అనంతపురం జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "తిమ్మమ్మ మర్రిమాను"కు ఆమడ దూరంలో ఉంది- "పాలేగాళ్ళ కాలం" నాటి "కొక్కంటి" సంస్థానపు పురాతన కోట. ఆ కోటలో నిధులున్నాయని అందరూ అనుకుంటూ‌ ఉంటారు. నిధుల కోసం ఎవరెవరో ఎక్కడెక్కడో త్రవ్వకాలు జరుపుతూనే ఉంటారు ఈనాటికీ.
అదే ఊరిలో ఉన్నాడు పెదకోమటి శేషయ్య. ఆయన, ఆయన భార్య ప్రమీల వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరూ పేరొందిన ఆశపోతులు! తమకు లాభం ఉండదంటే ఎవ్వరికీ ఒక్క మెతుకు కూడా వేసి ఎరుగరు.
మెడలో రుద్రాక్షలు, చేతిలో కమండలం, కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు ఒకడు జడలు కట్టిన తలతో సాగిపోతున్నాడు కొక్కంటి పురవీధుల్లో. 'ఎవరినీ బిక్షం అడగడు. తనకు తోచిన ఇంటి ముందు ఆగి భిక్షం స్వీకరిస్తాడు. ఆయన భిక్ష స్వీకరించిన వాళ్లకు ఇక పండగే పండగ' అని పుకారు ఆయనకంటే ముందుగా అందరినీ చేరుకుంటున్నది. శేషయ్య-ప్రమీల దంపతుల నూ చేరింది ఈ విషయం. 'సాధువు ఈ దారిన ఎప్పుడు వస్తాడా, మా ఇంటి గడప ఎప్పుడు తొక్కుతాడా' అని వేచి చూస్తున్నారు వాళ్ళిద్దరూ. ఆ శుభ ఘడియ రానే వచ్చింది- సాధువు నేరుగా వాళ్ళ ఇంటికే వచ్చాడు- 'రండి స్వామీ' ఆహ్వానించాడు శేషయ్య.
సాధువు శేషయ్య ఇంటిని పరీక్షగా‌చూసాడు. కొంత సేపటికి - 'నా వాక్కు బ్రహ్మ వాక్కు. నేను ఉమ్మేస్తే గడ్డి భగ్గున మండి పోతుంది. నా మాటకు తిరుగు లేదు. నీకు ధనయోగం ఉంది! తాతగార్లు దాచిన ముల్లెలు నీ ఇంట్లోనే మూలుగుతున్నాయి. వాటిని తీసి ఇస్తాను. ధనవంతుడవు కమ్మురా, పెద్ద కోమటీ!' గంభీరంగా పలికాడు సాధువు.
శేషయ్య దంపతులు నిశ్చేష్టులయ్యారు. 'నా మీదే శంకగా ఉందిరా మీకు? చూడరా నా మహిమ!' అంటూ గేదె ముందు వేసి ఉంచిన ఎండు గడ్డి మీద ఉమ్మేసి, కొంత సేపు ఏవేవో మంత్రాలు చదివాడు స్వామి.

అంతే- వరి గడ్డి భగ్గుమని మండింది! క్షణాల్లో ఆ మంటలు వ్యాపించటం మొదలు పెట్టాయి! భయంతో గేదె తాడు తెంపుకుని పారిపోయింది. "చూసితివిగా, ఇంకా శంకిస్తావురా?!" తీక్షణంగా చూశాడు సాధువు.
"క్షమించండి స్వామీ!" అంటూ కాళ్ళ మీద పడ్డారు దంపతులిద్దరూ.
క్షమించినట్లు వాళ్ళను లేవదీసాడు సాధువు. "పూజకు సిద్ధం‌ చెయ్యరా! ధనం ఎక్కడుందో చూపుతాను!" అంటూ అక్కడే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చున్నాడు.
తర్వాతి అరగంటలో నట్టింట ముగ్గు వెలసింది- నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో సహా. తన బ్యాగులో నుండి "మాయా దర్పిణి" తీశాడు స్వామి. నల్లటి పదార్థం ఏదో‌ పూసిన అద్దంలాగా ఉంది అది. దానిలోకి చూస్తూ, కొద్ది సేపు "ఓం! భీం! హ్రీం! జై మహంకాళి! రక్ష రక్ష!" అని అరిచి, "కనిపించిందిరా, ధనం! పెద్ద రాగి బిందెలో దాచినారురా!" అన్నాడు సాధువు సంతోషంగా. "ఎక్కడ స్వామీ?" ఆతృతగా అడిగాడు శేషయ్య.
"చూడరా, కోట గోడ తూరుపు దిక్కున వున్న చిన్న సత్రంలోని నంది విగ్రహం క్రింద! అది నీదేరా, పెద కోమటి! దాన్ని తీసి నీకు ఇస్తానురా! నీవు ఇక ఐశ్వరవంతుడివిరా!" అన్నాడు సాధువు నవ్వుతూ.

