కాకినాడ టౌన్ లో ఉంటారు కమలాకర్, అతని భార్య రమ, వాళ్ల ఆరేళ్ళ కొడుకు అనిల్.
కమలాకర్ సొంత ఊరు గేదెల్లంక. అక్కడ, పల్లెలో ఉండేవాళ్ళు వాళ్ల అమ్మా నాన్నలు. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ వాళ్ల ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పల్లెలో వైద్య సౌకర్యాలు, అవీ సరిగా లేవని, తల్లితండ్రులను కూడా కాకినాడలోని తన ఇంటికే వచ్చేయమన్నాడు కమలాకర్.
వేళకు మందులు వేసుకోవడం వల్ల, చిన్నారి మనవడి కబుర్లతో కాలక్షేపం అవ్వటంవల్ల పెద్ద వాళ్ళిద్దరి ఆరోగ్యం బాగా మెరుగయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే గడిచాయి. అయితే క్రమేణా రమకు ప్రశాంతత తగ్గసాగింది. కోడలికి అత్తమామలు అడ్డుగా అనిపించసాగారు. పట్నంలో గొప్పగా బ్రతికే తమ తోటివాళ్ళకు ముతక మనుషుల్లా ఉన్న అత్త మామలను పరిచయం చేయటం ఇబ్బందిగా అనిపించ సాగింది.
అందుకని కమలాకర్, రమ మాట్లాడుకొని ముసలివాళ్ళిద్దరినీ ఊరు చివరన ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించారు. అప్పటి దాకా తమతో ఉంటూ, తనకు ఎన్నో కథలు, కబుర్లు చెప్పే తాతయ్య-మామ్మ దగ్గరగా లేక పోవడం చిన్నారి అనిల్‌కి చాలా బెంగగా అనిపించింది. సెలవప్పుడు, సాయంత్రం పూట ఒక్కసారి మటుకు తనని బామ్మ-తాతయ్యల దగ్గరకి తీసుకుని వెళ్తున్నారిప్పుడు. వాడు చూసి చూసి- "అమ్మా! తాతయ్య వాళ్ళు ఇప్పుడు మనతో ఎందుకు రారు?" అని అడిగేశాడు తల్లిని.
తల్లికి ఏం చెప్పాలో తోచలేదు- "పెద్ద వారు కదా, వాళ్ళకి అక్కడే హాయిగా, సుఖంగా ఉంటుందిరా, కన్నా" అని సమాధానం చెప్పింది.
చూస్తుండగా కొన్ని నెలలు గడిచాయి.
ఒక రోజు పిల్లాడిని తీసుకుని భార్యా భర్తలు ఇద్దరూ సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ తమ చిన్నారి కొడుకు కట్టుకునే ఇసక గూళ్ళని చూసి దంపతులు ఇద్దరూ మురిసి పోసాగారు.

చిన్నారి కొడుకు తన ఇసుక గూళ్ళలోని ఒక్కొక్క గదినీ గర్వంగా చూపిస్తున్నాడు- 'ఇది నాది, ఇది వాళ్ళది, వీళ్ళది'అని. రమ వాడిని అడిగింది మురిపెంగా- "ఏరా, మరి మా గది ఏదిరా?" అని. "అవునవును- మా గది ఏదిరా?" అడిగాడు కమలాకర్.
"మరి మీరు ముసలిగా అవుతారు కదా, అప్పుడు తాత మామ్మల్లాగ మీకు కూడా వృద్ధాశ్రమమే బాగుంటుంది కదా! మా ఇంట్లో మీకు గది ఉండదు" టక్కున సమాధానం చెప్పాడు అనిల్. రమకు ఈ మాట చెంప దెబ్బలా అనిపించింది. కమలాక ర్రావుకు తను చేసిన తప్పు ఏమిటో తెలిసింది.
మరుసటి రోజు ఉదయాన్నే "తాతయ్యకు, మామ్మకు అక్కడ బాగోలేదటరా, కన్నా. నువ్వు లేక, వాళ్ళకి అక్కడ అస్సలు తోచటల్లేదుట. అందుకని మనం మన తాతయ్యని, మామ్మని మన ఇంటికే తెచ్చుకుందాం" అంటూ వాహనాన్ని బయటకు తీసాడు కమలాకర్.