ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి గ్రామం. చుట్టూతా కొండలు-మధ్యలో ఉంది ఆ పల్లె. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోనులు ఉన్నాయి. అయినా ఎక్కడ వేప చెట్టు ఉంటే అక్కడ ఒక దేవత ప్రతిష్ఠించబడి ఉంది. వానాకాలం, అంటువ్యాధుల సీజన్ మొదలైంది. చికన్ గున్యా, వైరల్ ఫీవర్లు ప్రబలి ఉన్నాయి. పల్లె ప్రజల్లో నమ్మకాలు ఎక్కువ. డాక్టర్ల కంటే మంత్రాలను తంత్రాలను ఎక్కువ నమ్ముతారు. జబ్బు బాగా ముదిరిన తరువాతనే డాక్టరు దగ్గరికి వెళ్తారు.

బలరాముడు, బాలమ్మలకు ఒక్కడే సంతానం. కొడుకు పేరు ప్రసాదు. ప్రసాదు మామూలుగా చాలా చలాకీగా ఉంటాడు. వారం రోజుల నుండి జ్వరం, కీళ్ళ నొప్పులు, వాంతులతో బాధ పడుతున్నాడు. బడికి పోవడం మానేశాడు. రకరకాల నాటు వైద్యం, మంత్రాలు, యంత్రాలు వేయించారు. అయినా జబ్బు నయం కాలేదు. గుండు రాయిలా ఉన్న పిల్లవాడు సన్నగా పీనుగులాగా తయారయ్యాడు.

బలరాముడు, బాలమ్మ దిగులుగా కూర్చుని వున్నారు అరుగుమీద. అదే దారిన వెళుతున్నాడు యంత్రాలు కట్టే ఎర్రిస్వామి.

బలరాముడిని చూసి "ఏం రాముడూ, అంతా బాగున్నారా?" అడిగాడు .

"ఏం బాగులే అన్నయ్యా!" అన్నది బాలమ్మ నీరసంగా.

"ఏమైంది తల్లీ, బిడ్డకు? పీలగా అయిపోయినాడు?" నిలబడి అడిగాడు ఎర్రిస్వామి, ప్రసాద్ ను పరీక్షగా చూస్తూ. "చాలా ఆలస్యం అయిందే. బిడ్డకు రక్తం లేకుండా పోయింది. రక్తం అంతా బాటమ్మ తల్లి తాగేసింది!" అన్నాడు.

"ఏంటి సామీ, మీరనేది?!" పలికారు ఆ దంపతులు.

"మీ బిడ్డకు ఏ జబ్బూ లేదు తల్లీ! రోగం లేదు-రొష్టూ లేదు! అంతా ఆ తల్లి లీల. రేపే అమావాస్య! ఆ తల్లికి శాంతి చేయాలి. నీ బిడ్డ రక్తం మళ్ళీ‌వచ్చేలా చేస్తాను!" అన్నాడు ఎర్రిస్వామి కళ్ళు మూసుకొని.

"అన్ని వైద్యాలు అయ్యాయి సామీ! ఇక మిగిలింది నువ్వూ- ఆ బాటమ్మ తల్లే! కానీయండి" అన్నారు దంపతులిద్దరూ.

మరునాడు బలరాముడి ఇంటికి వచ్చాడు ఎర్రిస్వామి. ఇంటి మధ్యలో ముగ్గు వేశాడు. సంచిలో నుండి పళ్ళెం, చెంబు తీశాడు. "బాటమ్మ దేవతకు ఈ పళ్ళెంలోనే రక్తం తాగిస్తాను. ఇక ఆ తర్వాత ఆ తల్లి నీ బిడ్డకు రక్తం పోస్తుంది" అంటూ పళ్ళాన్ని ముగ్గు మధ్యన ఉంచాడు.

"ఈ చెంబులో లోటాడు నీళ్ళు పోయి బలరాముడూ" అన్నాడు.

బాలమ్మ నీళ్ళు తెచ్చిస్తే, బలరాముడు వాటిని ఎర్రిస్వామికి అందించాడు భక్తిగా కూర్చొని.

ఎర్రిస్వామి చెంబు మీద వేపాకులు మూసి పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ కలిపాడు.