"అంతా తమరి దయ. ఎప్పుడు తీస్తారు స్వామీ?" అడిగాడు శేషయ్య, ఆత్రంగా.
"వచ్చే అమావాస్య నాడు తీద్దాం. అంతా సిద్ధం చేసుకో!" అంటూ గబ గబ వెళ్ళిపోయాడు సాధువు.
శేషయ్య దంపతులు ఎదురు చూస్తున్న అమావాస్య రానే వచ్చింది. స్వామి కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి. రాత్రి పది గంటలకు, బలిష్ఠంగా ఉన్న శిష్యులు ఇద్దరిని వెంటబెట్టుకొని వచ్చాడు సాధువు. సాధువు పాదాలకు నమస్కరించాడు శేషయ్య. "స్వామీ- మరి వీళ్ళు?" అనుమానంగా అడిగాడు- శిష్యులను ఉద్దేశించి.
"వీళ్ళు మన వాళ్ళే. నమ్మకమైన శిష్యులు. ఇలాంటి కార్యాలు చేయడంలో దిట్టలు" పలికాడు సాధువు. "అంతా సిద్ధం చేశావుగా!" అని అడుగుతూ.
"సిద్ధమే" అని తలూపాడు శేషయ్య.
రాత్రి పన్నెండు గంటల సమయానికి సత్రం దగ్గరున్న నంది విగ్రహం దగ్గరికి చేరారు అందరూ. బుడ్డిదీపం వెలుగులో తవ్వకం మొదలైంది. తవ్వుతుంటే మన్ను మెత్తగా వస్తున్నది. "అదృష్టం పండిందిరా! సులువుగా త్రవ్వకం జరుగుతున్నది!" అన్నాడు సాధువు.
"అంతా తమరి దయ, నా భాగ్యం" అన్నాడు శేషయ్య సంతోషంగా.
రెండు అడుగుల లోతు తవ్విన తరువాత గునపం తగిలి 'ఠంగ్' అన్న శబ్దం వచ్చింది.
సాధువు, లేచి నిలబడి. అక్షింతలు తీసుకుని గోతిలో చల్లాడు. టెంకాయలు, పూలు, సమర్పించాడు శేషయ్య. "నిధి ఉన్న బిందె శబ్దంరా అది! చిన్నగా త్రవ్వకం చేయండి. ఇక చేతితో మట్టి తీయండిరా" ఆజ్ఞాపించాడు సాధువు.
శిష్యులు చేతులతో‌ మట్టిని తోడసాగారు. అంతలో మూసి ఉన్న ఓ రాగి బిందె మూతి కనిపించింది గుంత అడుగున !
"ఆగండి!‌ దానిని ముందుగా శేషయ్య చేతితో తీయాలి!" అన్నాడు సాధువు.
"అలాగే స్వామీ!" అంటూ తప్పుకున్నారు శిష్యులు.
శేషయ్య గోతిలోకి దిగి, బిందె మీద వున్న మట్టిని చేతితో ప్రక్కకు నెట్టేసి, బిందెను పైకి ఎత్తబోయాడు.
"బరువు ఎక్కువ ఉన్నది. సాయం పట్టండిరా" అన్నాడు సాధువు.
అందరూ తలా ఒక చెయీ వేసి బిందెను బయటికి తీసారు.
"చాలా ధనం ఉంది. దీనిని ఇంటికి తీసుకు పోదాం, పదండి" అంటూ ఇంటికి తీసుకెళ్ళారు.
లోపలి గదిలోకి వెళ్ళి లాంతరు దీపంలో చూశారు బిందెను. సీసంతో సీలు చేయబడిన బిందె అది. "దాని నిండా ధనం ఉన్నది. అందుకే బరువు ఎక్కువగా ఉంది" అన్నాడు సాధువు. "దీనిని పూజా గదిలో ఉంచి, వారం రోజులు "ధనలక్ష్మీ" పూజ చేయాలి. ఏమైనా తేడా వస్తే అంతా బొగ్గులు, రాళ్ళు అయిపోతాయి! జాగ్రత్త!" హెచ్చరించాడు సాధువు. "నాకు ప్రతిఫలంగా ఇప్పుడే కొంత బంగారం ఇవ్వండి. వారం రోజుల తరువాత నేను ఎక్కడ ఉంటానో ఏమో!" అని జోడిస్తూ.
"తమరి ఋణం ఉంచుకుంటామా, స్వామీ" అంటూ భార్య నగలు, తన నగలు తెచ్చి ఇచ్చాడు శేషయ్య.
"అంతేనా, మణుగు బంగారం తీసి ఇస్తే- ఇదా, నాకు దక్కేది?!" అన్నాడు సాధువు.
"మొత్తం 30 సవరాల నగలు ఇవి. వీటిని స్వీకరించండి స్వామీ, తరువాతనైనా, తమరి రుణం‌ ఉంచుకోం" అన్నాడు శేషయ్య.
