యశ్వంత్, మీనాక్షి, ప్రవీణ్ ముగ్గురూ చాలా మంచి స్నేహితులు. బళ్ళో ఏ అవసరం వచ్చినా వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు; ఇతరులకు కూడా సహాయపడే వాళ్ళు.
ఒక రోజున యశ్వంత్ కు ఒక సందేహం వచ్చింది. ఏమంటే - 'ఇప్పుడు మేము ముగ్గురం మంచి స్నేహితులం కదా. అయితే మా ఈ బడిలో చదువులు అయిపోయాక మేం అందరం విడిపోతాం కదా, ఆ తరువాత మాతో ఎవరు స్నేహం చేస్తారు? అప్పుడు మేము ఒంటరి వాళ్ళం అయిపోతాం కదా? ఎలాగ?' అని. ఈ ఆలోచన వచ్చేసరికి వాడు విచారంగా అయిపోయాడు.
అప్పుడు మీనాక్షి, ప్రవీణ్ వచ్చి "ఎందుకురా యశ్వంత్, ఎందుకు, అలా ఉన్నావు?" అని అడిగారు.
"ఏమీ లేదు; ఈ బళ్ళో మన చదువు అయిపోయినాక ఇక మనందరం విడిపోతాం కదా, అప్పుడు మనతో ఎవరు స్నేహం చేస్తారు?" అడిగాడు యశ్వంత్.

"అవును కదా, మనతో ఎవరు స్నేహం చేస్తారు?" అని ముగ్గురూ ఆలోచిస్తూ విచారంగా ఉండిపోయారు.
అప్పుడు మాష్టారు వచ్చి, వాళ్ళను "ఎందుకలా ఉన్నారు?" అని అడిగాడు. వాళ్ల ఆలోచన విని, ఆయన నవ్వి- "అయ్యో పిచ్చి పిల్లల్లారా, మీరు వేరే స్కూలుకు మారితే మీకు ఎవరో ఒకరు పరిచయం అవుతారు కదా, వాళ్ళు మీకు స్నేహితులౌతారు! లేకుంటే మీరు ముగ్గురూ విడిపోయాక ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే ఉంటారు కదా, ఇంక దిగులేముంది?" అన్నారు. "అవును కదా!" అని వీళ్ళంతా సంతోషించారు.
ఆరోజు రాత్రి మీనాక్షికి ఒక కల వచ్చింది. ఆ కలలో మీనాక్షి, యశ్వంత్, ప్రవీణ్‌లు ముగ్గుర్నీ ఒక రాక్షసుడు ఎత్తుకొని పోయి చిత్ర హింసలు పెడుతున్నాడు. అప్పుడు వాళ్లు చదువుతున్న మూడు బడులనుండీ చాలా మంది పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి, రాక్షసుడితో పోరాడి, వీళ్ళు ముగ్గుర్నీ రక్షించారు!
మీనాక్షికి చాలా సంతోషమేసింది- తమకు కొత్త బడులలో చాలా మంది మిత్రులు దొరుకబోతున్నందుకు.
ఆ పాపకు వచ్చిన కల విని బడిలో చిన్న పిల్లలందరికీ కూడా చాలా సంతోషం వేసింది. "మీకేమైనా అయితే మా బళ్ళో పిల్లలం కూడా అందరం వచ్చి కాపాడతాంలే, మీకుండేది నాలుగు బడుల మిత్రులు!" అన్నారు వాళ్ళు!