ఆకులు తీసి చూసేసరికి చెంబులోని నీళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాయి!

"బాటమ్మ తల్లి మహిమను చూస్తిరా? నీళ్ళని రక్తంగా మార్చే ఆ తల్లి, నీ బిడ్డకు రక్తం పోయలేదా?" అడిగాడు ఎర్రిస్వామి.

"అవును సామీ! తప్పకుండా పోస్తుంది" అన్నారు దంపతులిద్దరూ, భయభక్తులతో.

"నిజంగా ఆ తల్లికి కోపం వచ్చింది. ఆమె రక్తం తాగబట్టే మన బిడ్డ పీనుగులాగా తయారయ్యాడు!" బలరాముడు భార్యతో అన్నాడు గుసగుసగా.

ఆలోగా ఎర్రిస్వామి చెంబులోని ఎర్ర నీళ్లను పళ్ళెంలో పోసి, ఆ పళ్ళెంలో దీపాన్ని వెలిగించాడు.

దీపపు వెలుగులో ఎర్ర నీళ్లు రక్తాన్ని గుర్తుకు తెస్తున్నాయి దంపతులిద్దరికీ. ఎర్రిస్వామి గడగడా ఏవో మంత్రాలు చదువుతూ ఆపాడు- "జాగ్రత్తగా గమనించండి. బాటమ్మ తల్లి ఈ రక్తాన్ని తాగేస్తుంది!" అంటూ వెలుగుతున్న దీపం పైన చెంబును బోర్లించాడు. మరుక్షణంలో సర్రున శబ్దం చేస్తూ పళ్ళెంలో ఉన్న ఎర్ర నీళ్లన్నిటినీ చెంబు తాగేసింది!

నిశ్చేష్టులైపోయారు బలరాముడు, బాలమ్మ.

చెంబుని, పళ్ళేన్ని తీసుకుని దూరంగా చెట్ల మధ్యకు పోయాడు ఎర్రిస్వామి.

తిరిగి వచ్చాక చెప్పాడు "ఇక నీ బిడ్డకు ఏ ప్రమాదం లేదు. ఒక వారం రోజులు బిడ్డను ఎండలోకి పంపకండి. బయటికి రాకుండా‌చూసుకోండి" అని. వద్దు వద్దంటూనే బలరాముడి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని వెళ్ళాడు కూడా.

ఆ సరికి నెల రోజులు అయ్యింది ప్రసాద్ పాఠశాలకు రాక. ఉపాధ్యాయుడు వన్నప్ప ప్రసాదును వెతుక్కుంటూ వచ్చాడు. 'ప్రసాద్! ప్రసాద్!' అని పిలిచాడు.

'రండి సారూ! నా బిడ్డకు ఆరోగ్యం బాగా లేదు. అందుకు బడికి పంపలేదు' చెప్పింది బాలమ్మ.

'ఏమయింది?' అడిగాడు వన్నప్ప టీచర్.

'బాటమ్మ దేవతకు కోపం వచ్చింది. అందుకు బిడ్డ మెత్తపడినాడు!' చెప్పాడు బలరాముడు.

'డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళారా?' అడిగాడు వన్నప్ప అనుమానంగా.

'పూజ చేసి, దోషం లేకుండా‌చేసినాడు ఎర్రి సామి. వారం రోజుల్లో తగ్గి పోతుంది; అప్పుడు బడికి పంపుతాము సారు!' చెప్పింది బాలమ్మ.

వీళ్ళ మూఢ నమ్మకం అర్థం అయింది వన్నప్ప టీచరుకు. 'ఏం పూజ చేశాడు?' అడిగాడు.

'అదా! అదా!' గుటకలు మింగాడు బలరాముడు.

'ఏం ఫరవాలేదు, చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలి కదా!' అన్నాడు వన్నప్ప.

పూజా విధానం మొత్తం వివరంగా చెప్పింది బాలమ్మ.

'అయ్యో, తల్లీ! ఆ మాత్రం చేయటం నాకూ వచ్చు- రేయ్! శివా! ఒక పళ్ళెం చెంబు తీసుకురా! అట్లాగే ఇంకొక పని చేయి. బడిలోకెళ్ళి ఆంజనేయ సారుతో అడిగి పొటాషియం పర్మాంగనేట్ తీసుకుని తొందరగా రా" అరిచాడు వన్నప్ప.

