అది అశోకవనం. అంతమంది రాక్షసుల మధ్య ఒంటరిగా కూర్చొని దు:ఖిస్తూ ఉన్నది సీత. 'రాముడు వస్తాడో, రాడో?! తను ఇక్కడ ఉన్నదన్న సంగతి రాముడికి తెలుసో, మరి ఇంకా తెలియలేదో?! ఆ సంగతి రాముడికి చేరవేసే మార్గం కూడా ఏదీ చిక్కటం లేదు..' రావణుడి దౌర్జన్యం కారణంగా అశోకవనంలో‌బందీ అయిన సీత మనసు పంజరంలో చిలకలాగా పరితపిస్తున్నది.

రావణుడు రోజూ ఉదయాన్నే అశోకవనానికి వస్తున్నాడు. తన గురించీ, తన పరాక్రమం గురించీ చెప్తున్నాడు. తన బలం-బలగం ఎంత గొప్పవో వివరిస్తున్నాడు. 'ఎన్నాళ్ళు ఎదురుచూసినా రాముడు రాడు, రాలేడు' అని వికటంగా చెప్తున్నాడు. 'బెట్టు చాలించు-నా మాట విను' అని ఒత్తిడి చేస్తున్నాడు.

పంటి బిగువున ఈ రంపపుకోతని భరిస్తోంది సీత. 'ఈ లంకనుండి తప్పించుకునే మార్గం లేదు. వీళ్ళనందరినీ- ఈ రాక్షస బలాన్నంతటినీ ఎదిరించలేనని సీతకీ తెలుసు. తను ఒంటరిది- వీళ్ళు తనని ఏంచేసినా ఎదురాడలేదు-

"నువ్వేమీ చెయ్యలేవు! నాకు లొంగిపోవటం ఒక్కటే నీకు మార్గం! ఆలోచించుకో! ఇవాళ్ళ కాకపోతే రేపైనా నువ్వు నాదారికి రావల్సిందే!" గట్టిగా బెదిరిస్తూ చెబుతున్నాడు రావణుడు.

ఆ కారు చీకట్లో ఆశాకిరణం ఒక్కటి కూడా కనిపించట్లేదు. అయినా- గుండెల్లో దు:ఖం గూడు కట్టుకున్నా- 'తను ఒంటరిది' అనే ఆలోచనే వేధిస్తున్నా- సీత కోల్పోనిది ఒక్కటే- గుండె నిబ్బరం!

చెడునీ, దౌర్జన్యాన్నీ వ్యతిరేకించే స్పష్టమైన చూపు ఆమెకుంది. ఇవాళ్ళ కాకపోతే రేపైనా- 'మంచి' అన్నది ఏదో ఒకనాటికి- తప్పక బలం పుంజుకుంటుంది- ఈ దౌర్జన్యానికి జవాబు చెబుతుంది' అనే నిబ్బరం ఒక్కటే సీతను బ్రతికిస్తున్నది.

తను బయటపడే మార్గం లేదనీ, ఈ రావణ బలం ముందు తాను నిలబడలేదనీ తెల్సినా, సీత, రెండో ఆలోచనే లేకుండా రావణుణ్ణి బలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. రావణుణ్ణి ఛీ కొట్టింది; అసహ్యించుకున్నది; తిట్టింది-

"నీకు బలం ఉండచ్చు; బలగమూ ఉండచ్చు. గతంలో నీకు, నీవాళ్లకి రాముడు చాలానే నష్టం కలిగించి ఉండచ్చు- అయినా, నన్ను బంధించి, వేధించేనీ ధోరణి మాత్రం అన్యాయమైంది. అన్యాయం ఎప్పుడూ గెలవదు. ఒక్కోసారి అది గెలిచినట్లు అనిపించినా, మరు క్షణంలోనే పతనం అయి తీరుతుంది. నీ దౌర్జన్యం ఏనాటికీ నా మనసు మార్చలేదు. నా నిబ్బరానికి తూట్లు పొడిచే శక్తి నీకు లేదుగాక లేదు- గుర్తుంచుకో.." అంటూ తన కొండంత మనోబలం ముందు రావణుడు గడ్డి పరక కన్నాహీనమని నిరూపించింది సీత.

తర్వాత నిజంగానే ఆమె నిబ్బరం గెలిచింది. రావణాసురుడు ఆమెను ఏమీ చెయ్యలేక పోయాడు. తనే అంతం అయ్యాడు!