అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు రిత్య. ఒకరోజు రిత్యకి ఒక నాణెం దొరికింది. అది ఓ మాయ నాణెం. కానీ రిత్యకు ఆ సంగతి తెలీదుకదా, దాన్ని తీసుకొచ్చి, వాళ్ల ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలో వేసింది.
ఇంక అప్పటినుండి ఆ బియ్యం పెరగటం మొదలు పెట్టింది. బస్తాలోంచి ఎంత బియ్యం తీస్తే అంతకు రెట్టింపు బియ్యం వచ్చి చేరుకునేది బస్తాలో!
ఆ సంగతి తెలిసాక రిత్య ఊళ్ళో అందరికీ‌ బియ్యం ఇవ్వటం మొదలు పెట్టింది. బదులుగా కూరగాయలున్నవాళ్ళు ఆ పాపకు కూరగాయలు ఇచ్చేవాళ్ళు; పప్పులు ఉన్నవాళ్ళు పప్పులు ఇచ్చేవాళ్ళు; ఏమీలేనివాళ్ళు ఆ పాప పేరు చెప్పుకొని ఇంత అన్నం తినేవాళ్ళు- అలా రిత్య సుఖంగా బ్రతకటమే కాదు; ఊళ్ళో మంచి పేరు కూడా సంపాదించుకున్నది.
అయితే ఈ సంగతి తెలుసుకున్నది, అడవిలోని ఒక పులి. అది చాలా చెడ్డది. దానికి ఆ నాణెం మీద ఆశ పుట్టింది. 'కానీ రిత్యనుండి ఆ నాణాన్ని లాక్కునేదెట్లాగ?' ఎంత ఆలోచించినా దానికి ఉపాయం ఏమీ తట్టలేదు.

అందుకని అది నేరుగా రిత్య ఇంటి తలుపు తట్టి- పదునైన తన కోరలు, వాడిగా ఉన్న కాలి గోళ్ళు చూపించి బెదిరించింది- 'మర్యాదగా నీ దగ్గరున్న నాణెం ఇచ్చెయ్..లేకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు!' అని.
'నాణెమా?!అయ్యో, అదిప్పుడు నా దగ్గర లేదే, వచ్చే అమావాస్యనాడు రాత్రికి మా ఇంటికి రా. నీకు ముందుగా ఓ చిన్న పూజ చేసి, నాణెం ఇచ్చి పంపిస్తాను' అన్నది రిత్య ధైర్యంగా.
సరేనని పులి వెళ్ళిపోయాక, రిత్య లెక్కలు వేసుకున్నది- అమావాస్య ఇంకా నాలుగు రోజులున్నది. ఈ నాలుగు రోజుల్లోనూ రిత్య ఇంటికి ఏం చేయాలో అది చేసి పెట్టుకున్నది. దాంతోబాటు 'మా ఇంటికి ఇవాళ్ళ రాత్రికి ఒక అతిథి వస్తున్నాడు. వాడికి పూజ చెయ్యాలట- మీరంతా కట్టెలు, బాడిసెలు, పారలు పట్టుకొని రండి- వాడికి అవంటే చాలా ఇష్టం మరి!' అని ఊరంతా చెప్పి వచ్చింది.
రాత్రి ఇంకా చీకటి పడకనే ఊళ్ళో జనాలంతా రిత్య ఇంటికి చేరుకున్నారు. రిత్య వాళ్లందరినీ ఇంటి చుట్టూతా పొదల్లో మాటు వేసుకొని ఉండమన్నది. ఇదంతా తెలీదుకదా, పులికి? అది దర్జాగా నడచుకొంటూ రిత్య ఇంటికి వచ్చింది.
"అమ్మాయ్!‌తలుపు తియ్! నేను లోపలికి వస్తాను" అని అరిచింది.
రిత్య చప్పుడు చెయ్యలేదు.

"ఎక్కడుంది ఈ పిల్ల?" అనుకొని పులి తలుపును తోసింది. తలుపు కిర్రుమని శబ్దం చేస్తూ తెరచుకున్నది.
పులి అనుమానంగా లోనికి అడుగు పెట్టిందో లేదో, జర్రున జారింది- అక్కడ నేలమీదంతా బఠానీలు పరచి ఉన్నాయి మరి! పులి పోయి ఠపాలున గోడకు కొట్టుకున్నది. లేచి మళ్ళీ జారింది- మళ్ళీ గోడకు కొట్టుకున్నది. ఇట్లా కొన్నిసార్లు జరిగాక, అది వంటింట్లోకి చేరుకొని, కొంచెం‌ ఊపిరి పీల్చుకున్నది.
అంతలో రిత్య అటక మీద పెట్టిన గుడ్డు ఒకటి ఠప్పున దాని తలమీద పడింది. ఆ దెబ్బకు పులికి కళ్ళు తిరిగి నక్షత్రాలు కనబడ్డాయి. గుడ్డు సొన చేదుగా దాని నోట్లోకి కారింది.
పులి 'థూ థూ!' అని ఉమ్మివేస్తూ నీళ్ళకోసం వెతుక్కున్నది.
అక్కడ కనిపించిన కుండలో చెయ్యి పెట్టేసరికి అందులో‌ ఉంచిన తేళ్ళు దాని చేతిని పట్టుకొని కసితీరా కొరికాయి. తేలు కుట్టిన పులికి ఇప్పుడు దిక్కులు తెలీలేదు- అది అటూ ఇటూ పరుగెత్తి, జారి, గోడలకు కొట్టుకొనే సరికి, ఫ్యాను తిరగటం మొదలుపెట్టింది. ఫ్యాను మీదున్న కర్ర సూటిగా వచ్చి దాని ముక్కును పచ్చడి చేసింది!
అంతలో పులికి బయటికి వెళ్ళే దారి కనబడింది. అది ఆ దారి వెంబడి బయటికి వచ్చేసరికి ఊళ్ళో జనాలంతా కట్టెలతోటీ, బాడిసెలతోటీ, గడ్డపారలతోటీ దాని మీదికి దూకారు. వాళ్ల తాకిడికి తట్టుకోలేక పులి ఉక్కిరి బిక్కిరైంది- 'బ్రతికితే అడవిలో బ్రతుక్కుంటాను-మళ్ళీ ఈ పల్లెలో పాదం మోపను దేవుడో' అని మొత్తుకున్నమీదట, జనాలు దాన్ని ప్రాణాలతో వదిలారు. అది ఇక వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పరుగెత్తింది!
"హమ్మయ్య! నా నాణెం నా దగ్గరే భద్రంగా ఉంది!" అని ఊపిరి పీల్చుకున్నది రిత్య.