అనగా అనగా ఒక అడవిలో‌ఒక కుందేలు, ఒక ఎలుక ఉండేవి. అవి రెండూ చాలా మంచి స్నేహితులు. కుందేలు ఒక చిట్టి పొదలో ఉండేది; ఎలుక ఆ పొద క్రిందుగానే ఓ బొరియలో నివసించేది.



ఒక రోజు అవి రెండూ నడచుకుంటూ పోతున్నాయి. దారిలో వాటికి ఒక పులి కనిపించింది. దాన్ని చూడగానే అవి రెండూ చాలా భయపడ్డాయి. కానీ చూస్తే, పులి కదిలేందుకు లేదు; మెదిలేందుకు లేదు. వేటగాడు జంతువుల్ని పట్టుకోవటం కోసం పరచిన వలలో
చిక్కుకొని ఉన్నది అది.




కుందేలు, ఎలుక దాన్ని చూసి "అయ్యో పాపం" అనుకున్నాయి. ఇంతకీ పులిని పట్టుకొని పోయి ఏంచేస్తాడు ఈ వేటగాడు?" అడిగింది ఎలుక, కుందేలును.

"పులిని సర్కసు వాళ్లకు అమ్మేస్తాడు. వాళ్ళు దాన్ని బాగా ఏడిపించి, డాన్సు చేయటం, మంటల్లోంచి దూకటం- ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు. అటుపైన వాళ్ల ప్రదర్శనల్లో ఎలా చెబితే అలా చెయ్యాలి ఇది" వివరించింది కుందేలు. "మాఅమ్మ ఇదివరకు సర్కసులోనే ఉండేది. నేను ఎలాగో అక్కడినుండి తప్పించుకు వచ్చాను గానీ" అని చెప్పింది విచారంగా.

"మరయితే దీన్ని విడిపించమంటావా, నా పళ్ళు బలే పదునుగా ఉంటాయి కదా, కావాలంటే వలను కొరికెయ్యగలను నేను" అన్నది ఎలుక.

"అమ్మో! ఇంకా నయం, పోయి సింహాన్నే కొరుకుతాననలేదు. దగ్గరకు వెళ్తే ఈ పులి కాస్తా నిన్ను గుటుక్కున మింగేస్తుంది జాగ్రత్త, ఏమనుకుంటున్నావో ఏమో" అంది కుందేలు.

"నేనేమీ అనను. నన్ను విడిపించు ప్లీజ్! నాకు సర్కసులో పనిచేయాలని అస్సలు లేదు!" అన్నది పులి, వలలోనే గింజుకుంటూ. అంతలోనే ఒక నక్క పొదచాటు నుండి ఎలా వచ్చిందో వచ్చింది. తటాలున కుందేలు మీదికి దూకింది. కుందేలు భయంతో గజగజా వణుకుతూ పొద చుట్టూ పరుగెత్తటం మొదలు పెట్టింది. నక్క దాని వెంట పడింది "ఆగవే, నానుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను..ఎక్కడికెళ్ళినా నానుండి తప్పించుకోలేవు" అంటూ.




అట్లా కుందేలు పొదకు ప్రదక్షిణలు చేస్తుంటే చూసిన ఎలుకకు ఒక ఉపాయం తట్టింది. గబ గబా పోయి పులి చిక్కుకున్న వలను పళ్ళతో కొరికి ముక్కలు చేసేసింది.






వలలోంచి బయట పడిన పులి సంతోషంగా గాండ్రిస్తూ నక్క మీదికి దూకింది. పులిని చూసి భయపడిన నక్క, కుందేలు సంగతి మర్చిపోయి ఎటో పరుగెత్తింది.





మరుక్షణం ఎలుక బొరియలోకి దూరింది; కుందేలు పొదలోకి పారిపోయింది; పోబోయిన ప్రాణాలు దక్కాయన్న సంతోషంతో పులి తన గుహకేసి పరుగు పెట్టింది!