అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పాడుబడిన పెంకుటిల్లు; దాని పక్కన ఒక పెద్ద చెరువు ఉంది. ఆ అడవి నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలోని వాళ్ళు తమ ఆవులను, మేకలను మేతకోసం ఆ అడవికే తీసుకొచ్చేవాళ్ళు. మధ్యాహ్నం సమయంలో వాటిని దగ్గర్లో వదిలి, వాళ్లు ఆ పాడుబడిన ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళు.

అదే ఊళ్ళో రాముడు అనే పేద యువకుడు ఒకడు ఉండేవాడు. వాడికి ఉన్నదల్లా ఒక్కటంటే ఒక్క మేక. తన మేకను కూడా‌ వాడు మేతకోసం అందరిలాగా అడవికి తీసుకెళ్ళి వదిలేవాడు. అటుపైన రోజంతా ఆ పెంకుటింల్లో పడుకుని నిద్రపోతుండేవాడు.

ఎప్పటిలాగానే ఒకరోజున వాడు ఆ పెంకుటింట్లో పడుకొని, ఎట్లా నిద్రపోయాడో మరి, ఇక చీకటి పడినా లేవలేదు. రాత్రి పన్నెండు గంటలప్పుడు ఏదో శబ్దం అవడంతో ఉలిక్కిపడి లేచాడు. బయట అడవిలో పండు వెన్నెల కాస్తున్నది. అంతా నిశ్శబ్దంగా ఉన్నది.

చెరువు దగ్గర మాత్రం, తెల్లగా మెరుస్తున్న గుర్రాలు కొన్ని గుంపుగూడి ఉన్నాయి. వాటన్నిటికీ నుదుటిమీద ఒక కొమ్ము ఉన్నది. తెల్లగా బలంగా ఉన్న ఆ గుర్రాలని చూసే సరికి రాముడు ఉత్సాహం పట్టలేకపోయాడు. వాటిని పట్టుకోవాలని ఉత్సాహంగా అరుస్తూ పరుగుపెట్టాడు.

అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న గుర్రాలన్నీ వీడి అరుపులు వినేసరికి ఎటుపడితే అటు పరుగు తీశాయి. చూస్తూండగానే వాటి రెక్కలు విచ్చుకున్నాయి. అవన్నీ ఆకాశంలోకి ఎగిరి కనుమరుగౌతుంటే రాముడు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు.

అయితే ఆ తర్వాత వాడిలో ఆలోచన మొదలైంది. 'అయ్యో! నేను నిశ్శబ్దంగా వెళ్తే బాగుండేది కదా, కనీసం ఒక్క గుర్రాన్నయినా పట్టుకునేవాడిని!' అని విచారం వేసింది వాడికి. 'దానిదేముందిలే- ఇక్కడే ఉంటాను; రేపు రాత్రి గుర్రాలు వచ్చాక, మెల్లగా వెళ్ళి వాటిని పట్టుకుంటాను!' అనుకున్నాక, వాడికి మళ్లీ ఉత్సాహం వచ్చేసింది.

తరువాతి రోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి ఆకాశంలోంచి మెల్లగా దిగి వచ్చాయి గుర్రాలు.

రాముడు ఈసారి చప్పుడు చేయలేదు. మెల్లగా చెట్లను చాటు చేసుకుంటూ చెరువు దగ్గరకి వెళ్ళి, తటాలున ఒక గుర్రాన్ని పట్టుకున్నాడు. ఆ గుర్రం గట్టిగా సకిలించి పెనుగులాడేసరికి, మిగిలిన గుర్రాలుకూడా సకిలించాయి. అదేదో సంకేతం అన్నట్లు, గుర్రాలన్నీ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ఆకాశంలో ప్రయాణించటం మొదలు పెట్టాయి!

గుర్రాన్ని గట్టిగా పట్టుకున్న రాముడు కూడా దానితోబాటు ఆకాశంలోకి ఎగిరాడు. గుర్రం వేగానికి రాముడికి ఊపిరాడనట్లు అయింది. అయినా వాడు గుర్రాన్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి గుర్రం వేగం తగ్గింది. రాముడు కళ్ళు తెరిచి చూసేసరికి అవన్నీ ఒక పెద్ద భవనంలో వాలుతున్నాయి. చూస్తూండగానే ఆ గుర్రాలన్నీ అందమైన అప్సరసలుగా మారిపోయాయి.

రాముడు ఆశ్చర్యంతో నోరు తెరిచి వాళ్ల వైపు చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళంతా రాముడి చుట్టూ చేరి "ఓ మనిషీ! ఇన్నేళ్ళుగా మా గురించి మానవ మాత్రుడికి తెలీదు. ఇప్పుడు తెలిసో తెలీకో, నువ్వు మమ్మల్నితాకావు. మా నియమం ప్రకారం మమ్మల్ని తాకిన వాళ్లు ఇక మనుష్యలోకంలో ఇమిడే అవకాశం లేదు. నువ్విక జీవితాంతం ఇక్కడే ఉండాలి, తప్పదు' అన్నారు కఠినంగా.

