం విద్యుత్తును పొదుపు చేయాలంటే చెయ్యాలి గానీ, ఊరికే తలుపులు తెరుచుకొని పడుకోకూడదు; దోమల చేత కుట్టించుకోకూడదు.