అది ఒక రహదారి. దాని పక్కనే ఓ బాటసారుల హోటల్. రాత్రి సమయం కావడంతో బాగా రద్దీగా ఉంది. చాలా మంది ప్రయాణికులు విశ్రాంతి కోసం అక్కడ ఆగి ఉన్నారు. కొంతమంది పొయ్యి దగ్గర కూర్చుని చలి కాగుతూ సేద దీర్చుకుంటుంటే, మరి కొంతమంది నిద్రకు ఉపక్రమించారు.

ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ ప్రయాణికుడు లేచి " నా సంచిలోని డబ్బు పోయింది.." అని తోటివారిని అందరినీ కంగారు పెడుతున్నాడు.

అంతవరకూ ప్రశాంతంగా ఉన్న హోటల్లో‌ క్షణాల్లో గందరగోళం చెలరేగింది. పక్కగదిలోంచి లేచి వచ్చిన ఓ ముసలాయన "ఏమైందీ? ఏంటీ, ఈ గోల?" అంటూ ఆరా తీసాడు.

"అతని డబ్బుని ఎవరో దొంగిలించారట!" అక్కడున్న వాళ్ళు వివరించారు.

అది విన్న ఆ వృద్ధుడు అందరివంకా ఓ సారి తేరిపార చూసాడు. కొంచెంసేపు ఆలోచించి "దొంగని పట్టుకునే ఉపాయం నేను చెబుతాను. అయితే ముందుగా నాకు ఓ కోడిపుంజు కావాలి..." అని అడిగాడు.

వెంటనే అక్కడున్నవాళ్ళు అటూ ఇటూ వెతుకులాడారు. ఎట్టకేలకు ఓ గంప కింద వున్న కోడిపుంజుని తెచ్చియిచ్చారు.

"అలాగే ఆ పొయ్యి దగ్గరున్న కుండను కూడా నా దగ్గరకు తెండి" అడిగాడు ముసలాయన. ఎవరో దాన్ని కూడా తెచ్చి యిచ్చారు.

అక్కడున్నవాళ్లంతా ముసలాయన చుట్టూ మూగారు. ఆయన అందరినీ నిశితంగా పరిశీలిస్తూ అన్నాడు- "జాగ్రత్తగా వినండి! నేనిప్పుడు కోడిపుంజుపైన ఈ కుండను బోర్లించి, ఓ మంత్రం జపిస్తాను. తరవాత ఇక్కడున్న లైట్లన్నీ ఆర్పివేయబడతాయి. ఆ చీకట్లో మీరంతా ఒక్కరొక్కరుగా రావాలి. వచ్చి, ఈ కుండపైన మీ రెండు చేతులతోటీ రుద్దాలి. దొంగతనం చేసినవాడు ఈ కుండను రుద్దగానే మరుక్షణం కుండ కింద ఉన్న కోడి కూస్తుంది. దొంగ దొరికిపోతాడు!" అని.

అందరూ ఆశ్చర్యపోయారు. కోడిపుంజుకి అంత శక్తి ఉంటుందంటే కొందరు నమ్మలేకపోయారు. ఏమవుతుందో చూద్దామని కొందరు అనుకున్నారు. మొత్తంమీద అందరూ 'సరే'నని తలాడించారు.

ముసలాయన కోడిపుంజుపైన కుండని బోర్లించాడు. లైట్లని ఆర్పేయమన్నాడు. చివరకు పొయ్యిలో‌ వెలుగుతున్న నిప్పుని కూడా ఆర్పేయించాడు. ఆ రోజు అమావాస్యకూడా అయిఉంటుంది; అంతటా చీకటి అలముకొంది. ఆ చీకట్లోనే, ఒక్కొక్కరూ తడుముకుంటూ వచ్చి, ముసలాయన చెప్పినట్లుగా కుండని చేతులతో రుద్దసాగారు.

కోడి మాత్రం కూయలేదు!

కొంతసేపటికి ముసలాయన అడిగాడు- "ఏదీ, ఇంకా అవ్వలేదా? అంతా నేను చెప్పినట్లుగా చేసారా, లేక ఇంకా ఎవరైనా మిగిలి వున్నారా?!" అని.

అందరూ కుండని రుద్దినవాళ్ళే! దాంతో ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చుతూ "అయితే నాదే పొరపాటు.. ఇక లైట్లన్నీ వేయండి. కాండిల్స్ కూడా వెలిగించండి!" అన్నాడు.

లైట్లు వెలిగాయి. అక్కడ ఉన్న వాళ్లందరినీ వచ్చి తన చుట్టూ నిలబడమన్నాడు ముసలాయన.

"ఏవీ? మీ చేతులొకసారి చూపించండి..." అంటూ ముసలివాడు అందరి చేతులూ పరిశీలించాడు- కానీ అందరి చేతులూ నల్లబడే ఉన్నాయి! ముసలాయన ముఖం లో విచారం. ఆయన గొంతు సవరించుకొని ఇంకా ఏదో అనబోతున్నాడు- అంతలోనే అక్కడ ఉన్న రాము లేచి నిలబడి అరిచాడు: "నేను ఈ సంగతి ముందే ఊహించాను- తాతా, తెలివిగా తప్పించుకుందామని, పైపెచ్చు కోడిని కూడా కొట్టేద్దామని చూశావు కదూ, నేను అంతా చూస్తూనే ఉన్నాను. మర్యాదగా నువ్వు తీసిన డబ్బుని అక్కడ పెట్టేస్తావా, లేకపోతే సోదా చేయించమంటావా?!"  అని.

దాంతో‌ ముసలాయన ముఖం నల్లబడింది.

చుట్టూ ఉన్నవాళ్ళు సోదా జరిపితే పోయిన డబ్బు ముసలివాడి దగ్గరే దొరికింది!

అందరూ రాముని అభినందించారు. డబ్బు దొరికిన మామయ్య అయితే రాముకి బహుమతిగా పది రూపాయలు ఇచ్చాడు!

రాము వాళ్ళ అమ్మ వాడికేసి మురిపెంగా చూస్తూ- "నిజంగానే నువ్వు తాత దొంగతనం చేయటం చూశావారా, నీకు అంత గమనించే శక్తి ఉందని నేనెప్పుడూ అనుకోలేదే, ఎప్పుడూ ఏదో కథల లోకంలో ఉంటావుగా?!" అన్నది.

"లేదమ్మా, దొంగను పట్టుకునే ఈ కథ అసలు పిల్లలందరం ముందు ఏనాడో చదివిందే కదా! చేతికి మసి అంటకపోవటం చూసిన మర్యాద రామన్న ఏనాడో పట్టుకోలేదూ, దొంగని?! 'అంత పాత ట్రిక్కును మళ్ళీ ఈయన ఎందుకు ప్లే చేస్తున్నాడు?' అని జాగ్రత్తగా చూశాను; చూస్తే మరి అందరి చేతులకూ మసి అంటుకునే ఉంది; మసి అంటని చేతులు ఆ తాతవే! అట్లా నాకు మళ్ళీ అనుమానం వచ్చింది. అయినా అనుమానం తీర్చుకునే దారి దొరకలేదు. ఏం చెయ్యాలి?

దొంగను పట్టుకునేందుకు "నేను అంతా చూశాను.." అని ఊరికే బుకాయించానంతే! నిజం దొంగను పట్టుకోవాలంటే బుకాయింపే మార్గం మరి!" అన్నాడు రాము నవ్వుతూ.