"ఆహా! నాకంత అదృష్టమా?!" అనుకున్నాడు రాముడు. సంతోషంగా తల ఊపి "సరేలే, ఇక్కడే ఉంటాను' అన్నాడు. ఇక ఆ రోజు నుండీ అందమైన దుస్తులు ధరిస్తూ, రకరకాల పిండి వంటలు తింటూ అక్కడే ఉండటం మొదలుపెట్టాడు.

అయితే కొన్ని రోజులు గడిచేసరికి, వాడికి ఇక ఆ స్థలం అంటే అయిష్టం మొదలయింది-'స్వర్గంలో ఎవరూ ఎవరినీ పట్టించుకోవటం లేదు! ఇంట్లో అయితే అమ్మ, నాన్న అందరూ తనని ఎంతగానో ఇష్టపడుతుంటారు. తన మేకకి తనంటే ఎంత ఇష్టమో!' అలా అనుకునేసరికి వాడికి అమ్మ, నాన్న, మేక గుర్తుకువచ్చేశారు. 'కానీ అక్కడికి వెళ్లటానికి ఇక వీలు లేదు. ఒకసారి ఇక్కడికి వచ్చేశాక ఇక అంతే!' దాంతో వాడికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎంత స్వర్గంలో ఉన్నా,దిగులు మొదలైంది.

అయితే ఆ సంగతిని గమనించిందొక అప్సరస. "ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నావు నువ్వు?" అని అడిగింది దయతో.

"అయ్యో, ఏం చెప్పేది? నాకు కూడా మీలాగే ఎప్పుడైనా భూలోకం వెళ్ళి వింతలన్నీ చూడాలని ఉంది" అన్నాడు రాము ఆమెతో.

"నీకు గుర్రంగా మారే విద్య రాదుగా, రెక్కలు కూడా లేవు. ఇక నువ్వు మాతో ఎట్లా రాగలవు?" అడిగింది ఆ అప్సరస.

"ఒక్కసారి నన్నునీ వీపు మీద ఎక్కించుకొని తీసుకు వెళ్ళొచ్చు కదా" అన్నాడు రాముడు వేడుకుంటున్నట్లు.

ఆ అప్సరసకి వాడి బాధ అర్థమైంది. "సరేలే! ఈ రోజు రాత్రి మేమందరం భూలోకానికి వెళ్తాం కదా, అప్పుడు నేను అందరికంటే చివరన బయలు దేరుతాను. మిగతా వాళ్లెవరికీ తెలీకుండా వచ్చి నా వీపుమీద కూర్చో మరి" చెప్పింది ఆ అప్పరస.

ఆ రోజు మధ్యరాత్రి వేళ అన్ని గుర్రాలు వెళ్ళిన తరువాత రాముడు ఆ అప్సరస గుర్రం మీద ఎక్కి గట్టిగా పట్టుకున్నాడు. కొద్ది క్షణాల తరువాత వాడు కళ్ళు తెరిచి చూస్తే క్రింద చెరువు కనబడింది. వెంటనే వాడు చెరువులోకి ఎగిరి దూకాడు.

ఆ నీటి శబ్దం విని అన్ని గుర్రాలు మాయం అయ్యాయి. వాడిని తీసుకొచ్చిన గుర్రం కూడా మాయం అయిపోయింది. వాడు సంతోషపడి ఆ పాడు బడిన పెంకుటింట్లో ఆ రాత్రి నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారిన తరువాత వాడు వాడి ఊరికి వెళ్ళ్తూ ఎదురు వచ్చిన వారందరికీ జరిగినదంతా చెప్పాడు. వాళ్ళంతా "పోరా! పగటికలలు కనేవాడా!" అంటూ నవ్వారు. ఒక్కడు కూడా వాడిని నమ్మలేదు.

దిగాలు ముఖం వేసుకుని ఇంటికి చేరిన వాడిని చూసిన వాడి అమ్మ " ఎక్కడికెళ్ళావురా? " అంది. " మేక ఏదిరా వెధవా! " అన్నాడు వాడి నాన్న.

" పగటి కలలు కంటూ ఆ మేకని ఆ అడవిలోనే వదిలేసి వచ్చావా? ఫో! పోయి మేకని వెతికి తీసుకురారా" అని వాడిని తొందర పెట్టాడు వాడి నాన్న.

"బిడ్డ అన్నం తిని రెండు రోజులయింది. అన్నం తిని వెళ్ళి వెతుకుతాడులే " అంటూ అమ్మ వాడిని లోపలకి తీసుకుపోయింది.
గుర్రాలు, అప్సరసలు అంతా నిజమో కలో అర్థం కాలేదు పాపం వాడికి.

మీకు అర్థం అయిందా పగటి కలలు కనకూడదని?