ప్రపంచంలో పెట్రోలు నిల్వలు తగ్గిపోతున్నాయి; దాంతో అమెరికా వారు తమ సొంత సముద్ర తీరంలోనే పెట్రోలు త్రవ్వితీద్దామని ఆలోచిస్తున్నారట. ఈ సంగతి తెలిసాక ఓ కథ గుర్తొచ్చింది..
ఓ రోజున తమ ఇంట్లో క్యాలండర్ తగిలించుకుందామనుకున్నాడట, నసీరుద్దీన్.
అయితే ఎంత చూసినా క్యాలండర్‌కు అనువైన స్థలం దొరకలేదు.
మంచి గోడ ఉన్న చోట మేకు లేదు. మేకు ఉన్న చోటు క్యాలండర్‌ తగిలించేందుకు వీలుగా లేదు.
చివరికి విసుగొచ్చింది. గోడకు కొత్తగా మేకు కొట్టాల్సిందేననుకున్నాడు.
మేకు పట్టుకొని స్టూలు మీదెక్కి నిలబడ్డాడు.
చూడగా చేతిలో మేకును కొట్టేందుకు సుత్తి లేదు.
"ఒరే, చిన్నోడా!ఇటు రా రా, ఓసారి" పిలిచాడు కొడుకుని.
చిన్నోడు వచ్చాడు-
"పక్కింటికి వెళ్ళి సుత్తి అడిగి తీసుకురా, చిన్నా" చెప్పాడు నసిరుద్దీన్.
చిన్నోడు పరుగెత్తుకుంటూ పక్క వాళ్ళింటికి వెళ్ళి, ఖాళీ చేతుల్తో తిరిగొచ్చాడు -"వాళ్ళు అడిగారు- 'చెక్క మేకా, ఇనప మేకా?' అని. 'ఇనప మేకే' అని చెప్పాను. 'అయితే మేం ఇవ్వం. మా సుత్తి పాడైపోతుంది' అన్నారు వాళ్ళు" చెప్పాడు.
"పిసినిగొట్టులు! వాళ్ళని అడిగీ ప్రయోజనం‌ ఉండదని అనుకుంటూనే ఉన్నాను. వాళ్ల సుత్తి మనకెందుకు? లోకంలో సుత్తులు కరువా? ఇటు ప్రక్క వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళనడిగి సుత్తి తీసుకురా నాయనా" అన్నాడు నసీరుద్దీన్.
పిల్లవాడు అయిష్టంగానే ఇటువైపు వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు, చేతులూపుకుంటూ.
"వాళ్ళింట్లో సుత్తి లేదట" అన్నాడు.
నసీరుద్దీన్‌కి కోపం వచ్చింది- "ఎందుకు లేదు? నాలుగు రోజుల క్రితం వాళ్ళింట్లో సుత్తిని నా కళ్ళారా చూశాను! ఏవో లెక్కలు వేసుకుంటున్నారల్లే ఉంది- పట్టించుకోకు. మన పని జరగటం ముఖ్యం- రెండిళ్ళ అవతల సుల్తాన్ వాళ్ళింట్లో మంచి సుత్తి ఉంది. అడిగి పట్టుకురా" అన్నాడు.
అయితే సుల్తాన్ వాళ్ళూ సుత్తిని ఇవ్వలేదు. "వాళ్ల సుత్తి హ్యాండిల్ విరిగిపోతున్నదట. ఇవ్వమన్నారు" ఉత్త చేతుల్తో తిరిగొచ్చాడు కొడుకు.
"వాళ్ళు ఇవ్వకపోతే ఏమిరా, అబ్బాస్‌ మామ ఇస్తాడు మనకు! పోయిరా" అబ్బాస్‌ మామ ఇంటికి పంపాడు కొడుకుని.
అబ్బాస్‌ వాళ్ళూ సుత్తిని ఇవ్వలేదు. నసీరుద్దీన్ కొడుకు అట్లా ఓ పది ఇళ్ళు చుట్టుకొని వచ్చాడు. ఎవ్వరూ సుత్తిని ఇవ్వలేదు. మేకు పట్టుకొని, స్టూలు ఎక్కి నిల్చొనీ నిల్చొనీ నసీరుద్దీన్‌కు కాళ్ళు నొప్పి పుట్టటం మొదలెట్టాయి.
"పిసినారులు! పిసినారుల ఊరు! ఈ ఊరంతా పిసినిగొట్టులే ఉన్నట్లున్నారు. దీన్ని వదిలేసి వేరే ఊరికి పోతే తప్ప లాభం లేదు! పనికి మాలిన ఊరు, పనికి మాలిన పొరుగువాళ్ళు! ఇంకేం చేస్తాం?! పోరా, చిన్నా, ఇంట్లోకి వెళ్ళి, మన సుత్తే పట్టుకురా పో! పిసినిగొట్టుల ఊర్లో ఇంక వేరే ఏమీ చెయ్యలేం మనం!" మనసారా తిట్టాడు ఉన్న ఊరి జనాలని.
నసీరుద్దీన్ ఏనాడో కొని భద్రంగా దాచిన సుత్తి, ఆ విధంగా '-ఊళ్ళోవాళ్ల పిసినారి తనం కారణంగా ' పనిలోకి వచ్చిందట!

అందరికీ నమస్కారాలతో,
కొత్తపల్లి బృందం.