పళ్ళెం, చెంబు, పొటాషియం పర్మాంగనేటు పలుకులు- వచ్చాయి ఐదు నిముషాల్లో.

పళ్ళెంలో నీళ్ళు పోసాడు వన్నప్ప. "ఈ పళ్ళెంలో నీళ్ళు పోసి మధ్యలో దీపం వెలిగించండి" అన్నాడు.

"సార్! ఎర్రిసామి నీళ్ళను రక్తంగా మార్చాడు" చెప్పాడు బలరాముడు.

"తొందర పడద్దు! నేను కూడా‌నీళ్ళను రక్తంగా మారుస్తాను చూడండి" అంటూ ఆ నీళ్లమీద చేతులు తిప్పుతూ పొటాషియం పర్మాంగనేటు పలుకులను పళ్ళెంలోకి వదిలాడు వన్నప్ప. చూస్తూండగానే అవి కరిగి, నీళ్ళు ఎర్రగా మారాయి.

'ఇవి నీళ్ళే, రక్తం కాదు- ఏమంటే ఇవి పొటాషియం పర్మాంగనేటు కలిసిన నీళ్ళు!' అన్నాడు వన్నప్ప, ఆ నీళ్లతో నిండిన పళ్ళెంలో దీపం‌వెలిగిస్తూ.

బలరాముడు, బాలమ్మ అందరూ‌నోళ్ళు వెళ్లబెట్టి చూశారు.

'ఇదిగో, శివా! ఈ దీపం మీద చెంబును బోర్లించు జాగ్రత్తగా!' అన్నాడు వన్నప్ప. శివ ముందుకొచ్చి చెంబును దీపం మీద బోర్లించాడు.

అందరు చూస్తుండగానే "సర్రున" శబ్దం చేస్తూ పళ్ళెంలోని నీళ్లు కాస్తా చెంబులోకి వెళ్ళిపోయాయి. జనాలు చప్పట్లు చరిచారు. 'ఇదే, ఎర్రిసామి చేసిన మంత్రం. అందరూ అర్థం చేసుకోండి- వెలుగుతున్న దీపం తన చుట్టూ గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను వాడుకుంటుంది. మనం దీపం మీద చెంబును బోర్లించేసరికి, ఆ చెంబులో ఉన్న గాలిలోంచి ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా, అందుకని చెంబులో అల్ప పీడనం ఏర్పడుతుంది. అందువల్ల చెంబుచుట్టూ ఉన్న నీళ్ళు గబగబా చెంబులోకి చేరుకుంటాయి; పీడనం మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఇందులో ఉన్నది శాస్త్రమే తల్లీ, మంత్రం ఏమీ లేదు. చుట్టూ ఉన్నవి రంగునీళ్లయినా, మామూలు నీళ్లయినా- ఏవైనా సరే, అన్నీ చెంబులోకి పోతాయి; ఏమంటే నీళ్ళు మరీ‌ఎక్కువ కాకుండా ఉంటే సరి' వివరించాడు వన్నప్ప.

బలరాముడు, బాలమ్మలకు నోట మాట రాలేదు.

'ప్రసాదును బయటకి తీసుకు రండి' చెప్పాడు వన్నప్ప. ప్రసాదు మెడనిండా తాయత్తులు, దారాలు, గుడ్డ పేలికలు కట్టివున్నాయి. వాడి పరిస్థితి చూసే సరికి వన్నప్పకు కోపంతో రక్తం మరిగినట్లయింది. 'మీరు తొందరగా పట్నం డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళకపోతే మీ బిడ్డ మీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. బయలుదేరండి ఇప్పుడే' అరిచాడు ఆవేశంగా.

ప్రసాదు తల్లిదండ్రులకు ఇక కాదనేందుకేమీ లేకపోయింది. వాడిని తీసుకొని గబుక్కున ఆటో ఎక్కి ధర్మవరం బయలుదేరారు, డాక్టరు దగ్గరికి.

వారం తరువాత మంచి ఆరోగ్యంతో బడికి వచ్చాడు ప్రసాద్. ఇప్పుడు వాడి మెడ చుట్టూ తాయెత్తులేవీ లేవు!