విజ్ఞాన వర్మ మహారాజు గారికి కళలంటే చాలా గౌరవం. వివిధ శాస్త్రాలతో బాటు రకరకాల విద్యలనుకూడా ఆదరించేవాడాయన. ఆయన ఆస్థానంలో కళాకారులకు, పండితులకు ఇరువురికీ ప్రాధాన్యత ఉండేది.

ఒకసారి పొరుగురాజ్యం నుండి కళాకారుడొకడు రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. మైనంతో చేసిన మొక్కనొకదాన్ని తీసుకొని వచ్చాడతను. సహజంగా ఉండే మొక్కకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన నైపుణ్యంతో రూపొందిందామొక్క. పొరుగు దేశపు కళాకారుడు ఆ మొక్కతో పాటు ఒక నిజమైన మొక్కను కూడా తెచ్చాడు. రెండింటినీ వేరు వేరు మట్టి కుండల్లో పెట్టాడు. రెండింటినీ ఒక చోటికి చేర్చాడు.

"మహారాజా! ఈ రెండు మొక్కల్లో ఒకటి భగవంతుని సృష్టి; ఒకటి నా సృష్టి. నా సృష్టి భగవంతుని సృష్టికి ఏమాత్రం తీసిపోదనే నా నమ్మకం. దీనికి మీరు, మీ రాజ్యంలోని పండితులు, పామరులు అందరూ సాక్షులవ్వాలని నా కోరిక. మీ రాజ్య ప్రజల్లో ఎవరైనా ఈ రెండు మొక్కల్లో ఏది మైనపు బొమ్మో, ఏది అసలు మొక్కో కనుగొనగలరేమో చూడండి. మొక్కలను ముట్టుకోరాదు; తెంపరాదు. నేను ఈ మొక్కలను ఇప్పటికే అనేక దేశాల్లో ప్రదర్శించి ఉన్నాను. ఎక్కడా, ఎవ్వరూ అసలు మొక్కను గుర్తించలేకపోయారు. మీ ప్రజల తెలివితేటలకు ఇది ఒక పరీక్ష అనుకోండి. అసలు మొక్కను గుర్తించమనండి" అన్నాడతను, రాజుతో.

రాజుగారు రెండు మొక్కల్నీ‌ పరీక్షగా చూశారు. రెండూ సహజంగానే ఉన్నాయి. రెండూ‌ గాలికి అల్లల్లాడుతున్నాయి. రాజుగారు తమ వృక్ష శాస్త్రజ్ఞులకు, రసాయన శాస్త్రజ్ఞులకు, ఉద్యానవనాధికారులకు అవకాశం ఇచ్చారు. ఆ రెండు మొక్కల్లో ఏది అసలో, ఏది నకలో ఎవ్వరూ గుర్తించలేకపోయారు.

శాస్త్రవేత్తల తర్వాత సభలో ఉన్న పెద్ద పెద్ద అధికారులందరికీ అవకాశం వచ్చింది. అందరూ శ్రద్ధగా చూసేవాళ్ళే; అందరూ పెదవి విరిచేవాళ్ళే. ఎవ్వరూ‌ అసలు మొక్కను గుర్తించలేకపోయారు.

రాజుగారు ఓటమిని అంగీకరించబోయారు.

ఆ సమయంలో ముందుకొచ్చాడు ఒక తోటమాలి. "అసలు మొక్క ఏదో నేను గుర్తించి చెబుతాను మహారాజా!" అన్నాడు.

సభికులందరూ నవ్వారు. "గొప్ప గొప్ప వాళ్ళే ఏమీ చెప్పలేక పోయారు, నువ్వేం చెప్తావులే" అని అతన్ని ఎగతాళి చేసారు.

"ఈ మొక్కల్ని ఉన్నవాటిని ఉన్నట్లు కప్పేసేంత పెద్ద గాజు పాత్రలు రెండు తెప్పించండి మహారాజా!" అన్నాడు తోటమాలి. సభంతా నిశ్శబ్దం అయింది. 'ఇతను ఏదో చేసి చూపెడతాడు' అనిపించిందందరికీ.

రాజుగారు రెండు గాజు కుప్పెలు- పెద్ద పెద్దవి- తెప్పించారు.

వాటిని రెండు కుండీలమీదా బోర్లించాడు తోటమాలి.

ఐదు నిముషాల్లో తేడా తెలిసిపోయింది. ఒక గాజు కుప్పె మసకబారింది. అసలు మొక్క శ్వాసిస్తూ వదిలిన నీటి ఆవిరి, ఆ గాజు కుప్పెలో ద్రవీభవించింది. మైనపు మొక్కను కప్పిన గాజు పాత్ర మటుకు ఉన్నదున్నట్లు ఉండిపోయింది.

సభంతా హర్షధ్వానాలతో నిండింది. పొరుగు దేశపు కళాకారుడు తోటమాలిని అభినందించాడు. విజ్ఞాన వర్మ తన మెడలో ఉన్న రత్న హారాన్ని తోటమాలి మెడలో వేసాడు.

తోటమాలి మటుకు పాత్ర నిండుగా నీళ్ళు తెచ్చి నిజం మొక్కకు పోసాడు!