"సరే"నంటూ ఆ నగలతో వెళ్ళిపోయాడు సాధువు.
వారం రోజులు ఒక యుగంలా గడిచింది శేషయ్య దంపతులకు. వారం కాగానే బిందెకు ఉన్న సీలును తెరిచారు. బిందెలో బంగారు లేదు, వజ్రాలు లేవు- నిండా బొగ్గులు, ఇనుప కడ్డీలు ఉన్నాయి!
గుండెలు బాదుకున్నారు దంపతులు. "పూజలో ఏదో లోపం జరిగి ఉంటుంది. అందుకే అవి అలా అయిపోయాయి" అన్నది ప్రమీలమ్మ.

"కాదు, కాదు! దీనిలో ఏదో మోసం ఉంది. వాళ్ళు నిజమైన స్వాముల్లా లేరు. మనకు మోసం జరిగిపోయింది" అంటూ ఏడ్వ సాగాడు శేషయ్య. "నా ముప్పై సవరాల బంగారం ఎత్తుకెళ్ళారు మోసగాళ్ళు" అని ఏడుపు లంకించుకుంది ప్రమీలమ్మ.
పక్కవాళ్ళు పరుగెత్తుకొని వచ్చారు. "పోలీసులకు ఫిర్యాదు చేయండి" అన్నారు.
S.I. గారితో జరిగిన సంగతి అంతా పూస గుచ్చినట్లు చెప్పాడు శేషయ్య- "సార్! నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. అతను ఉమ్మేస్తే గడ్డి మండుతుంది " అని.
"అదా, సంగతి. అది ఒక మ్యాజిక్. నేనూ చేయగలను" అన్నాడు S.I.రాథోడ్.
"మ్యాజిక్కా ?!" నోరు వెళ్లబెట్టాడు శేషయ్య. S.I.రాథోడ్ ఆఫీసునుండి ఓ సీసాని తెప్పించాడు. సీసాలో నీళ్ళలో మునిగి ఉన్నది, ఏదో‌ పసుపు పచ్చని పదార్థం. చెప్పాడు- "ఈ సీసాలో ఉన్నది చూడండి- ఇది భాస్వరం. దీనికి మండే స్వభావం ఉంది. నీళ్లలో ఉన్నంత సేపు ఏమీ అవదు. నీళ్లలోంచి నుండి బయటికి తీసిన తరువాత దీని మీద ఉన్న తేమ ఆరిన వెంటనే మండి పోతుంది" అన్నాడు.
కొంత భాస్వరం తీసి గడ్డి మీద వేసాడు. అది వేశాక కొంత సేపటికి ఆ గడ్డికాస్తా భగ్గున అంటుకుంది.
"వాడు నోటితోనే ఉమ్మి వేసాడు సార్!" అన్నాడు శేషయ్య.
"అదా నీ అనుమానం! ఇక చూడు!" అంటూ కొంత భాస్వరం తీసుకుని నోట్లో నాలుక కింద వేసుకున్నాడు S.I. "దీనిని మనకు కావలసిన వాటి మీద ఉమ్మేయాలి. దానిలోని తేమ ఆరిన తరువాత అది మండుతుంది!"
"మరి మనకు ప్రమాదం కాదా?" అడిగాడు శేషయ్య.
"నిజానికి భాస్వరం విషపదార్థమే. దీనిని మింగకూడదు. అయితే దీన్ని నాలుక క్రింది భాగంలో దాచుకొని, వీలైనంత త్వరగా ఉమ్మేసి నీళ్ళు పుక్కిలిస్తే మనకు ఏమీ అవ్వదు" చెప్పాడు S.I, దాన్ని మరోచోట ఉమ్మేసి మంటలు సృష్టిస్తూ.
"ఎంత మోసం జరిగి పోయింది" అంటూ మళ్ళీ ఏడ్చాడు శేషయ్య. "జీవితమంతా కష్టపడ్డాను సార్" అన్నాడు.
"వడ్డీ వ్యాపారంతో పేదలను పీడించావు. అందుకే నీకు తగిన శాస్తి జరిగింది" అన్నాడు S.I. "చూడు శేషయ్యా, పురాతన ఆలయాలను, కోటలను, విగ్రహాలను పాడు చేయడం పెద్ద నేరం. దీనికి నిన్ను జైలులో వేయాలి. కాని మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. నువ్వు ఇక వెళ్ళు. నేను ఆ దొంగ సాధువు పని చూసుకుంటాను" అని శేషయ్యను తిట్టి పంపిస్తూ.
"మూఢ నమ్మకం, అత్యాశ, పిసినారితనం నా కొంప ముంచాయి. ఇక నుండి నిజాయితీగా బతుకుతాను. నన్ను క్షమించండి" అంటూ తల వంచుకొని ఇంటిదారి పట్టాడు శేషయ్య.