"పిల్లలు లేని ఇల్లు పిశాచాల ఇంటితో సమానం. ఆ యింట్లోవి ఏవీ తినకూడదు, తాగకూడదు. అసలు వాళ్ళ ఇంటికే వెళ్లకూడదు" ముఖం చిట్లిస్తూ చెప్పారు గురువుగారు, గురునాధం.

"అంటే పిల్లలు పుట్టని దంపతులు పిశాచాలా?" అడిగాడు శిష్యుడు అభిరాముడు ఆశ్చర్యంగా.

"మరి?! ఎంత పాపం చేసుకుంటే అట్లా అవుతుంది! 'పిల్లలు పుట్టలేదు' అంటే 'మహా పాపి' అని అర్థం" చెప్పారు గురువుగారు. అప్పటి నుంచి ఆ ఇంటికి భిక్షకు వెళ్లటం మానివేశాడు అభిరాముడు. ఆ సందులోకి వెళ్ళినా, ఆ ఇంటికి ఇరువైపులా ఉన్న ఇళ్ళలో అడుక్కునేవాడు కాని, ఆ ఇంట్లో మటుకు అడిగేవాడు కాదు.

కొన్నాళ్లకు ఆ ఇంటి ఇల్లాలు అనసూయ ఈ సంగతిని గుర్తించింది. ఒకసారి పక్కింటిముందు నిలబడి భిక్షాం దేహీ' అని అభిరాముడు అరవగానేఅనసూయమ్మ తన పళ్ళెంలో ఆహారం తీసుకొని బయటికి వచ్చింది. 'ఇదిగో భిక్ష- తీసుకోండి' అంది.

'వద్దు-వద్దు. నేను మిమ్మల్ని అడగలేదు' అన్నాడు అభిరాముడు. 'అడక్కపోయినా ఇస్తున్నాననుకో- నేను ఇచ్చేదాన్ని, నువ్వు పుచ్చుకునేవాడివి' అంది అనసూయమ్మ, కావాలని. 'కాదులెండి, ఇంకెవరికన్నా ఇవ్వండి' అన్నాడు అభిరాముడు నీళ్లు నములుతూ. 'ఏం, మీ భిక్షాపాత్రేమీ‌ నిండుగా లేదుగా?" అడిగింది అనసూయమ్మ ఖాళీ పాత్ర కేసి చూస్తూ.

'అయినా మీరిచ్చే భిక్ష తీసుకోవద్దన్నారు మా గురువుగారు' అన్నాడు అభిరాముడు, ఇంక తప్పదన్నట్లు. 'అదేం, పాపం?' ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

'పిల్లా పాపలు లేని ఇంట్లో ఏమీ స్వీకరించకూడదు. వాళ్ళు మహా పాపులని శాస్త్రం చెబుతున్నది' చెప్పేశాడు అభిరాముడు, నిబ్బరంగా.

'ఓహో! సరే స్వామీ!‌మేమంటే పాపం చేశాం కాబట్టి పిల్లాపాపలు కలగలేదు; మరి మీరు ఏం పాపం చేసుకున్నారని, ఇట్లా వీధి వీధినా అడుక్కుంటున్నారు? ఉండటానికో ఇల్లు లేదు; తినటానికి తిండి లేదు; నాన్నా అని పిలిచే పిల్లలు లేరు- అంటే మాకంటే ఘోర పాపం

చేసుకున్నట్లే కదా. అట్లాంటి పాపులకు భిక్ష పెట్టి మేము ఎంత పాపులం అవుతున్నామో మరి!' అడిగేసింది అనసూయమ్మ గట్టిగా. అభిరాముడికి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే లెంపలు వేసుకొని భిక్ష స్వీకరించాడు.